LokSabha Elections: నామినేషన్ గడువు కొన్ని నిమిషాలే ఉంది.. శశాంక్ ఏం చేశాడంటే..
ABN, Publish Date - May 10 , 2024 | 04:36 PM
దేశంలో లోక్‌సభ ఎన్నికల నుంచి గ్రామ పంచాయతీ ఎన్నికల వరకు ఒకటే సీన్. ఆ యా ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు.. రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో తమ నామినేషన్ వేసేందుకు.. తమ అనుచరగణంతో కలిసి వెళ్తారు.
న్యూఢిల్లీ, మే 10: దేశంలో లోక్‌సభ ఎన్నికల నుంచి గ్రామ పంచాయతీ ఎన్నికల వరకు ఒకటే సీన్. ఆ యా ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు.. రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో తమ నామినేషన్ వేసేందుకు.. తమ అనుచరగణంతో కలిసి వెళ్తారు. ఇంకా వివరంగా చెప్పాలంటే.. అటు 10 కార్లు.. ఇటు 10 కార్లతో పెద్ద కాన్వాయితో ఊరేగింపుగా వెళ్లి సదరు అభ్యర్థి నామినేషన్ వేస్తారు.
దేశంలో ప్రాంతాలు వేరైనా.. రాజకీయ పార్టీలు వేరైనా.. ఎన్నికల వేళ నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థుల తీరు దాదాపుగా ఇలాగే ఉంటుంది. కానీ ఉత్తరప్రదేశ్‌లోని డియోరియాలో అందుకు భిన్నమైన సంఘటన గురువారం చోటు చేసుకుంది.
డియోరియా లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా శశాంక్ మణి త్రిపాఠి పేరును ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. మే 09వ తేదీ మధ్యాహ్నం 3.00 గంటల లోపు రిటర్నింగ్ అధికారికి ఆయన తన నామినేషన్ పత్రాలు అందజేయాలి. అయితే నామినేషన్ వేసేందుకు సమయం కేవలం కొద్ది నిమిషాలు మాత్రమే మిగిలి ఉంది. దీంతో శశాంక్ మణి త్రిపాఠి.. తన కాళ్లకు పని చెప్పారు. దాదాపు 100 మీటర్ల మేర ఆయన పరుగెత్తుకొంటు వెళ్లి.. రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలు అందజేశారు.
ఆయనతోపాటు జిల్లా బీజేపీ అధ్యక్షుడు భూపేంద్ర సింగ్ సైతం శశాంక్‌తో కలిసి పరుగు పెట్టారు. అందుకు సంబంధించిన వీడియో అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైరల్ అయింది. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం రిటర్నింగ్ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన శశాంక్‌ను విలేకర్లు చుట్టు ముట్టి.. ఎందుకు ఆలస్యమైందని ప్రశ్నించారు.
ఈ రోజు స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభ నిర్వహణ బాధ్యతలు పార్టీ తనకు అప్పగించిందన్నారు. ఈ సభకు రాష్ట్ర డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య హాజరయ్యారని తెలిపారు. ఆయన ప్రసంగం పూర్తి అయిన తర్వాత నామినేషన్ వేసేందుకు కాన్వాయితో వెళ్లాలని ముందు నిర్ణయించామని చెప్పారు. కానీ డిప్యూటీ సీఎం మౌర్య ప్రసంగం ముగించడం కొద్దిగా ఆలస్యమైందన్నారు.
అనంతరం కాన్వాయితో ఊరేగింపుగా వెళ్లి నామినేషన్ వేసేందుకు అట్టే సమయం లేదని.. దీంతో పరుగెత్తికొంటు వెళ్లి నామినేషన వేయాల్సి వచ్చిందని ఆయన వెల్లడించారు. అయితే తాను ఐఐటీలో విద్య అభ్యసిస్తున్నప్పుడు పరుగు పందెంలో బహుమతులు గెలుచుకున్నానని ఈ సందర్బంగా శశాంక్ గుర్తు చేసుకున్నారు.
అది ఈ రోజు ఇలా ఉపయోగపడిందని పేర్కొన్నారు. మరోవైపు 1996లో త్రిపాఠి తండ్రి ప్రకాశ్ మణి త్రిపాఠి ఇదే నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అలాగే త్రిపాఠి తాత సురత్ నారాయణ్ మణి త్రిపాఠి యూపీలో ఎమ్మెల్సీగా గతంలో పని చేశారు.
Read Latest National News And Telugu News
Updated Date - May 10 , 2024 | 04:39 PM