ఆ మెరిక ఎవరు?
ABN, Publish Date - Nov 03 , 2024 | 08:14 AM
నవంబర్ 5, 2024 మంగళవారం... మరి రెండు రోజులు... ప్రపంచం మొత్తం ఆతృతగా ఎదురుచూస్తున్న రోజు... అమెరికా చరిత్రలో నూతన అధ్యాయానికి అమెరికన్ ఓటర్లు ఆరోజున శ్రీకారం చుట్టబోతున్నారు. ‘అమెరికాను మళ్లీ గొప్పగా నిలబెట్టాల’నే నినాదంతో మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ‘అమెరికాను సమైక్యంగా నిలబెట్టాల’నే నినాదంతో ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ గత కొన్ని నెలలుగా తమ ప్రచారాస్త్రాలతో ఓటర్లను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నారు. ఇంతకీ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించే ఆ ‘మెరిక’ ఎవరు?
నవంబర్ 5, 2024 మంగళవారం... మరి రెండు రోజులు... ప్రపంచం మొత్తం ఆతృతగా ఎదురుచూస్తున్న రోజు... అమెరికా చరిత్రలో నూతన అధ్యాయానికి అమెరికన్ ఓటర్లు ఆరోజున శ్రీకారం చుట్టబోతున్నారు. ‘అమెరికాను మళ్లీ గొప్పగా నిలబెట్టాల’నే నినాదంతో మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ‘అమెరికాను సమైక్యంగా నిలబెట్టాల’నే నినాదంతో ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ గత కొన్ని నెలలుగా తమ ప్రచారాస్త్రాలతో ఓటర్లను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నారు. ఇంతకీ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించే ఆ ‘మెరిక’ ఎవరు?
శషభిషలకు తావు లేదు... నీళ్లు నమలడానికి ఆస్కారం లేదు. చెప్పదలచింది కుండబద్దలు కొట్టినట్టు, ఢంకా బజాయించినట్టు చెప్పి తీరడమే. ఇప్పటివరకూ హోరాహోరీగా సాగిన ప్రచారం డోనాల్డ్ ట్రంప్, కమలా హ్యారిస్... ఎవరికి వారినే విజేతలుగా నిలుపుతోంది. మరి ఓటరు మహాశయుల నాడి ఎలా స్పందిస్తుందో, ఓటరు మదిలో ఏమి మెదులుతుందో... చివరికి అసలు విజేతగా ఎవరిని నిలుపుతుందో ఆఖరి క్షణం వరకూ ఎవరూ ఊహించలేరు.
పోలింగు నవంబర్‌లోనే ఎందుకు?
అమెరికాలో సార్వత్రిక ఎన్నికలకు పోలింగు తేదీని ప్రత్యేకించి ఎవరూ ఖరారు చేయరు. దాదాపు నూట పాతికేళ్ల క్రితమే పోలింగుకు సంబంధించి ఒక చట్టం చేశారు. అప్పట్లో అమెరికన్ సమాజం చాలా వరకు వ్యవసాయ ఆధారితం. వ్యవసాయ పనులు నవంబర్‌కి ఒక కొలిక్కి వస్తాయి. కాబట్టి ఎన్నికలకు నవంబర్ నెలని నిర్ణయించారు. ఓటు వేయడానికి రైతులు ఎక్కడెక్కడినుంచో బండ్లపైన ప్రయాణించి పోలింగు కేంద్రాలకు రావాలి. ఆదివారం పోలింగు నిర్వహించాలంటే ఎవ్వరూ రారు, చాలామంది చర్చ్‌కి వెళ్తారు. బుధవారం మార్కెట్‌కి వెళ్తారు. మరి పోలింగుకు వెళ్లాలంటే ఆ రోజుల్లో ప్రయాణ సాధనాలు లేవు కదా.
అందువల్ల ప్రయాణానికి ఒక రోజు కేటాయించుకుంటే, అందుకు సోమవారాన్ని ఎంచుకుంటే, మంగళవారం ఓటు వేసి తిరిగి బుధవారంనాడు ప్రజలు మార్కెట్‌కు వెళ్లిపోవచ్చునని చట్టసభలో నిర్ణయించారు. అందువల్ల నాలుగేళ్లకు ఒకసారి నవంబర్ నెలలో మొదటి సోమవారం ప్రయాణానికి కేటాయించి, ఆ మరునాడు ప్రజలు ప్రశాంతంగా పోలింగులో పాల్గొంటారని నిర్ణయించారు. అప్పటినుంచి సార్వత్రిక ఎన్నికల నిర్వహణ ఈ పద్ధతి ప్రకారమే నడుస్తోంది. (ఎప్పుడైనా మధ్యలో అధ్యక్ష స్థానంలో కూర్చున్న వ్యక్తికి అకస్మాత్తుగా ఏమైనా అయితే అది వేరే సంగతి. అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం జరుగుతుంది.)
