Bihar: బిహార్ వంతెనలకేమైంది? వారంలో మూడో ఘటన
ABN, Publish Date - Jun 23 , 2024 | 02:43 PM
బిహార్‌లో వరుసగా వంతెనలు కుప్పకూలుతుండటం(Bridge Collapses) చర్చనీయాంశం అవుతోంది. తాజాగా తూర్పు చంపారన్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న చిన్న వంతెన కూలిపోయిందని అధికారులు తెలిపారు. మోతీహరిలోని ఘోరసహన్ బ్లాక్‌లో జరిగిన ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
పట్నా: బిహార్‌లో వరుసగా వంతెనలు కుప్పకూలుతుండటం(Bridge Collapses) చర్చనీయాంశం అవుతోంది. తాజాగా తూర్పు చంపారన్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న చిన్న వంతెన కూలిపోయిందని అధికారులు తెలిపారు. మోతీహరిలోని ఘోరసహన్ బ్లాక్‌లో జరిగిన ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
అమ్వా గ్రామాన్ని ఇతర ప్రాంతాలకు అనుసంధానించడానికి రాష్ట్ర గ్రామీణ పనుల విభాగం (RWD) కాలువపై రూ.1.5 కోట్ల అంచనా వ్యయంతో 16 మీటర్ల పొడవైన వంతెనను నిర్మిస్తోంది. ఇది ఆదివారం అకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ సంఘటనకు ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. విచారణ చేపట్టి దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని RWD అదనపు ప్రధాన కార్యదర్శి దీపక్ కుమార్ సింగ్ తెలిపారు. వారంలో వంతెన కుప్పకూలిన ఘటన మూడోది కావడం గమనార్హం.
నిధులు నేలపాలు..
సివాన్ జిల్లాలో శనివారం చిన్న వంతెన కూలిపోయింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాదాపు 45 ఏళ్ల క్రితం గండక్ కెనాల్‌పై నిర్మించిన ఈ వంతెన కుప్పకూలింది. అయితే వంతెన కూలిన శబ్దాలు.. పొరుగునే ఉన్న ధర్బంగా జిల్లాలోని రామ్‌ఘర్ వరకు వినిపించాయని స్థానికులు వెల్లడించారు. మహరాజ్‌గంజ్‌లోని పతేది బజార్‌ను ధర్బంగా జిల్లాలోని రామ్‌ఘర్ పంచాయితీలను ఈ వంతెన కలుపుతుందని వారు తెలిపారు. ఈ వంతెనపై నిత్యం వేలాది మంది ప్రజలు ప్రయాణిస్తారని పేర్కొన్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని సమాచారం.
జూన్ 18వ తేదీన అరారియా జిల్లాలో కుర్సాకాంతా, సిక్తి మధ్య బాక్రా నదిపై నిర్మిస్తున్న వంతెన కుప్ప కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ వంతెన నిర్మాణానికి వినియోగించిన దాదాపు రూ.12 కోట్లు నేలపాలైయ్యాయి. అయితే మరికొద్ది రోజుల్లో ఈ వంతెన ప్రారంభం కావాల్సి ఉండగా.. ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక ఈ వంతెన కూలిపోయిన ఘటనలో పోలీసులు పలువురిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అలాగే ఈ ఏడాది మొదట్లో ఇదే రాష్ట్రంలోని సుపౌల్‌లో కోసి నదిపై రూ. 984 కోట్లతో నిర్మిస్తున్న వంతెన స్లాబ్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించిన సంగతి తెలిసిందే. ఇలా వరుసగా వంతెనలు కుప్పకూలుతుండటం చర్చనీయాంశం అవుతోంది.
For Latest News and National News click here
Updated Date - Jun 23 , 2024 | 02:43 PM