రాజ్యాంగాన్ని మోసం చేయడమే
ABN, Publish Date - Nov 28 , 2024 | 05:02 AM
కేవలం ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోసమని మతం మారడం రాజ్యాంగాన్ని మోసం చేయడమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
రిజర్వేషన్ కోసమే మతం మారడమంటే అంతే..
అలాంటి ఆలోచనలు రిజర్వేషన్ల స్ఫూర్తినే దెబ్బతీస్తాయి
హిందూ మతం నుంచి క్రైస్తవానికి మారినప్పుడు వారి కులం గుర్తింపు కూడా పోతుంది
తిరిగి హిందూగా మారాలంటే తగిన ఆధారాలుండాలి
తనకు ఎస్సీ సర్టిఫికెట్ ఇప్పించాలన్న తమిళనాడు యువతి సెల్వరాణి పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, నవంబరు 27: కేవలం ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోసమని మతం మారడం రాజ్యాంగాన్ని మోసం చేయడమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తనకు ఎస్సీ సర్టిఫికెట్ ఇచ్చేలా అధికారులను ఆదేశించాలంటూ ఓ క్రైస్తవ యువతి వేసిన రిట్ పిటిషన్‌ను కొట్టివేసింది. బాప్టిజం తీసుకొని హిందూ మతం నుంచి క్రైస్తవానికి మారిన వారు తిరిగి హిందువులమంటూ చెప్పుకోలేరని, వారి కులం గుర్తింపు కూడా మతం మారినప్పుడే రద్దవుతుందని తెలిపింది. ఈ మేరకు జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ మహదేవన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ నెల 26న కీలక తీర్పునిచ్చింది. మతాన్ని ఆచరించడం అనేది వ్యక్తిగత విశ్వాసాల ఆధారంగా ఉండాలే తప్ప రిజర్వేషన్ల కోసం కాదని, ఎస్సీ సర్టిఫికెట్‌ను ఇప్పించలేమని తేల్చి చెప్పింది. ఈ మేరకు గతంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. తమిళనాడుకు చెందిన సెల్వరాణి అనే యువతి.. తనకు ఎస్సీ సర్టిఫికెట్ ఇచ్చేలా అధికారులను ఆదేశించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సెల్వరాణి తండ్రి హిందువు.
తల్లి క్రిస్టియన్. సెల్వరాణి 1990 నవంబరులో జన్మించారు. 1991 జనవరిలో ఆమెకు బాప్తిజం చేశారు. అయితే, 2015లో పుదుచ్చేరి డివిజన్ క్లర్క్ పోస్టు కోసం తనకు ఎస్సీ సర్టిఫికెట్‌ను ఇప్పించాలని ఆమె మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆమె వినతిని తిరస్కరించగా సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. స్కూల్ రికార్డుల్లో తను ఎస్సీ అనే ఉందని, తన తండ్రి హిందువుల్లో వల్లువన్(ఎస్సీ) కులానికి చెందినవారని, తన సోదరుడు కూడా హిందువేనని వాదించారు. అయితే, పిటిషనర్ క్రైస్తవాన్ని పాటిస్తున్నారని, తరచూ చర్చికి వెళ్తున్నట్లు స్పష్టమైన ఆధారాలున్నాయని కోర్టు పేర్కొంది. క్రైస్తవాన్ని ఆచరిస్తూ ఆమె హిందువునని చెప్పుకొంటున్నారని, ఇలాంటి ద్వంద్వ వైఖరిని కోర్టు ఆమోదించబోదని తెలిపింది. రిజర్వేషన్ కోసమే ఆమె మతం మారాలనుకోవడం లాంటి ఆలోచనలు రిజర్వేషన్ విధానపు స్ఫూర్తినే దెబ్బతీస్తాయని వ్యాఖ్యానించింది. మతం మారిన వారు తిరిగి హిందూ మతంలోకి వెళ్లాలంటే తగిన ఆధారాలుండాలని, వారు హిందూ మత విశ్వాసాలను పాటిస్తూ ఉండాలని వివరించింది. ప్రస్తుత కేసులో ఇలాంటి ఆధారాలేవీ లేవని స్పష్టం చేసింది. పైగా, పిటిషనర్ తండ్రి, సోదరుడు కూడా బాప్తిజం తీసుకున్నట్లు ఆధారాలున్నాయని తెలిపింది. సెల్వరాణి అభ్యర్థనను తిరస్కరిస్తూ పిటిషన్‌ను కొట్టేసింది.
Updated Date - Nov 28 , 2024 | 05:04 AM