పెద్ద వ్యత్యాసం ఏమీ లేదు...
అమెరికా మీడియా నుంచి ప్రతి రోజూ పోల్ ట్రెండ్స్ వస్తున్నాయి. అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్... డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుతం దేశ ఉపాధ్యక్షురాలు అయిన కమలా హ్యారిస్ మధ్య జనాదరణకు సంబంధించినంతవరకు డైలీ పోల్‌లో పెద్ద వ్యత్యాసం ఏమీ కనిపించడం లేదు. ఒకరోజు ట్రంప్ ముందుంటే, మరోరోజు కమల ముందంజలో ఉంటోంది. ఈ అస్పష్ట సమాచారం నుంచి నిఖార్సయిన సమాచారాన్ని వడగట్టడం నిపుణులకు సైతం కత్తిమీద సామే! అయితే ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. అటు కమల గురించి అయినా, ఇటు ట్రంప్ గురించి అయినా సానుకూలంగా చెబుతున్న ఓటర్లను పక్కన పెడితే ఏ అభిఫ్రాయమూ చెప్పడానికి ప్రస్తుత పరిస్థితులలో ఇష్టపడని యువ ఓటర్లు ఇప్పుడు లక్షల సంఖ్యలో ఉన్నారు.
రాబోయే ఎన్నికలలో వీరి ఓట్లే కీలకం కాబోతున్నాయి. కొవిడ్ సంక్షుభిత సమయంలో ఏమి చేయాలో దిక్కు తోచని స్థితిని ఎదుర్కొన్న యువతరం కనీసం ఇప్పటికైనా తమ బతుకుకు ఒక భరోసా కల్పించే నాయకత్వం వస్తుందా అని ఎదురుచూస్తున్నది. అలాగే మారుతున్న సాంకేతిక కాలంలో ఉన్న ఉద్యోగాలను కృత్రిమ మేథస్సు రూపొందించే ఉత్పత్తి సాధనాలు లాక్కుపోతే భవిష్యత్తు ఏమిటని లక్షలాది గొంతులు మౌనంగా ప్రశ్నిస్తున్నాయి... మరింత మౌనంగా రోదిస్తున్నాయి. ఈ ఘోష ఎవరికైనా వినిపిస్తున్నదో లేదో కూడా గ్రహించే సాధనాలు లేవు.
బడుగు జీవుల ఆర్తనాదాలకు అర్థం చెప్పుకునే ప్రయత్నం గతంలో కొందరు అభ్యర్థులు చేసేవారు. కాని ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అభ్యర్థికి నోరే గాని శ్రవణావయవాలు పనిచేస్తున్నట్టు కనిపించడం లేదు. గతంలో జరిగిన ఎన్నికల ప్రచారం తీరు వేరు, ఇప్పటి ఎన్నికల ప్రచారం రీతే వేరు! గతంలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు అమెరికా ఎన్నికలలో ధన ప్రభావం కనిపిస్తోంది. 2020 ఎన్నికలలో అభ్యర్థులు దాదాపు 1500 కోట్ల డాలర్లు ఖర్చు చేసినట్టు లెక్కలు చెబుతున్నాయి. ఆ వ్యయం ఈసారి చాలా ఎక్కువ కావచ్చునని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఈ డబ్బు మొత్తం ఎక్కడికి పోతుందంటే ప్రధానంగా ప్రచారానికే. వార్తా పత్రికలలో ప్రకటనలు, రేడియో, టి.వి, ఇంటర్నెట్, సోషల్ మీడియా, పోస్టర్లు... ఇట్లా వీటికే బోలెడంత ఖర్చు అవుతుంది.
వర్తమానానికి ముందు... కాస్త గతంలోకి ...
