సజ్జల భార్గవకు సుప్రీంలో చుక్కెదురు
ABN, Publish Date - Dec 03 , 2024 | 03:28 AM
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో... వైసీపీ సోషల్ మీడియా విభాగం మాజీ ఇన్‌చార్జి సజ్జల భార్గవరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.
కేసులు కొట్టేయాలన్న పిటిషన్‌పై విచారణకు నిరాకరణ
దుర్భాషలాడేవాళ్లు చట్టపర చర్యలు ఎదుర్కోవాల్సిందే
విజ్ఞప్తులేవైనా హైకోర్టుకే చెప్పుకోవాలని స్పష్టీకరణ
న్యూఢిల్లీ, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో... వైసీపీ సోషల్ మీడియా విభాగం మాజీ ఇన్‌చార్జి సజ్జల భార్గవరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన కేసులు కొట్టివేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఈ పిటిషన్‌ను ఆయన గతనెల 22న సుప్రీంకోర్టులో దాఖలుచేశారు. దానిపై సోమవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా, పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, సిద్ధార్థ్ దవే వాదనలు వినిపించారు. పాత విషయాలకు కొత్త చట్టాల ప్రకారం కేసులు పెడుతున్నారని సిబల్ వాదించారు. ఒకే సంఘటనకు సంబంధించి అనేక కేసులు నమోదు చేస్తున్నారన్నారు.
అయితే, దీనిపై సిద్ధార్థ లూథ్రా అభ్యంతరం వ్యక్తం చేశారు.
చట్టాలు ఎప్పటివన్నది ముఖ్యం కాదని, మహిళలపై అసభ్య పోస్టులను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు విచ్చలవిడిగా అసభ్యకర పోస్టులు పెట్టడంలో భార్గవరెడ్డి కీలక సూత్రధారి అని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దర్యాప్తునకు భార్గవరెడ్డి సహకరించడం లేదన్నారు. ఇరుపక్షాల వాదనల అనంతరం ధర్మాసనం.. భార్గవరెడ్డి పిటిషన్‌పై జోక్యానికి నిరాకరించింది. ఇటువంటి విషయాల్లో తమకెలాంటి సానుభూతి లేదని తెలిపింది. దుర్భాషలాడే వాళ్లెవరైనా చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సిందేనని తేల్చిచెప్పింది. భార్గవరెడ్డి రెండువారాలల్లోగా హైకోర్టుకు వెళ్లవచ్చని, అప్పటివరకు అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ ఉంటుందని తెలిపింది. ఇరుపక్షాల వాదనలు విని నిర్ణయం తీసుకునే ేస్వచ్ఛ హైకోర్టుకు ఉంటుందని స్పష్టం చేసింది. విజ్ఞప్తులు ఏమైనా ఉంటే హైకోర్టు ముందు చెప్పుకోవచ్చని పిటిషనర్‌కు సూచించింది. కాగా, సెక్షన్ 111ను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేసి అక్రమ కేసులు పెడుతున్నదని, వరుస అరెస్టులకు పాల్పడుతోందని సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి సోమవారం ఢిల్లీలో ఆరోపించారు. ఈ ఏడాది జూలై 1కి ముందు జరిగిన ఘటనలకు సెక్షన్ 111 వర్తించదని పొన్నవోలు తెలిపారు.
Updated Date - Dec 03 , 2024 | 03:28 AM