Ajit Doval: ‘ఎన్ఎస్ఏ’ చీఫ్‌గా అజిత్ దోవల్ మళ్లీ బాధ్యతలు.. అసలు ఆయన ఎవరు?
ABN, Publish Date - Jun 13 , 2024 | 07:13 PM
జాతీయ భద్రతా సలహాదారుగా (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ మరోసారి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో..
జాతీయ భద్రతా సలహాదారుగా (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ (Ajit Doval) మరోసారి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రభుత్వంలో ఆయన ఈ బాధ్యతలు చేపట్టడం ఇది మూడోసారి. 2014లో ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దోవల్ ఎన్‌ఎస్‌ఏగానే కొనసాగుతున్నారు. 2019లో బీజేపీ భారీ మెజారిటీతో తిరిగి అధికారంలోకి రావడంతో.. ఆయనకు అవే బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఎన్ఎస్ఏగా నియమితులయ్యారు. జూన్ 10 నుంచే ఆయన బాధ్యతల్లో ఉన్నారని కేబినెట్ నియామకాల కమిటీ వెల్లడించింది. దోవల్ నియామకం.. ప్రధాని మోదీ పదవీకాలం ముగిసేవరకూ లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకూ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఇక ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీగా డాక్టర్ పీకే మిశ్రాను (PK Mishra) నియమితులయ్యారు.
అసలు అజిత్ దోవల్ ఎవరు?
* అజిత్ దోవల్ 1968 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆయన 1945 జనవరి 20న జన్మించారు. ఆయన తండ్రి మేజర్ గుణానంద దోవల్ భారత సైన్యంలో అధికారిగా పనిచేశారు.
* ఉగ్రవాద నిరోధక నిపుణుడిగా దోవల్ పేరొందారు. ప్రధానికి వ్యూహాత్మక ఆలోచనలు, కార్యాచరణ ప్రణాళికలపై సూచనలు ఇస్తుంటారు.
* పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌లలో రహస్య గూఢచారిగా పని చేసిన ఆయన ఇండియన్ ‘జేమ్స్ బాండ్’గా పేరొందారు.
* విదేశీ గూఢచార సంస్థ ‘రా’ (RAW)ను నిర్వహిస్తున్న ఆయన.. ప్రధాని ప్రతినిధిగా పీ-5 దేశాలతోపాటు ఇరుగుపొరుగు దేశాల వ్యవహరాలు చూసుకుంటారు.
* 2017లో డోక్లామ్ పీఠభూమిలో, 2020లో తూర్పు లడఖ్‌లో చైనా ఆర్మీ దురాక్రమణను ఎదుర్కోవడంలో అజిత్ దోవల్ అత్యంత కీలక పాత్ర పోషించారు.
* చైనాతో సరిహద్దు సమస్యను పరిష్కరించడంలో భారత ప్రత్యేక ప్రతినిధిగా వ్యవహరించారు. పంజాబ్‌లో ఐబీ ఆపరేషనల్ చీఫ్‌గా, కశ్మీర్‌లో అదనపు డైరెక్టర్‌గా పనిచేశారు.
* లండన్‌లో పనిచేస్తున్నప్పుడు ఖలిస్తానీ తీవ్రవాదాన్ని, ఇస్లామాబాద్‌లో పనిచేస్తున్నప్పుడు పాకిస్తాన్ జిహాద్‌ను హ్యాండిల్ చేయడంలో దోవల్ తన పనితనం చాటారు.
Read Latest National News and Telugu News
Updated Date - Jun 13 , 2024 | 07:13 PM