Cabin Luggage: విమానప్రయాణికులకు అలర్ట్.. క్యాబిన్ లగేజీ నిబంధనల్లో మార్పు!
ABN, Publish Date - Dec 28 , 2024 | 07:49 AM
ఎయిర్‌పోర్టు కార్యకలాపాలు మరింత సరళతరం చేసేందుకు బీసీఏఎస్ కీలక నిబంధన తెచ్చింది. ఇకపై విమానప్రయాణికుల క్యాబిన్ బ్యాగేజీ బరువు 7 కేజీలకు మించరాదని పేర్కొంది.
ఇంటర్నెట్ డెస్క్: విమానప్రయాణం మరింత సౌకర్యవంతంగా చేసే దిశగా బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) హ్యాండ్ లగేజీకి సంబంధించి కీలక మార్పు చేసింది. దీని ప్రకారం, వచ్చే నెల నుంచీ ప్రయాణికులు విమానంలోకి తమ వెంట ఒక క్యాబిన్ బ్యాగును మాత్రమే తీసుకెళ్లాలి. దేశీయ ప్రయాణికులతో పాటు విదేశాలకు వెళ్లే వారికీ ఈ నిబంధన వర్తిస్తుందని బీసీఏఎస్ పేర్కొంది. విమానప్రయాణికుల సంఖ్య నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో ఎయిర్‌పోర్టులో కార్యకలాపాలు మరింత సులభంగా సాగేందుకు ప్రభుత్వం ఈ నిబంధన ప్రవేశపెట్టినట్టు బీసీఏఎస్ వెల్లడించింది.
ఈ చర్యతో ఎయిర్‌పోర్టుల్లో సెక్యూరిటీ చెక్ పాయింట్ల వద్ద రద్దీ తగ్గి కార్యకలాపాలు మరింత వేగంగా సాగుతాయని బీసీఏఎస్ చెబుతోంది. ఎయిర్‌పోర్టుల్లో ప్యాసెంజర్ల తనిఖీలు మరింత వేగవంతం చేసేందుకు బీసీఏఎస్, సీఐఎస్ఎఫ్ ఈ నిబంధనను అమలు చేస్తున్నాయి (National).
నిబంధనలు ఇవీ..
కొత్త నిబంధనల ప్రకారం, ప్రయాణికులు తమ వెంట ఒకే ఒక క్యాబిన్ బ్యాగును విమానంలోకి తీసుకెళ్లేందుకు అనుమతి ఉంది. బ్యాగు గరిష్ఠ బరువు 7 కేజీలకు మించరాదు. మిగతా లగేజీని చెకిన్‌గా తరలిస్తారు.
ఇక బ్యాగు సైజు 55 సెంటీమీటర్ల ఎత్తు, 40 సెంటీమీటర్ల పొడవు, 20 సెంటీమీటర్ల వెడల్పునకు మించి ఉండకూడదు. ఎయిర్‌లైన్స్ అన్నింటికి ఒకే నిబంధనలు వర్తించేలా, లగేజీ తనఖీలు సులభతరం చేసేలా ఈ మార్పు ప్రవేశపెట్టారు.
బరువు, సైజులకు సంబంధించి పరిమితి దాటిన వాటిపై అదనపు చార్జీలు విధిస్తారు.
PM Modi: మన్మోహన్ జీవితం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయక పాఠం
మే 2 తేదీకంటే ముందు కొన్న టిక్కెట్లకు పాత క్యాబిన్ బ్యాగేజీ పాలసీనే వర్తిస్తుంది. దీని ప్రకారం ఆయా ప్రయాణికులు ఎకానమీలో 8 కేజీల బరువున్న బ్యాగు, ప్రీమియం ఎకానమీలో 10 కేజీలు, ఫస్ట్ లేదా బిజినెస్ క్లాసుల్లో 12 కేజీల వరకూ క్యాబిన్ బ్యాగుకు అనుమతి ఉంటుంది. ఈ తేదీకంటే ముందు కొనుగోలు చేసి ఆ తరువాత ప్రయాణతేదీని మార్చుకుంటే మాత్రం సవరించిన నిబంధన వర్తిస్తుంది.
తాజా మార్గదర్శకాలకు అనుగూణంగా ఇండిగో, ఎయిర్‌ఇండియా సహా అన్ని విమానయాన సంస్థలు తమ నిబంధనలకు మార్పులు చేశాయి. చివరి నిమిషంలో ఎటువంటి ఇబ్బందీ కలగకుండా రూల్స్ గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలని ప్రయాణికులకు సూచించాయి. కొత్త నిబంధనలతో ఎయిర్‌పోర్టు కార్యకలాపాలు మరింత సమర్థవంతంగా నిర్వహించొచ్చని చెబుతున్నారు. చెక్ పాయింట్స్ వద్ద తనీఖల కారణంగా జరిగే జాప్యం చాలా వరకూ తగ్గుతుందని అంటున్నారు.
Updated Date - Dec 28 , 2024 | 07:58 AM