Shinde-Narwekar meeting: స్పీకర్ నిర్వాకంపై సుప్రీంకోర్టుకు ఫిర్యాదు
ABN, Publish Date - Jan 09 , 2024 | 05:14 PM
ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాల్సిన మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ తన తీర్పు వెలువరించడానికి ముందే ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను కలుసుకోవడం కలకలం రేపింది. ఈ పరిణామంపై శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం కన్నెర్ర చేసింది. సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
న్యూఢిల్లీ: ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాల్సిన మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ (Rahul Narwekar) తన తీర్పు వెలువరించడానికి ముందే ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde)ను కలుసుకోవడం కలకలం రేపింది. ఈ పరిణామంపై శివసేన ఉద్ధవ్ థాకరే (Shiv Sena UBT) వర్గం కన్నెర్ర చేసింది. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జనవరి 7న సీఎంను స్పీకర్ కలుసుకోవడం తీవ్ర అభ్యంతరకరమని ఆ పార్టీ నేత సునీల్ ప్రభు అత్యున్నత న్యాయస్థానానికి ఫిర్యాదు చేశారు.
స్పీకర్ ప్రవర్తన రాజ్యాంగ బద్ధమైన పదవికి న్యాయం చేసేలా, పదవికి వన్నెతెచ్చేలా ఉండాలని, అయితే నిష్పాక్షిక నిర్ణయం తీసుకునే విషయంలో ఆయన ప్రవర్తన అనుమానాలకు తావిస్తోందని శివసేన యూబీటీ తరఫు న్యాయవాదులు నిషాంత్ పాటిల్, రాజేష్ ఇనాందర్ తెలిపారు. ఈనెల 7న సీఎంను ఆయన నివాసంలో స్పీకర్ నార్వేకర్ కలుసుకున్నట్టు వారు తెలిపారు.
ఉద్ధవ్ థాకరే శివసేనపై గత ఏడాది తిరుగుబాటు బావుటా ఎగుర వేసిన షిండే, 48 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో చేతులు కలిపారు. దీంతో థాకరే సారథ్యంలోని మహావికాస్ అఘాడి ప్రభుత్వం కుప్పకూలింది. షిండే ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. షిండే, ఆయన వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేయాలని స్పీకర్‌కు థాకరే వర్గం ఫిర్యాదు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు సీజేఐ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం స్పీకర్‌కు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. 2023 డిసెంబర్ 31వ తేదీలోగా స్పీకర్ తన నిర్ణయం ప్రకటించాలంటూ గడవు విధించింది. స్పీకర్ విజ్ఞప్తితో ఆ గడువును డిసెంబర్ 10వ తేదీకి అత్యున్నత న్యాయస్థానం పొడిగించింది. అయితే, స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించడానికి మూడు రోజుల ముందే సీఎంను కలుసుకోవడం శివసేన యూబీటీ వర్గాన్ని ఆందోళనకు గురిచేసింది.
Updated Date - Jan 09 , 2024 | 05:20 PM