Wayanad Landslide: కష్టకాలంలో మేము సైతం అంటున్న యూడీఎఫ్ ఎమ్మెల్యేలు.. ఒక నెల జీతం వయనాడ్ బాధితులకే
ABN, Publish Date - Aug 04 , 2024 | 09:25 PM
కేరళ రాష్ట్రం వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన (Wayanad Landslide) ఘటన వందల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుల సంఖ్య 219కి చేరగా.. ఇంకా 200 మందికిపైగా ఆచూకీ లభించట్లేదు.
తిరువనంతపురం: కేరళ రాష్ట్రం వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన (Wayanad Landslide) ఘటన వందల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుల సంఖ్య 219కి చేరగా.. ఇంకా 200 మందికిపైగా ఆచూకీ లభించట్లేదు. మరో వైపు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో వయనాడ్ బాధితులకు మేమున్నాం అంటూ పలువురు ప్రముఖులు విరాళాలు అందిస్తున్నారు.
ఇప్పటికే తమిళనాడు సీఎం స్టాలిన్ తమ ప్రభుత్వం తరఫున రూ. 5కోట్ల విరాళం ప్రకటించగా.. తమిళ, కేరళ నటులు కోట్లల్లో విరాళాలు ఇచ్చారు. టాలీవుడ్ నుంచి చిరంజీవి, రాంచరణ్ కలిపి రూ.కోటి సాయం చేయగా, అల్లు అర్జున్ రూ.25 లక్షలు సీఎం సహాయనిధికి అందజేస్తున్నట్లు ఎక్స్‌లో ప్రకటించారు. వీరితోపాటు పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు కంపెనీలు తమకు తోచిన సాయం చేస్తూ ఉదారతను చాటుకుంటున్నాయి.
అయితే కేరళలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న యూడీఎఫ్ పార్టీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. కేరళ అసెంబ్లీలో 41 మంది యూడీఎఫ్ ఎమ్మెల్యేలుండగా.. వారంతా తమ ఒక్క నెల జీతాన్ని వయనాడ్ బాధితులకు అందజేయాలని నిర్ణయించుకున్నారు. వయనాడ్‌లోని బాధిత గ్రామాలు పునర్నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి సహకారాన్ని అందించనున్నట్లు కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష కూటమి యూడీఎఫ్ ఆదివారం ప్రకటించింది.
ఇందులో భాగంగా ఒక నెల జీతాన్ని ముఖ్యమంత్రి విపత్తు సహాయ నిధి (CMDRF)కు అందించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ క్రమంలో ప్రతిపక్ష నేత సతీషన్ మాట్లాడుతూ.. యూడీఎఫ్ అన్ని పునరావాస కార్యక్రమాల్లో పాల్గొని, జన జీవనాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు కృషిచేస్తుందన్నారు. యూడీఎఫ్ కూటమిలో ప్రధాన మిత్రపక్షమైన ఐయూఎంఎల్ కూడా పునరావాస చర్యల్లో భాగస్వామిగా మారిందన్నారు.
కాంగ్రెస్‌లో వాగ్వాదం..
అయితే కేరళలో అధికారంలో ఉన్న సీపీఎం సారథ్యంలోని ఎల్‌డీఎఫ్ తమ ప్రజాప్రతినిధుల(ఎంపీ, ఎమ్మెల్యేలు) ఒక నెల జీతాన్ని సీఎం సహాయనిధికి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేశ్ కూడా వారి బాటలో నడిచారు. దీనిపై కేరళ పీసీసీ అధ్యక్షుడు సుధాకరణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికార పార్టీ నిధికి తాము డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని సుధాకరణ్ వ్యాఖ్యానించారు. ఇది కాంగ్రెస్‌లో విభేదాలు రేపింది. ఈ క్రమంలో ప్రతిపక్ష యూడీఎఫ్ అధికార పార్టీ బాటలో నడవడం చర్చనీయాంశం అయింది.
జాతీయ విపత్తుగా గుర్తిస్తారా?
కాగా వయనాడ్‌లోని కొండ చరియలు విరిగిపడిన గ్రామాలను కేంద్ర మంత్రి సురేష్ గోపి(Suresh Gopi) ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా బాధితులకు భరోసా ఇచ్చారు. వయనాడ్‌లోని సహాయక శిబిరాలు, క్షతగాత్రులతో నిండిపోయిన విమ్స్ ఆసుపత్రిని కూడా గోపీ సందర్శించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. "కొండచరియలు విరిగిపడిన ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించేందుకు న్యాయపర అంశాలను పరిశీలిస్తున్నాం. జాతీయ విపత్తుగా ప్రకటించేందుకు కేంద్రం సుముఖంగా ఉంది. జాతీయ విపత్తుగా ప్రకటించాలంటే, చట్టపరమైన అంశాలను ముందుగా విశ్లేషించాలి. ప్రస్తుతం మా దృష్టంతా బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించి, మెరుగైన వైద్య చికిత్స అందించడంపై ఉంది. కేంద్ర ప్రభుత్వం పరిస్థితిని అంచనా వేస్తోంది. సర్చ్ ఆపరేషన్ కోసం మరిన్ని బలగాలు అవసరమైతే కేరళ సర్కార్ కేంద్రాన్ని సంప్రదించాలి" అని గోపి సూచించారు.
Wall Collapsed: గోడ కూలి 9 మంది చిన్నారులు మృతి, ఇద్దరికి గాయాలు
Top 8 Floods India: దేశాన్ని కుదిపేసిన 8 ప్రధాన వరద సంఘటనలు..10 వేల మంది మృతి!
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More National News and Latest Telugu News
Updated Date - Aug 04 , 2024 | 09:33 PM