ఎంతకాలం ఉచితాలు...ఉపాధి కల్పించలేరా?
ABN, Publish Date - Dec 10 , 2024 | 02:57 AM
ఎంతకాలం ఉచిత పథకాలు ఇస్తూ పోతారు...ఉపాధి కల్పించలేరా?’’ అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
81 కోట్ల మందికి రేషన్ పంపిణీయా: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, డిసెంబరు 9: ‘‘ఎంతకాలం ఉచిత పథకాలు ఇస్తూ పోతారు...ఉపాధి కల్పించలేరా?’’ అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కరోనా దగ్గర నుంచి వలస కార్మికులకు ఉచిత రేషన్ ఇస్తుండడాన్ని గుర్తు చేస్తూ వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించి, నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వాల్సి ఉందని తెలిపింది. జాతీయ ఆహార భద్రత చట్టం-2013 కింద 81 కోట్ల మందికి ఉచితంగాగానీ, రాయతీపైనగానీ రేషన్ పంపిణీ చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెప్పగా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ‘‘పన్ను చెల్లింపుదార్లనే విడిచిపెట్టారన్న మాట!’’ అని వ్యాఖ్యానించింది. కరోనా సమయంలో వలస కార్మికుల సమస్యలపై సుమోటోగా చేపట్టిన వ్యాజ్యంపై సోమవారం ధర్మాసనం విచారణ జరిపింది. ఓ స్వచ్ఛంద సంస్థ తరఫున న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తూ కరోనా సమయంలో ‘ఈ-శ్రమ్’ పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకున్న వలస కార్మికులకు కూడా ఉచితంగా రేషన్ ఇచ్చారని, దాన్ని కొనసాగించాలని కోరారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ఎంతకాలం ఉచితాలు కొనసాగిస్తారు...ఉపాధి ఎందుకు కల్పించరని కేంద్రాన్ని ప్రశ్నించింది. విచారణను జనవరి 8కి వాయిదా వేసింది.
Updated Date - Dec 10 , 2024 | 02:57 AM