Supreme Court: మీ క్షమాపణలు మాకొద్దు.. చర్యలకు సిద్ధంగా ఉండండి..
ABN, Publish Date - Apr 11 , 2024 | 07:51 AM
పతంజలి ఆయుర్వేద సంస్థ(Patanjali Ayurved) వ్యవస్థాపకుడైన బాబా రాందేవ్(Baba Ramdev), ఆ సంస్థ ఎండీ బాలకృష్ణపై(Balkrishna) సుప్రీంకోర్టు(Supreme Court of India) మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ కేసు నేపథ్యంలో న్యాయస్థానానికి బేషరతుగా సంపూర్ణ క్షమాపణలు చెబుతూ వారు సమర్పించిన అఫిడవిట్‌ను..
తప్పుచేస్తే తప్పకుండా బాధపడాల్సిందే..
ఈ కేసులో మేం ఉదారంగా వ్యవహరించం
క్షమాపణ అఫిడవిట్‌ను కోర్టుకు సమర్పించే కన్నా ముందే మీడియాకు విడుదల చేశారు
విదేశీ పర్యటనల పేరుతో వ్యక్తిగత హాజరు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నాలు
కోర్టు ధిక్కరణ కేసులో రాందేవ్‌బాబా, బాలకృష్ణపై సుప్రీం ధర్మాసనం తీవ్ర ఆగ్రహం
పతంజలి సంస్థతో కుమ్మక్కయ్యారంటూ ఉత్తరాఖండ్ లైసెన్సింగ్ అధికారులపై ధ్వజం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): పతంజలి ఆయుర్వేద సంస్థ(Patanjali Ayurved) వ్యవస్థాపకుడైన బాబా రాందేవ్(Baba Ramdev), ఆ సంస్థ ఎండీ బాలకృష్ణపై(Balkrishna) సుప్రీంకోర్టు(Supreme Court of India) మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ కేసు నేపథ్యంలో న్యాయస్థానానికి బేషరతుగా సంపూర్ణ క్షమాపణలు చెబుతూ వారు సమర్పించిన అఫిడవిట్‌ను జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ అమానుల్లా నేతృత్వంలోని ధర్మాసనం తిరస్కరించింది. ఈ కేసులో ఉదారంగా వ్యవహరించలేమని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అలోపతిని (ఆధునిక వైద్యాన్ని) కించపరిచేలా.. పతంజలి సంస్థ, బాబా రాందేవ్ తరచుగా ప్రకటనలు చేయడాన్ని, వాణిజ్య ప్రకటనలు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గత ఏడాది సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇకపై ఆ తరహా తప్పుడు వాణిజ్య ప్రకటనలు ఇవ్వబోమని పతంజలి సంస్థ అప్పట్లో అత్యున్నత న్యాయస్థానానికి హామీ ఇచ్చింది.
కానీ, ఆ తర్వాత కూడా తన తీరు మార్చుకోకుండా అదే ధోరణి కొనసాగించడంతో కోర్టు ఆ సంస్థకు ఈ ఏడాది ఫిబ్రవరిలో ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులకు జవాబివ్వకపోవడంతో.. బాబా రాందేవ్, బాలకృష్ణ తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. దీంతో పతంజలి ఎండీ బాలకృష్ణ కోర్టుకు క్షమాపణలు చెబుతూ ఒక అఫిడవిట్ దాఖలు చేశారు. కానీ, అందులో ఆయన డ్రగ్స్ అండ్ మ్యాజికల్ రెమెడీస్ (అబ్జెక్షనబుల్ అడ్వర్టైజ్‌మెంట్స్) యాక్ట్, 1954ను పాత చట్టంగా అభివర్ణించారు. ఆయుర్వేదం శాస్త్రీయత రుజువుకాని సమయంలో రూపొందించిన చట్టంగా పేర్కొన్నారు. దీంతో సుప్రీంకోర్టు ఆ అఫిడవిట్‌ను తిరస్కరించి.. మరో అఫిడవిట్ దాఖలు చేయడానికి అవకాశం ఇచ్చింది. ఈ క్రమంలోనే రాందేవ్‌బాబా, బాలకృష్ణ.. సుప్రీంకోర్టుకు క్షమాపణ చెబుతూ తాజా అఫిడవిట్ దాఖలు చేశారు. బుధవారం ఈ కేసు విచారణకు వచ్చింది.
ఈ సందర్భంగా ధర్మాసనం పతంజలి సంస్థపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీంతో ఆ సంస్థ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ.. ‘మనుషులన్నాక తప్పులు చేస్తారు’ అంటూ నచ్చజెప్పే ధోరణిలో మాట్లాడబోయారు. ఆ సమయంలో జోక్యం చేసుకున్న జస్టిస్ హిమా కోహ్లీ.. ‘‘అందుకు వారు బాధపడాల్సిందే. ఈ కేసులో మేం ఉదారంగా వ్యవహరించదల్చుకోలేదు’’ అని తేల్చిచెప్పారు. క్షమాపణలు కేవలం కాగితం మీదే ఉన్నాయి తప్ప వారి ఆలోచనల్లో మార్పు కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేయబోమంటూ గతంలో కోర్టుకు వాగ్దానం చేసి దాన్ని తప్పారు. ఇప్పుడు మీరు చెప్పే క్షమాపణను కూడా అలాంటిదేనని మేం ఎందుకు భావించకూడదు?’’ అని నిలదీశారు. ‘‘ఈ క్షమాపణ విషయంలో మేం కన్విన్స్ కాలేదు. దీన్ని తిరస్కరిస్తున్నాం’’ అని కుండబద్దలుగొట్టారు. దీనిపై బహిరంగ క్షమాపణ చెప్పేందుకు తన క్లయింట్లు సిద్ధంగా ఉన్నారని రోహత్గీ చెప్పినప్పటికీ.. కోర్టు అందుకు అంగీకరించలేదు. ‘‘మీరు కోర్టు పట్ల ఎలా నిర్లక్ష్యంతో వ్యవహరించారో, అలాగే మీ క్షమాపణల పట్ల మేమెందుకు వ్యవహరించకూడదు. మాకు క్షమాపణలు చెప్పడానికి ముందే మీరు అఫిడవిట్లను మీడియాకు పంపారు. అంటే, మీకు న్యాయస్థానాల కంటే ప్రచారమే ముఖ్యమని అర్థమవుతోంది‘‘ అని జస్టిస్ హిమా కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశీ పర్యటనల పేరుతో వ్యక్తిగత హాజరు నుంచి తప్పించుకొనే ప్రయత్నం చేశారన్నారు.