ఒక విధంగా చెప్పాలంటే ప్రస్తుత ఎన్నికల గమనాన్ని చాలా ముందస్తుగానే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ పట్టాలపైకి ఎక్కించాడు. 2024లో జరిగే ఎన్నికలలో పోటీ చేసి తీరుతానని మాజీ అధ్యక్షుని హోదాలో ట్రంప్ తనకు తానుగా 2022లోనే నగారా మోగించుకున్నాడు. ఇంకా రెండేళ్లు వ్యవధి ఉండగానే ఒక అభ్యర్థి నుంచి అటువంటి స్వయం ప్రకటన వెలువడడం అమెరికన్ సమాజాన్నే గాక యావత్ ప్రపంచాన్ని నివ్వెరపాటుకు గురి చేసింది. ఆయన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించవలసిన రిపబ్లికన్ పార్టీ పెద్దలనైతే ఈ ప్రకటన దిగ్ర్భాంతికి గురి చేసింది. చాలా రోజులపాటు వారికి నిద్రలేకుండా చేసింది. ఎందుకంటే అప్పటికే ఆయన తన వాచలత్వంతో అంతకుముందు ఏ నాయకునికీ రానంత అపకీర్తిని మూటకట్టుకుని ఉన్నారు.
ఎన్నికలలో అమెరికన్ పౌరులు ఒక ప్రక్రియ ప్రకారం గెలుపోటములను నిర్ణయిస్తారు. ప్రజా తీర్పును ప్రజా శాసనంగా భావించి అభ్యర్థులు శిరసావహిస్తారు. కాని ఓడిపోయిననాడు ట్రంప్ అలా ప్రజా తీర్పును గౌరవించలేదు. ఎన్నికల ప్రక్రియ జరిగిన పద్ధతిని శంకించాడు... తూలనాడాడు. ఇది ఎంతవరకు వెళ్లిందంటే వాషింగ్టన్ డి.సి. లోని కేపిటాల్ పైకి ట్రంప్ అభిమానులు పెద్ద ఎత్తున దూసుకుపోయేవరకూ పోయింది. ఆ భవనానికి కూతవేటులోనే అమెరికా సుప్రీం కోర్టు కూడా ఉంది. కాని ఆ రోజున ఎవ్వరూ తమను న్యాయదేవత అధిక్షేపిస్తుందన్న సోయికూడా లేకుండా రెచ్చిపోయారు. అటువంటి అనూహ్య పరిణామం అమెరికా చరిత్రలో మొదటిసారి.
ట్రంప్ రెచ్చగొట్టే విధంగా మాట్లాడడంవల్లే ఈ దాడి జరిగిందంటూ ఆయనపైనా, ఆయన మద్దతుదారులపైనా కేసులు కూడా నమోదు అయ్యాయి. ఆ గొడవలతో తనకేమీ సంబంధం లేదని ట్రంప్ బుకాయించినప్పటికీ ఆ వివాదాస్పద వ్యాఖ్యలను రిపబ్లికన్ నాయకులు సైతం భరించలేకపోయారు. అయితే ఇంతటి వివాదానికి కారణమై కూడా అంత త్వరగా తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించుకోవడమే అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. అయినప్పటికీ తదనంతర కాలంలో రిపబ్లికన్ పార్టీ సారథులకు ట్రంప్ తప్ప మరొక వ్యక్తి కనిపించని వింత పరిస్థితి.
‘ఈ డెమోక్రాట్లు ఉన్నారే, వీళ్లంత దుష్టులు, తుఛ్ఛులూ ఈ ప్రపంచంలోనే ఎక్కడా ఉండర’ని నిర్భీతిగా మాట్లాడే ట్రంప్‌లో రిపబ్లికన్ సారథులు తమ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చే మొనగాడిని చూసుకున్నారు. మళ్లీ అధికార పగ్గాలు చేపడతాను, అమెరికాను ఘనంగా నిలబెడతాను, మన సమాజానికి పూర్వ వైభవాన్ని తీసుకువస్తాను, అది నా ఒక్కడి వల్లే సాధ్యం అని ట్రంప్ అంత గట్టిగా చెబుతున్నాడంటే అది కేవలం అతని అహంకారమో, వట్టి ప్రగల్భాలు అనో కొట్టిపారేయడానికి వీలు లేనంతగా అమెరికన్ సమాజాన్ని ఆ మాటలు ప్రభావితం చేశాయి. అమెరికా ఎన్నికల ముఖచిత్రానికి ఆనాటికి ఈ పరిణామం ఒక వైపు కాగా, మరోవైపు అధికార పీఠంపై దర్జాగా ఆసీనుడై, అంత ముదుసలి వయసులోనూ మళ్లీ దేశాధ్యక్ష పదవిని ఆశిస్తున్న ఆనాటి డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ అడుగడుగునా తప్పటడుగులు వేస్తూ గతంలో మరే నాయకునికీ రానంతటి విఫలనాయకునిగా చెడ్డ పేరు తెచ్చుకుంటున్నాడు.
