ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Supreme Court: అక్రమ నిర్మాణాలపై ఉపేక్ష వద్దు

ABN, Publish Date - Dec 18 , 2024 | 04:00 AM

అక్రమ నిర్మాణాల విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది.

సాకులు చెప్పి క్రమబద్ధీకరించకూడదు

అవసరమైతే అలాంటి వాటిని కూల్చివేయండి

కోర్టులూ ‘అనవసర సానుభూతి’ చూపకూడదు

అతిక్రమణలు జరిగితే అధికార్లకు జరిమానాలు

కంప్లీషన్‌ సర్టిఫికెట్‌ ఉంటేనే బ్యాంకు రుణాలు

ఆ పత్రం ఆధారంగానే కరెంటు, నల్లా కనెక్షన్లు

నిబంధనలు పాటిస్తామని బిల్డర్లు హామీ ఇవ్వాలి

నిర్మాణ దశలపై అధికారులు రికార్డు రాయాలి

ఇందులో ఏ ఒక్కటి ఉల్లంఘించినా కోర్టు ధిక్కరణే

సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు

న్యూఢిల్లీ, డిసెంబరు 17: అక్రమ నిర్మాణాల విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. పరిపాలనాపరమైన జాప్యం జరిగిందనో, పెట్టుబడులు పెట్టారనో కారణాలు చూపించి ఎట్టిపరిస్థితుల్లోనూ అక్రమ కట్టడాలను క్రమబద్ధం చేయకూడదని స్పష్టం చేసింది. ఈ నిర్మాణాలకు బాధ్యులైన అధికారులపై జరిమానాలు విధించాలని పేర్కొంది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో నివాస భవనాలను వాణిజ్య నిర్మాణాలుగా మార్పిడి చేసిన కేసుపై విచారణ జరిపిన జస్టిస్‌ జె.బి.పార్థీవాలా, జస్టిస్‌ ఆర్‌.మహదేవన్‌ల ధర్మాసనం అక్రమ కట్టడాల నిరోధంపై వెలువరించిన 36 పేజీల తీర్పులో పలు ఆదేశాలు ఇచ్చింది. ఆ భవనాల కూల్చివేతను సమర్థించింది. భవన నిర్మాణం పూర్తయిన తరువాత కూడా అక్రమంగా పనులు చేపట్టినా సత్వరమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని తెలిపింది. అక్రమంగా నిర్మించిన భాగాన్ని కూల్చివేయడం, తప్పు చేసిన అధికారులకు జరిమానా విధించడం వంటి చర్యలు చేపట్టాలని ఆదేశించింది. పట్టణ ప్రణాళిక చట్టాలను కచ్చితంగా అమలు చేయడంతో పాటు, అధికారుల్లో జవాబుదారీతనం ఉండేలా చూడాల్సి ఉందని తెలిపింది.



స్థానిక అధికారులు ఆమోదించిన బిల్డింగ్‌ ప్లాన్‌ను ఉల్లంఘించి పనులు చేపట్టడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించకూడదు. అసలు బిల్డింగ్‌ ప్లానే లేకుండా చేపట్టే నిర్మాణాలను ధైర్యంతో నిలిపివేయాలి.

నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణాలు జరుగుతున్నట్టు కోర్టు దృష్టికి వస్తే వాటిని ఆపాలి. ఏ మాత్రం కనికరం చూపినా అది ‘అనుచిత సానుభూతి’ కిందకు వస్తుంది.

అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణలో ఆలస్యం, పరిపాలనపరమైన వైఫల్యాలు, నియంత్రణ వ్యవస్థల అసమర్థత, నిర్మాణ వ్యయం అధికంగా ఉందన్న కారణం చూపడం, పెట్టుబడులు పెట్టారని చెప్పడం, చట్టం అమలులో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం, బద్ధకంగా వ్యవహరించిందన్న కారణాలు చూపించి అక్రమ నిర్మాణాలకు అనుకూలంగా వ్యవహరించకూడదు.

అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణను అసాధారణ పరిస్థితుల్లోనే చేపట్టాలి. అదీ కేవలం ఒకేఒకసారి ఏకకాల పరిష్కార మార్గంగా చేపట్టాలి. అంతకుముందు సర్వే చేసి వాస్తవాలను నిర్ధారించాలి.

క్రమబద్ధమైన అభివృద్ధి ఉండాలన్న ఉద్దేశంతో ప్రణాళికలు రూపొందిస్తారు. వాటిని ఉల్లంఘించి నిర్మాణాలు చేపడితే విద్యుత్తు, భూగర్భ జలాలు, రోడ్లపై ఒత్తిడి పెరిగి అసలు హక్కుదార్లకు ముప్పు ఏర్పడుతుంది. వారి జీవనానికి ఇబ్బంది అవుతుంది.



భవనం పనులు జరుగుతున్నంత కాలం నిర్మాణ స్థలంలో ‘ఆమోదం పొందిన బిల్డింగ్‌ ప్లాన్‌’ను ప్రదర్శించాలి. అధికారులు కూడా నిర్ణీత వ్యవధిలో తనిఖీలు చేస్తూ వాటిని రికార్డుల్లో రాయాలి.

నిబంధనలు పాటిస్తామంటూ బిల్డింగ్‌ ప్లాన్‌కు ఆమోదం తెలిపే సమయంలో బిల్డరు/దరఖాస్తుదారు నుంచి ఓ హామీ పత్రం తీసుకోవాలి. ‘‘సంబంధిత అధికారుల నుంచి కంప్లీషన్‌/ఆక్యుపేషన్‌ సర్టిఫికెట్‌ తీసుకున్న తరువాతే బిల్డింగ్‌ను యజమానులు/లబ్ధిదారులకు అప్పగిస్తాను’’ అంటూ ఆ హామీ పత్రంలో రాయాలి.

తనిఖీలు చేసిన అనంతరం ఎలాంటి అతిక్రమణలు లేకుండా పనులు జరిగినట్టు అధికారులు సంతృప్తి చెందితే అనవసర జాప్యాలు లేకుండా కంప్లీషన్‌/ఆక్యుపేషన్‌ సర్టిపికెట్‌ జారీ చేయాలి. అతిక్రమణలు జరిగినట్టు గుర్తిస్తే చట్టం ప్రకారం తీసుకోవాలి. కంప్లీషన్‌ సర్టిఫికెట్‌ జారీని వాయిదా వేయాలి. తగిన మార్పులు, చేర్పులు చేసిన తరువాత మాత్రమే ఆ సర్టిపికెట్‌ ఇవ్వాలి.

కంప్లీషన్‌/ఆక్యుపేషన్‌ సర్టిఫికెట్‌ పొందిన తరువాత మాత్రమే విద్యుత్తు, మంచినీరు, మురుగునీటి కనెక్షన్ల సౌకర్యాలను సంబంధిత అధికారులు ఇవ్వాల్సి ఉంటుంది.

కంప్లీషన్‌ సర్టిఫికెట్‌ ఇవ్వలేదనో, అక్రమ నిర్మాణాన్ని క్రమద్ధం చేయలేదనో, అతిక్రమణలను రాటిఫై చేయలేదనో బిల్డర్‌/యజమాని చేసిన ఫిర్యాదులు, పెండింగ్‌లో ఉన్న అప్పీళ్లు, రివిజన్లపై చట్టంలో పేర్కొన్న విధంగా 90 రోజుల్లోగా అధికారులు నిర్ణయం తీసుకోవాలి.

కంప్లీషన్‌ సర్టిఫికెట్‌ను నిశితంగా తనిఖీ చేసిన అనంతరమే భవనాన్ని తనఖాకు పెట్టుకొని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రుణాలు మంజూరు చేయాలి.

వీటిలో ఏ ఒక్క ఆదేశాన్ని ఉల్లంఘించినా అది కోర్టు ధిక్కరణ కిందికే వస్తుంది.

ఈ ఆదేశాలను అన్ని హైకోర్టులు అమలు చేసేలా తీర్పు కాపీలను వాటికి పంపాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌ను ధర్మాసనం సూచించింది.

Updated Date - Dec 18 , 2024 | 04:00 AM