లైసెన్సింగ్ అధికారులపైనా ధ్వజం..
పతంజలి ఆయుర్వేద సంస్థ ఔషధాలకు అనుమతులిచ్చిన ఉత్తరాఖండ్ లైసెన్సింగ్ అథారిటీ తీరుపైనా ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ఆ సంస్థ తప్పుదోవ పట్టించే ప్రకటనలపై చర్యలు ఎందుకు తీసుకోలేదు. పదే పదే ఉల్లంఘనలు జరుగుతుంటే అథారిటీ అధికారులు చేతులు కట్టుకుని కూర్చున్నట్టు కనిపిస్తుంది. హెచ్చరికలు జారీ చేసి వదిలేస్తే సరిపోతుందని అనుకున్నారా? పతంజలి సంస్థతో అధికారులు కుమ్మక్కు అయ్యారని ఎందుకు భావించకూడదు? లైసెన్సింగ్ అథారిటీలో ఉన్న అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోకూడదు. ఇది కేవలం ఒక కంపెనీకి సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదు. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘిస్తే ఏం జరుగుతుందో సమాజానికి తెలియాల్సిన అవసరం ఉంది. ఈ కేసులో 2018 నుంచి ఇప్పటి వరకూ జిల్లా ఆయుర్వేద, యునాని అధికారులుగా విధులు నిర్వహిస్తున్న అధికారులందరూ తాము తీసుకున్న చర్యలపై న్యాయస్థానానికి సమాధానం చెప్పాలి. ఈ కేసులో ఏప్రిల్ 16వ తేదీన ఆదేశాలు జారీ చేస్తాం’’ అని న్యాయస్థానం తెలిపింది.
అలాగే.. 2018 నుంచి ఇప్పటిదాకా ఉత్తరాఖండ్ స్టేట్ లైసెన్సింగ్ అథారిటీలో జాయింట్ డైరెక్టర్లుగా వ్యవహరించినవారందరూ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. పతంజలి సంస్థ తప్పుడు ప్రకటనలపై కేంద్ర ఆయుష్ శాఖ ఉత్తరాఖండ్ లెసెన్సింగ్ అథారిటీకి లేఖ రాస్తే.. అథారిటీ ఆ లేఖను కంపెనీకి పంపిందని.. ఇలా ఆరుసార్లు జరిగినా లైసెన్సింగ్ యంత్రాంగం మౌనంగా ఉండిపోయిందని గుర్తు చేసింది. ‘‘మీరు ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు’’ అని ఆందోళన వెలిబుచ్చింది. ఉత్తరాఖండ్ లైసెన్సింగ్ అథారిటీ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది ధ్రువ్ మెహతా.. అధికారుల నిజాయితీ గురించి ప్రస్తావించగా.. వారి విషయంలో ఆ పదాన్ని వాడొద్దని కోర్టు కఠినంగా వ్యాఖ్యానించింది. ఆ ప్రస్తావన తెస్తే చీల్చిచెండాడుతామని వ్యాఖ్యానించింది.
ఇదీ కేసు నేపథ్యం..
2020 జూన్‌లో.. ప్రపంచమంతా కొవిడ్ దెబ్బకు అతలాకుతలమవుతున్న వేళ కరోనా మందుల పేరిట ‘కరోనిల్’, ‘స్వసరి’ పేరుతో పతంజలి సంస్థ రెండు ఔషధాలను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. 2022 జూలైలో పత్రికలకు ఇచ్చిన ఓ ప్రకటనలో.. బీపీ, మధుమేహం, థైరాయిడ్ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులను అల్లోపతి నయం చేయలేదని, తాము ఆయుర్వేదంతో ఆయా వ్యాధులను నయం చేశామని పేర్కొంది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ ప్రచారం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని కోర్టుకు నివేదించింది. దీంతో పాటు రామ్‌దేవ్ బాబా పలు సందర్భాల్లో కొవిడ్ వ్యాక్సిన్లపై చేసిన దుష్ప్రచారాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. కోర్టు నోటీసులు ఇవ్వడంతో.. ఇకముందు అలాంటి ప్రకటనలు ఇవ్వబోమని, అల్లోపతిపై యథాలాప వ్యాఖ్యలు చేయబోమని పతంజలి సంస్థ కోర్టుకు హామీ ఇచ్చింది. కానీ, ఆ తర్వాత కూడా సంస్థ తన ధోరణిని యథాతథంగా కొనసాగిస్తూ, ప్రకటనలు ఇవ్వడంతో.. సుప్రీంకోర్టు ఆ సంస్థకు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
Updated Date - Apr 11 , 2024 | 07:51 AM