దేశాధ్యక్షుని స్థానంలో అసలు బైడెన్ ఉన్నట్టా, లేనట్టా అనే అనుమానం కలిగేటంతగా ఆయన ఉనికి స్పష్టాస్పష్టంగా ఉంది. దేశాధ్యక్ష పదవికి పోటీలో ఒక వైపు ట్రంప్ నీ, మరోవైపు బైడెన్ నీ కూర్చోబెట్టి తూకం వేస్తే మంచి చెడ్డల సంగతి పక్కనపెడితే, అన్ని విషయాలలోనూ నేనున్నాను, ఇదీ నా ముద్ర అని సగర్వంగా చెప్పుకునే ట్రంప్ వైపే త్రాసు మొగ్గు చూపుతుంది. అమెరికన్ దైనందిన జీవితాన్ని ప్రభావితం చేసే ప్రతి అంశంపైనా ట్రంప్ గట్టిగా మాట్లాడతాడు. విమర్శకులు ఏమంటారో అన్న పట్టింపు ఆయనకు లేదు. మీడియా ఏమంటుందో అన్న చింత కూడా లేదు. అమెరికా చరిత్రలో మీడియాను కించిత్ కూడా గౌరవించని, లక్ష్యపెట్టని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ట్రంప్ ఒక్కడే.
అందుకు ప్రధాన కారణం ఒక బిజినెస్ మేగ్నెట్‌గా తనకు తానే సాటిగా ట్రంప్ ఎదగడం, రెండవది తనను విపరీతంగా అభిమానించే మీడియా తన అడుగులకు ఎలాగూ మడుగులొత్తడం, మూడవది సోషల్ మీడియాలో తన అనుయాయులు తన తరఫున అత్యంత కీలకమైన ప్రభావశీలి పాత్ర పోషించడం. విమర్శకులు తన మాటలను పిచ్చి వాగుడు క్రింద కొట్టి పారేసినా, అహంకారంతో విర్రవీగుతున్నాడని ప్రచార మాధ్యమాల్లో తీవ్రంగా విమర్శించినా, తన మనసుకు ఏది తోస్తే అది మాట్లాడేయడం, అది తప్పు అని ఆ తర్వాత తెలిసినా అన్న మాటను వెనక్కి తీసుకోకపోవడం ట్రంప్ వ్యక్తిత్వంలో ఒక భాగం. అదే బైడెన్‌ను తీసుకుంటే ఏ సమస్య గురించి ఆయన ఏమనుకుంటున్నాడో, అసలు ఏమైనా అనుకుంటున్నాడో లేదో కూడా ఎవ్వరికీ లేశమైనా తెలియదు. ఆయన మదిలో ఏమున్నదీ ఎంత బుర్ర బద్దలుకొట్టుకున్నా ఎవరికీ ఏమీ అర్థం కాదు. అమెరికా ఆనాటి వర్తమాన రాజకీయాలలో ఇదో విచిత్రమైన అధ్యాయం!
పేలిన తూటా... మారిన రాజకీయం
ఇటువంటి పరిస్థితులలో ట్రంప్ తన ప్రచార సరళిని సమూలంగా మార్చేశాడు. అధికార పక్షంపై విమర్శల దూకుడు పెంచాడు. అధ్యక్షుడు బైడెన్‌ను ఎందుకూ కొరగానివాడిగా చిత్రించడం మొదలుపెట్టాడు. ఆయన మాటలు పై స్థాయి రిపబ్లికన్ సారథులకు ఇబ్బందిగా అనిపించినా, క్రింది స్థాయి వారికి మాత్రం శ్రవణానందకరంగానే వినిపించాయి. వరుసగా రెండవసారి గెలుపొందవలసిన వ్యక్తి గెలవలేక పోయినందుకు బాధపడుతున్న ఒక వర్గం తమను కష్టాల కడలి నుంచి సురక్షితంగా ఒడ్డుకు చేర్చే గజ ఈతగాడిని ట్రంప్‌లో చూసుకోవడం ప్రారంభించింది. ఇక రిపబ్లికన్ పార్టీ అధికారికంగా ట్రంప్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించడమే తరువాయి.
