Maharashtra: మహాయుతిలో ‘మాలిక్’ చిచ్చు!
ABN, Publish Date - Oct 31 , 2024 | 05:37 AM
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఏక్‌నాథ్ శిండే సారథ్యంలోని శివసేన-బీజేపీ-ఎన్‌సీపీ కూటమి ‘మహాయుతి’లో చిచ్చు రేగింది.
అజిత్ పార్టీ నేత నవాబ్‌కు మద్దతివ్వడానికి బీజేపీ నో
ముంబై, అక్టోబరు 30: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఏక్‌నాథ్ శిండే సారథ్యంలోని శివసేన-బీజేపీ-ఎన్‌సీపీ కూటమి ‘మహాయుతి’లో చిచ్చు రేగింది. ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ అభ్యర్థి, మాజీ మంత్రి నవాబ్ మాలిక్‌కు మద్దతివ్వడానికి, మాన్‌ఖుర్ద్ శివాజీ నగర్ స్థానంలో ఆయన తరఫున ప్రచారం చేయడానికి మిత్రపక్షమైన బీజేపీ నిరాకరించింది. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, అతడి అనుచరులు చోటా షకీల్, టైగర్ మెమన్‌తో లింకులు, మనీలాండరింగ్ ఆరోపణలపై 2022లో ఎన్‌ఐఏ మాలిక్‌ను అరెస్టు చేసింది.
ఈ ఏడాది జూలైలో అనారోగ్య కారణాలతో ఆయన బెయిల్ పొంది బయటకు వచ్చారు. అనుశక్తినగర్ సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మాలిక్‌ను నిరుడు ఎన్‌సీపీని చీల్చినప్పుడు అజిత్ తన పార్టీలోకి తీసుకున్నారు. బీజేపీ అభ్యంతరం చెప్పినా వినిపించుకోలేదు. ఈ దఫా మాన్‌ఖుర్ద్ శివాజీ నగర్ నుంచి అజిత్ ఆయన్ను బరిలోకి దించారు. అయితే మిత్రపక్షాల ఒత్తిడితో తనకు టికెట్ ఇవ్వకపోవచ్చన్న ఉద్దేశంతో మాలిక్ ఇండిపెండెంట్‌గా కూడా నామినేషన్ వేశారు. చివరకు ఆయనకే బీఫాం ఇచ్చారు. అయితే దావూద్‌తో లింకులున్న మాలిక్ తరఫున ప్రచారం చేయబోమని, ఇది తమ విస్పష్ట వైఖరని బీజేపీ ముంబై శాఖ అధ్యక్షుడు ఆశిష్ షేలర్ ప్రకటించారు.
Updated Date - Oct 31 , 2024 | 05:37 AM