Vande Bharat: సంఖ్య పెరిగినా.. వేగం తగ్గుతోన్న వందేభారత్ రైళ్లు
ABN, Publish Date - Jun 08 , 2024 | 10:41 AM
రైల్వే రంగంలో పెను మార్పులే ధ్యేయంగా తీసుకొచ్చిన వందే భారత్ రైళ్ల(Vande Bharat Trains) గురించి ఆసక్తికర విషయం ఒకటి బయటకి వచ్చింది. ఈ రైళ్ల గురించి తెలుసుకోవడానికి సమాచార హక్కు చట్టం(RTI)ద్వారా మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్రశేఖర్ గౌర్ చేసిన దరఖాస్తుకు అధికారులు సమాధానమిచ్చారు.
ఢిల్లీ: రైల్వే రంగంలో పెను మార్పులే ధ్యేయంగా తీసుకొచ్చిన వందే భారత్ రైళ్ల(Vande Bharat Trains) గురించి ఆసక్తికర విషయం ఒకటి బయటకి వచ్చింది. ఈ రైళ్ల గురించి తెలుసుకోవడానికి సమాచార హక్కు చట్టం(RTI)ద్వారా మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్రశేఖర్ గౌర్ చేసిన దరఖాస్తుకు అధికారులు సమాధానమిచ్చారు. వందేభారత్ రైళ్ల సగటు వేగం 2020-21లో 84.48 కి.మీ నుండి 2023-24 నాటికి 76.25 కి.మీకి తగ్గిందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది.
కేవలం వందేభారత్ రైళ్లు మాత్రమే కాదని, వివిధ మార్గాల్లో ట్రాక్ పునరుద్ధరణ, స్టేషన్ల నవీకరణ కారణంగా సాధారణ రైళ్ల వేగం కూడా తగ్గిందని వెల్లడించింది. కఠిన పరిస్థితుల్లోనూ వందే భారత్ నడుస్తున్నట్లు పేర్కొన్న రైల్వేశాఖ.. అక్కడి వాతావరణ పరిస్థితులు, ట్రాక్ నాణ్యతను బట్టి కూడా వేగాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఏర్పడుతోందని చెప్పింది. 2020-21లో వందేభారత్ రైళ్ల సరాసరి వేగం గంటకు 84.48 కి.మీ కాగా.. 2022-23 నాటికి ఆ వేగం 81.38 కి.మీ.లకు, 2023-24 నాటికి 76.25 కి.మీ.లకు పడిపోయింది.
2019, ఫిబ్రవరి 15న తొలిసారిగా వందేభారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చినప్పుడు రైళ్లను గంటకు 160 కి.మీ. వేగంతో ప్రయాణించేలా రూపొందించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఢిల్లీ, ఆగ్రా రూట్లో తప్ప ఇతర మార్గాల్లో గంటలకు 130 కి.మీ దాటరాదని హెచ్చరించింది. ఢిల్లీ- ఆగ్రా మార్గాన్ని హైటెక్నాలజీతో పునరుద్ధరించారు. అందువల్ల ఆ మార్గంలో వందేభారత్ గరిష్ఠ వేగంతో ప్రయాణించే వీలుంది. ఇవి అందుబాటులోకి వచ్చి ఐదేళ్లైనా చాలా మార్గాల్లో ట్రాక్ పునరుద్ధరణ పనులు ఇంకా పూర్తికాలేదు.
దీని ప్రభావం రైళ్ల వేగంపై పడుతోంది. ట్రాక్ సామర్థ్యం పెరిగితే వేగం కూడా పెరుగుతుంది. అయితే, వందేభారత్ రైళ్లు బాగా ఆదరణ పొందుతున్నాయని, మార్చి 31 వరకు 2.15 కోట్ల మందికి పైగా వీటిలో ప్రయాణించారని రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది."దేశవ్యాప్తంగా మొత్తం 284 జిల్లాలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు అనుసంధానం అయ్యాయి. భవిష్యత్తులో ఈ సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. రైల్వే నెట్‌వర్క్‌లోని 100 రూట్లలో మొత్తం 102 వందేభారత్ రైళ్లు సేవలు అందిస్తున్నాయి" అని రైల్వే అధికారి ఒకరు తెలిపారు.
For Latest News and National News click here
Updated Date - Jun 08 , 2024 | 10:41 AM