New Delhi: ప్రయాణికులకు అలర్ట్.. ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు, విమానాలు..
ABN, Publish Date - Jan 25 , 2024 | 11:48 AM
చలి చంపేస్తోంది. రాత్రయితే చాలు.. చల్లని గాలులు వణికించేస్తున్నాయి. దేశ రాజధాని దిల్లీలో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.
చలి చంపేస్తోంది. రాత్రయితే చాలు.. చల్లని గాలులు వణికించేస్తున్నాయి. దేశ రాజధాని దిల్లీలో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. దట్టంగా కమ్ముకుంటున్న పొగమంచు కారణంగా రైళ్లు, విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పొగమంచు కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆలస్యమైన విమానాలు ఎప్పుడు బయలుదేరుతాయనే సమాచారాన్ని సకాలంలో అందించడం లేదని వాపోతున్నారు.
పొగ మంచు రైళ్ల రాకపోకలపై కూడా ప్రభావం పడుతోంది. వివిధ రాష్ట్రాల నుంచి దిల్లీకి వచ్చే 24 రైళ్లు గంట నుంచి ఎనిమిది గంటల వరకు ఆలస్యంగా నడుస్తున్నాయి. రాజేంద్ర నగర్-న్యూదిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ 2:30 గంటలు, దిబ్రూఘర్-న్యూదిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ 2 గంటలు 10 నిమిషాలు, భువనేశ్వర్-న్యూదిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ 6:30 గంటలు, పూరీ-న్యూదిల్లీ పురుషోత్తం ఎక్స్‌ప్రెస్ 6 గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి.
కాలుష్య కాసారంతో ఇప్పటికే విలవిల్లాడుతున్న దిల్లీ.. ఇప్పుడు పొగమంచు గుప్పిట్లో చిక్కుకుని వణికిపోతోంది. సూర్యుడు నడినెత్తి మీదికి వచ్చినా మంచు దుప్పటి వీడటం లేదు. దీంతో రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్ లు నిత్యకృత్యంగా మారాయి. అత్యవసరమయితేనే తప్పా.. ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు కోరుతున్నారు.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Jan 25 , 2024 | 11:49 AM