Supreme Court: బెయిల్ ఇచ్చిన తెల్లారే మంత్రి పదవా.. ఆశ్చర్యం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు
ABN, Publish Date - Dec 02 , 2024 | 05:09 PM
డీఎంకే నేత సెంథిల్ కుమార్ కేసు విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అతడికి బెయిల్ మంజూరు చేసిన తర్వాతి పరిణామాలను గుర్తుచేస్తూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది..
చెన్నై: అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎంకే నేత సెంథిల్ బాలాజీ కేసులో సుప్రీం ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. బెయిలు గ్రాంట్ చేసిన మర్నాడే అతడికి మంత్రి పదవి కట్టబెట్టడంపై విస్మయానికి గురైనట్టు తెలిపింది. ఈ చర్య బాధితులను ఒత్తిడికి గురిచేస్తుందని.. సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని కోర్టు అభిప్రాయపడింది.
డీఎంకే నేతకు బెయిల్ మంజూరు చేస్తూ ఇచ్చిన తీర్పును రీకాల్ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది. సెంథిల్ బాలాజీ బెయిల్ ఆర్డర్ ఉపశమనం కోరే ఇతరులకు ప్రయోజనం చేకూర్చింది కాబట్టి మెరిట్‌లపై జోక్యం చేసుకోవడానికి బెంచ్ నిరాకరించింది. బాలాజీకి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసిన సాక్షులు ఒత్తిడికి గురవుతున్నారా లేదా అనే దానికే పిటిషన్ పరిధిని పరిమితం చేస్తామని కోర్టు పేర్కొంది.
మేము బెయిల్ మంజూరు చేసిన వెంటనే మీరు వెళ్లి మంత్రి అవుతారు. ఇప్పుడు సీనియర్ క్యాబినెట్ మంత్రి హోదాలో ఉన్న మిమ్మల్ని చూసి సాక్షులు కచ్చితంగా ఒత్తిడికి లోనవుతారు. అసలు ఏం జరుగుతోంది అని కోర్టు ప్రశ్నించింది.
‘‘బెయిల్ మంజూరు విషయంలో మేము సరైన నిర్ణయమే తీసుకున్నాం. అతడి బెయిల్‌ను రద్దు చేయడం గురించి విచారణ జరిపేది లేదు. కానీ, సాక్షులు ప్రభావితం అవుతారనే అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటాం. దీనిపై విచారణ జరుపుతాం’’ అని సుప్రీం స్పష్టం చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను డిసెంబరు 13కు వాయిదా వేసింది.
డీఎంకే నేత సెంథిల్ బాలాజీ మనీలాండరింగ్ కేసులో జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబరులో ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేయగా కొద్ది గంటల్లోనే ఉదయనిధి స్టాలిన్ కు డిప్యూటీ సీఎం పదవి లభించింది. దీంతో ఆయన మంత్రివర్గంలో సెంథిల్‌తో పాటు మొత్తం నలుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
Maharashtra: బీజేపీ కేంద్ర పరిశీలకులుగా నిర్మలా సీతారామన్, విజయ్ రూపాని
Updated Date - Dec 02 , 2024 | 05:11 PM