బూత్‌ల్లో ఓటర్ల సంఖ్య పెంపుపై వివరణ ఇవ్వండి
ABN, Publish Date - Dec 03 , 2024 | 03:59 AM
ప్రతి పోలింగ్ బూత్‌లో ఉండాల్సిన గరిష్ఠ ఓటర్ల సంఖ్యను 1200 నుంచి 1500 వరకు పెంచడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిల్‌పై సుప్రీంకోర్టు ప్రాథమిక విచారణ చేపట్టింది.
న్యూఢిల్లీ, డిసెంబరు 2: ప్రతి పోలింగ్ బూత్‌లో ఉండాల్సిన గరిష్ఠ ఓటర్ల సంఖ్యను 1200 నుంచి 1500 వరకు పెంచడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిల్‌పై సుప్రీంకోర్టు ప్రాథమిక విచారణ చేపట్టింది. దీనిపై సమాధానం ఇవ్వాలని ఎన్నికల సంఘాని(ఈసీ)కి నోటీసులు ఇచ్చింది. గరిష్ఠ ఓటర్ల సంఖ్యను పెంచుతూ 2019లో ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం కారణంగా ఇబ్బందులు కలుగుతాయని పేర్కొంటూ ఇందు ప్రకాశ్ సింగ్ అనే వ్యక్తి ఈ పిల్ దాఖలు చేశారు. ఓటర్ల సంఖ్య పెంపు కారణంగా ఎక్కువ సేపు నిలబడాల్సిన పరిస్థితి వస్తుందని, అందువల్ల బడుగు వర్గాల వారు ఓట్లు వేయలేని పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు. సోమవారం ఈ పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం ఈసీకి నోటీసులు ఇస్తూ ఏ ఒక్కరు కూడా ఓటు వేయలేని పరిస్థితి రాకూడదని వ్యాఖ్యానించింది. అయితే, ఈసీ తరఫు న్యాయవాది మణీందర్ సింగ్ పిటిషనర్ వాదనను ఖండించారు. ఓటర్లందరూ ఒకేసారి వచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పారు. రాజకీయ పార్టీలను సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.
Updated Date - Dec 03 , 2024 | 04:01 AM