Srinagar : దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని జమ్మూకశ్మీర్‌లో ఆరుగురి డిస్మిస్
ABN, Publish Date - Aug 04 , 2024 | 05:49 AM
దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఆరుగురిని జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ఉద్యోగాల నుంచి తొలగించింది. వీరిలో ఐదుగురు పోలీసులు, ఒక ఉపాధ్యాయుడు ఉన్నట్టు అధికారులు శనివారం వెల్లడించారు.
శ్రీనగర్, ఆగస్టు 3: దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఆరుగురిని జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ఉద్యోగాల నుంచి తొలగించింది. వీరిలో ఐదుగురు పోలీసులు, ఒక ఉపాధ్యాయుడు ఉన్నట్టు అధికారులు శనివారం వెల్లడించారు. వారిని విధుల నుంచి తొలగించడానికి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా రాజ్యాంగంలోని ఆర్టికల్ 311(2)(సీ)ని ప్రయోగించారని చెప్పారు.
ఎవరైనా ఉద్యోగులు ప్రభుత్వ విధుల్లో కొనసాగడం వల్ల రాష్ట్ర భద్రతకు ముప్పు అని రాష్ట్రపతి లేదా గవర్నర్ భావించినట్లైతే సాధారణ ప్రక్రియను అనుసరించకుండానే వారిని ఉద్యోగాల నుంచి తొలగించే అధికారాన్ని ఈ ఆర్టికల్ కల్పిస్తుంది.
హెడ్ కానిస్టేబుల్ ఫరూక్ అహ్మద్ షేక్, సెలక్షన్ గ్రేడ్ కానిస్టేబుళ్లు ఆసిఫ్ దీన్, ఖాలిద్ హుస్సేన్ షా, ఇర్షాద్ అహ్మద్ చాకూ, కానిస్టేబుల్ రెహ్మత్ షా, ఉపాధ్యాయుడు నజం దీన్ ఉగ్రవాద సంబంధిత, తీవ్రమైన దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్టు ఇంటెలిజెన్స్, దర్యాప్తు సంస్థలు గుర్తించాయని అధికారులు తెలిపారు. వీరంతా మాదక ద్రవ్యాల విక్రయంతోపాటు హిజ్బుల్ ముజాహిదీన్, లష్కరే తాయిబా ఉగ్రవాద సంస్థలకు క్షేత్రస్థాయి కార్యకర్తలుగా పనిచేస్తున్నారని చెప్పారు.
Updated Date - Aug 04 , 2024 | 05:49 AM