Summer: ఈ వేసవికాలం నిప్పుల కుంపటే.. ఐఎండీ హెచ్చరిక..
ABN, Publish Date - Mar 01 , 2024 | 06:00 PM
ఈ ఏడాది 2024 లో సూర్యుడు తన విశ్వరూపాన్ని చూపించనున్నాడు. చలికాలంలో వెచ్చదనాన్ని పంచాల్సిన భానుడు భగభగలాడిస్తున్నాడు. ఇందుకు సంకేతంగానే మార్చి చివర్లో రావాల్సిన ఎండలు ఫిబ్రవరి మొదట్లోనే వచ్చేశాయి.
ఈ ఏడాది 2024 లో సూర్యుడు తన విశ్వరూపాన్ని చూపించనున్నాడు. చలికాలంలో వెచ్చదనాన్ని పంచాల్సిన భానుడు భగభగలాడిస్తున్నాడు. ఇందుకు సంకేతంగానే మార్చి చివర్లో రావాల్సిన ఎండలు ఫిబ్రవరి మొదట్లోనే వచ్చేశాయి. దీంతో రాబోయే రోజులు ఎలా గడుస్తాయోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో ఐఎండీ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఈ వేసవికాలంలో (Summer) భానుడు తన ప్రతాపాన్నంతా చూపిస్తాడని పేర్కొంది. ఎల్‌నినో పరిస్థితులు బలహీనపడ్డప్పటికీ అవి ఇంకా చురుగ్గానే ఉన్నాయని, వాటి ప్రభావం మే వరకు కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో మార్చి నుంచి మే వరకు పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని భారత వాతావరణ విభాగం (IMD) అంచనా వేసింది. వాయువ్య ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలు మినహా దేశం మొత్తం కఠినమైన వేసవిని ఎదుర్కొనే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది.
కోస్తా తీర భారతం, ఈశాన్య, పశ్చిమ, మధ్య, వాయువ్య ప్రాంతాలలో మార్చిలో నెలవారీ గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయి. తూర్పు, తూర్పు-మధ్య భారతదేశంలోని చాలా ప్రాంతాలు, వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం నుంచి సాధారణం కంటే తక్కువ గరిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉంది. హిమాలయ ప్రాంతాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతల్లో మార్పులు ఉండకపోవచ్చని ఐఎండీ అంచనా వేసింది. దేశంలోని చాలా ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువ వేడిగాలులు వీచే అవకాశం ఉంది.
బలహీనపడిని ఎల్‌నినో పరిస్థితులు మే వరకు కొనసాగుతాయని అధికారులు భావిస్తున్నారు. ఎల్‌నినో కారణంగా సాధారణం కంటే ఎక్కువ వేడి ఉంటుంది కాబట్టి ఈ ఏడాది సైతం ఎక్కువ ఎండలు ఉండవచ్చని తాము భావిస్తున్నట్లు ఐఎండీ డైరెక్టర్ జనరల్ మోహపాత్ర చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్లనుంచి బయటకు రావద్దని, అత్యవసరమై బయటకు వస్తే కనీస జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Mar 01 , 2024 | 06:03 PM