I.N.D.I.A. Bloc: ఇండియా బ్లాక్ కన్వీనర్ ఎవరో తడుముకోకుండా చెప్పిన ఖర్గే
ABN, Publish Date - Jan 06 , 2024 | 02:22 PM
విపక్ష 'ఇండియా' బ్లాక్ కన్వీనర్‌గా ఎవరిని నియమించనున్నారు? దీనికి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే తడుముకోకుండా సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'పై శనివారంనాడు జరిగిన మీడియా సమావేశంలో కూటమి కన్వీనర్‌పై మీడియా అడిగిన ప్రశ్నకు....'ఇది కౌన్ బనేగా కరోడ్‌పతి ప్రశ్న' అంటూ ఆయన చమత్కరించారు.
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీపై పోరాటానికి ఏర్పడిన విపక్ష 'ఇండియా' (I.N.D.IA.) బ్లాక్ కన్వీనర్‌గా ఎవరిని నియమించనున్నారు? దీనికి కాంగ్రెస్ అధ్యక్షుడుమల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) తడుముకోకుండా సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'పై శనివారంనాడు జరిగిన మీడియా సమావేశంలో కూటమి కన్వీనర్‌పై మీడియా అడిగిన ప్రశ్నకు....'ఇది కౌన్ బనేగా కరోడ్‌పతి ప్రశ్న' అంటూ ఆయన నవ్వుతూ చమత్కరించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను కూటమి కన్వీనర్‌గా చేయాలని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే గత గురువారంనాడు ప్రతిపాదించారు. ఇందుకు సంబంధించి కూటమి భాగస్వామ్య పార్టీలను సైతం థాకరే సంప్రదిస్తున్నారు.
ప్రజల దగ్గరకు వెళ్లడం తప్ప మాకు మార్గం లేదు..
'భారత్ జోడో యాత్ర' లోగో, నినాదాన్ని మల్లికార్జున్ ఖర్గే, పార్టీ జనరల్ సెక్రటరీ ఇన్-చార్జి కమ్యూనికేషన్స్ జైరామ్ రమేష్, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ శనివారంనాడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ, తమకు ప్రజల వద్దకు వెళ్లడం మినహా మార్గం లేదనే విషయం ప్రజలకు ఈ యాత్ర ద్వారా తెలియజేస్తామన్నారు. పార్లమెంటులో పలు అంశాలను లేవనెత్తాలని ప్రయత్నించినప్పటికీ తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, 146 మంది ఎంపీలను పార్లమెంటు నుంచి సస్పెండ్ చేయడం దేశ చరిత్రలోనే ఇది మొదటి సారని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు.
మణిపూర్‌పై ఖర్గే విసుర్లు
మణిపూర్‌లో జరుగుతున్న ఘటనలు దురదృష్టకరమని మల్లికార్జున్ ఖర్గే అన్నారు. మరోసారి ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. ''బీచ్‌లకు వెళ్తారు. ఫోటో సెషన్ స్విమ్మింగ్ నడుస్తుంది. ఆలయ నిర్మాణ ప్రాంతంలో ఫోటోలు దిగుతారు, కేరళ, ముంబై వెళ్తారు. వెళ్లిన ప్రతిచోటా ఫోటోలు దిగుతూనే ఉంటారు. ఈ గొప్ప వ్యక్తి మణిపూర్‌కు మాత్రం వెళ్లరు'' అంటూ వ్యాఖ్యానించారు.
Updated Date - Jan 06 , 2024 | 02:24 PM