Swachh Bharat Mission: స్వచ్ఛభారత్‌తో మెరుగైన ప్రజారోగ్యం
ABN, Publish Date - Sep 06 , 2024 | 05:32 AM
స్వచ్ఛభారత్ మిషన్‌తో పరిశుద్ధ భారత్ కల సాకారమవుతోందని.. ప్రజారోగ్యం మెరుగవుతోందని ప్రఽధాని నరేంద్ర మోదీ అన్నారు.
శిశు మరణాలు భారీగా తగ్గాయి: మోదీ
న్యూఢిల్లీ, సెప్టెంబరు 5: స్వచ్ఛభారత్ మిషన్‌తో పరిశుద్ధ భారత్ కల సాకారమవుతోందని.. ప్రజారోగ్యం మెరుగవుతోందని ప్రఽధాని నరేంద్ర మోదీ అన్నారు. కార్యక్రమంలో భాగంగా మరుగుదొడ్లు నిర్మించడంతో నవజాత శిశు, పిల్లల మరణాలు భారీగా తగ్గాయని చెప్పారు. ఈ విషయాన్ని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించిందని.. తనకు ఎంతో సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. ‘ప్రజారోగ్యాన్ని కాపాడటంలో స్వచ్ఛ, సురక్షితమైన పారిశుధ్యమే కీలకం. భారత్ ఇందులో ముందున్నందుకు సంతోషంగా ఉంది’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.
స్వచ్ఛభారత్ కారణంగా భారత్‌లో శిశు మరణాలు తగ్గాయంటూ ‘నేచర్’ అనే బ్రిటిష్ జర్నల్ ప్రచురించిన కథనాన్ని ఆయన పంచుకున్నారు. అమెరికాలోని ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. 2014లో చేపట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమం ద్వారా దేశమంతటా మరుగుదొడ్ల నిర్మాణం అనూహ్యంగా పెరిగిందని.. దీంతో ఏటా 60 వేల నుంచి 70 వేల నవజాత శిశు, పిల్లల మరణాలు తగ్గాయని వారు వెల్లడించారు. మెరుగైన పారిశుధ్యంతో 5-30 శాతం వరకు పిల్లల మరణాలు రేటును తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు.
Updated Date - Sep 06 , 2024 | 05:32 AM