సూసైడ్ నోట్‌తో బయటపడ్డ భార్య క్రూరత్వం
ABN, Publish Date - Dec 12 , 2024 | 04:56 AM
బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అతుల్ సుభాశ్ ఆత్మహత్య తర్వాత వెలుగులోకి వచ్చిన 40 పేజీల సూసైడ్ నోట్.. ఆయన భార్య క్రూరత్వాన్ని బయటపెట్టింది.
బెంగళూరు, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అతుల్ సుభాశ్ ఆత్మహత్య తర్వాత వెలుగులోకి వచ్చిన 40 పేజీల సూసైడ్ నోట్.. ఆయన భార్య క్రూరత్వాన్ని బయటపెట్టింది. బెంగళూరులో అతుల్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం సోమవారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అతుల్ 2019లో నిఖితను పెళ్లి చేసుకున్నారు. ఆమె ఢిల్లీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. మనస్పర్థలు రావడంతో భార్య నిఖిత, అత్త నిశా, బావమరిది అనురాగ్, భార్య మేనమామ సుశీల్ తనను వేధించారని అతుల్ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. తనపై హత్యాయత్నం, వరకట్న వేధింపులు, అసహజ లైంగిక వేధింపుల ఆరోపణతో యూపీలో 9 కేసులు నమోదు చేశారని, ఆ కేసుల్లో రాజీ కోసం రూ.3 కోట్లు డిమాండ్ చేశారని వివరించారు. ప్రతి కేసులోనూ బెంగళూరు నుంచి యూపీ కోర్టుకు వెళ్లాల్సి వచ్చేదని, ఏడాదిలో 40 సార్లు నోటీసులు వచ్చాయని లేఖలో పేర్కొన్నారు.
తన నాలుగేళ్ల కుమారుడిని చూసేందుకూ రెండేళ్లుగా అనుమతించడంలేదని తెలిపారు. తెలంగాణ హైకోర్టులో దాఖలైన ఓ వరకట్న వేధింపుల కేసును కొట్టివేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా అతుల్ ఆత్మహత్య అంశాన్ని తాజాగా సుప్రీంకోర్టు ప్రస్తావించింది. వరకట్న వేధింపుల చట్టాన్ని మహిళలు దుర్వినియోగం చేసే ప్రవృత్తి దేశంలో పెరుగుతోందని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్‌ల ధర్మాసనం అభిప్రాయపడింది. వరకట్నం కేసులను నిర్ధారించే ముందు అనవసరమైన వేధింపులను నియంత్రించాలని దిగువ కోర్టులకు సూచించింది. ఆత్మహత్యకు ముందు అతుల్ చేసిన 80 నిమిషాల వీడియో, 40 పేజీల సూసైడ్ నోట్‌లోని అంశాలను ధర్మాసనం ప్రస్తావించింది.
Updated Date - Dec 12 , 2024 | 04:56 AM