TMC : టీఎంసీలో చిచ్చు!
ABN , Publish Date - Aug 19 , 2024 | 05:28 AM
పశ్చిమబెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రె్‌స(టీఎంసీ)లో పరిస్థితి ఏమంత బాగున్నట్టుగా కనిపించడం లేదు. ఈ నెల 9న వెలుగు చూసిన ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన, అదేసమయంలో ఈ నెల 14న ఆసుపత్రిపై
హత్యాచార ఘటన విషయంలో మమత సర్కారుపై తలోమాట
కీలక నేత అభిషేక్ మూగనోము
మమత ర్యాలీకి యువనేత గైర్హాజరు
ప్రభుత్వంపై సొంత నేతల విమర్శలు
కోల్‌కతా, ఆగస్టు 18: పశ్చిమబెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రె్‌స(టీఎంసీ)లో పరిస్థితి ఏమంత బాగున్నట్టుగా కనిపించడం లేదు. ఈ నెల 9న వెలుగు చూసిన ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన, అదేసమయంలో ఈ నెల 14న ఆసుపత్రిపై జరిగిన దాడి ఘటనపై సొంత సర్కారు వ్యవహరిస్తున్న తీరును టీఎంసీ నాయకులే విమర్శిస్తున్నారు. అదేవిధంగా ఈ వ్యవహారంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలను మరికొందరు నాయకులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ మూగనోము పాటించడంపైనా నాయకులు విస్తుబోతున్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ పార్టీ కీలక నాయకుడు కునాల్ ఘోష్.. తప్పులు సరిచేసుకోవాల్సిన అవసరం తమపై ఉందన్నారు. అభిషేక్ మూగనోము సరికాదని, ఆయన స్పందించాలని కునాల్ సూచించారు. రాష్ట్రంలో ఆందోళనల వెనుక కమ్యూనిస్టు, కాంగ్రెస్ నాయకుల కుట్ర ఉందని ఆరోపించారు.
అభిషేక్ మాటకు విలువలేదా?
హత్యాచార ఘటన తర్వాత ఆర్‌జీ కర్ ఆసుపత్రిపై ఈ నెల 14న జరిగిన దాడిపై అదే రాత్రి అభిషేక్ బెనర్జీ స్పందించారు. ఈ ఘటన వెనుక ఎవరున్నా వదిలి పెట్టరాదని, వెంటనే అరెస్టు చేయాలని ఆయన ఎక్స్ వేదికగా కోల్‌కతా పోలీసు కమిషనర్‌ను కోరారు. విధ్వంసానికి బాధ్యులైన ఏ ఒక్కరినీ వదిలిపెట్టరాదని, బాధ్యులను 24గంటల్లోగా అరెస్టు చేయాలని చెప్పారు. అయితే, అభిషేక్ ఆశించింది ఏమీ జరగలేదని, అందుకే ఆయన మౌనంగా ఉన్నారని టీఎంసీలోని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అభిషేక్ బెనర్జీకి పార్టీలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నది మరికొందరి వాదన. ఈ ఏడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో పట్టణ ప్రాంతాల్లో టీఎంసీకి ఎదురుదెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో సరిగా పనిచేయని నాయకులపై వేటు వేయాలని అభిషేక్ కోరారు. దీనిని పార్టీ అధిష్ఠానం సీరియ్‌సగా పరిగణించలేదు. ఈ పరిణామాలతో.. తనకు పార్టీలో ప్రాధాన్యం తగ్గుతోందన్న భావనలో బెనర్జీ ఉన్నారని పలువురు నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. పాలనా పరంగా తప్పులు, సీనియర్ నేతల వైఖరి కారణంగానే అభిషేక్ మౌనంగా ఉన్నారని మరికొందరు నాయకులు అంతర్గత చర్చల్లో చెబుతుండడం గమనార్హం. ఇదిలావుంటే, హత్యాచార ఘటనపై అభిషేక్ మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి ఘటనల్లో దోషులకు ఉరి శిక్ష విధించేలా కేంద్రం చట్టం తీసుకురావాలని సూచించారు.
మమత రాజీనామా చేయాలి: బీజేపీ
‘‘యువ వైద్యురాలిపై జరిగిన ఘొరంలో వైద్య కళాశాల, ఆసుపత్రి ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్, కోల్‌కతా కమిషనర్ వినీత్‌ల పాత్ర ఉందని అధికార పార్టీ సీనియర్ నాయకులే విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో అధికార యంత్రాంగం చచ్చుబడిపోయింది. ఈ నేపథ్యంలో సీఎం మమత రాజీనామా చేయాలి’’ అని బీజేపీ నేత సుకాంతో ముజుందార్ ఎక్స్‌లో డిమాండ్ చేశారు.
సొంత సర్కారుపై తలోమాట
హత్యాచార ఘటనపై అధికార పార్టీ టీఎంసీలో నేతలు తలోమాట మాట్లాడడం రాజకీయంగా చర్చనీయాంశం అయింది. సీనియర్ నేత శంతను సేన్ మాట్లాడుతూ.. హత్యాచార ఘటన సీఎంకు తెలియజేయకుండా ఆర్‌జీకర్ ఆసుపత్రి ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్ తొక్కిపెట్టారని, దీనిపై అనేక అనుమానాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. మరో నేత కునాల్ మాత్రం సర్కారుకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఘటన జరిగిన ప్రాంతంలో ఆధారాలు చెరిగిపోయేలా మౌలిక సదుపాయాల నిర్మాణ పనులు చేపట్టరాదని వ్యాఖ్యానించారు. టీఎంసీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుఖేందు శేఖర్‌రాయ్ వైఖరి పార్టీలో మరింత దుమారం రేపింది. ఈ నెల 14న మహిళలు చేపట్టిన ధర్నాలో ఆయన ఒంటరిగా పాల్గొనడంతోపాటు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.