ఇంతలో దుర్ఘటన జరిగిపోయింది. అది 2024 జూలై 13. పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో ట్రంప్ ఒక మైదానంలో ప్రసంగిస్తుండగా దూరంగా ఒక భవనం నుంచి దుండగుడు పేల్చిన తూటా దూసుకువచ్చింది. గురి తప్పలేదు. తిన్నగా వచ్చి ట్రంప్ కణతకు తగలవలసింది. కాని అప్రయత్నంగా ట్రంప్ క్రిందికి వంగాడు... తూటా ఆయన చెవిని తాకుతూ పోయింది. చెవి నుంచి రక్తం కారుతోంది. కాని ట్రంప్ భయపడలేదు. కాసేపు నిరుత్తరుడైపోయాడు. అంతలోనే తేరుకున్నాడు. పిడికిలి బిగించి పైకి లేస్తూ తాను బ్రతికే ఉన్నానని, తనలో చేవ చావలేదని ఆ ఒక్క దృశ్యంతో ట్రంప్ ప్రపంచానికి చాటి చెప్పాడు. ఆ దృశ్యాన్ని సకాలంలో ఫొటో తీసిన వ్యక్తి ఇవాన్ గుచ్చి. (ఇతడు 2021 పులిట్జర్ బహుమతి గ్రహీత. జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతి యువకుడు మినియపాలిస్ పోలీసుల కిరాతకానికి బలైపోయినప్పుడు దేశంలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని ప్రతిఫలించే చిత్రాలు తీసినందుకు గుచ్చికి ఈ పురస్కారం లభించింది.)
ఆ ఒక్క చిత్రమే అమెరికా ఎన్నికల చిత్రాన్ని మార్చేసింది. ట్రంప్‌ని ఆగంతకుడు హతమార్చాలనుకున్నాడు. కాని అతడే భద్రతా దళాల కాల్పుల్లో హతమారాడు. రిపబ్లికన్లతో పాటు ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్న ప్రజాస్వామికవాదుల కడుపు మండిపోయింది. ట్రంప్ జనాదరణ సూచిక చక చకా పైకి ఎగబాకింది. ఇక తిరుగులేదని, ఎన్నికలలో విజేత ఆయనేనని సర్వత్రా బలమైన నమ్మకం పుంజుకుంది. ట్రంప్ రోజురోజుకీ శక్తిమంతుడైపోతున్నాడు. ఆయనలో ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ, ఒక నాయకుడిని భౌతికంగా అంతం చేయడానికి జరిగిన విఫలయత్నాన్ని అమెరికా ప్రజ సుతరామూ ఆమోదించలేదు. ఎన్నికలలో తానే అధ్యక్ష పదవికి మళ్లీ పోటీ చేయబోతున్నట్టు దేశాధ్యక్షుడు జో బైడెన్ అప్పటికే ప్రకటించి ఉన్నాడు. ఆ ప్రకటనను ఆయన తప్ప మరొకరు ఉపసంహరించలేరు.
సీన్‌లోకి కమలా...
డెమొక్రటిక్ పెద్దలు ఇక రంగంలోకి దిగక తప్పలేదు. బైడెన్‌లో సరిగ్గా నడిచే సత్తువ కూడా లేదని, ఇక ఎన్నికల బరి నుంచి తప్పుకుంటే మంచిదని వారు సూచించారు. వాటిని బైడెన్ పెడచెవిన పెట్టాడు. డెమొక్రటిక్ పార్టీ సారథులు చేసేదేమీ లేక నవ్వుకున్నారు. ఇంతలో లక్షలాది డాలర్లు పార్టీకి విరాళం ఇస్తామని మాట ఇచ్చిన దాతలు నెమ్మదిగా తప్పుకోవడం మొదలుపెట్టారు. కొందరు అప్పటికే ఇచ్చిన చెక్కులు చెల్లకుండా బ్యాంకులకు సందేశం పంపారు. పార్టీ ఆర్థిక మూలాలు బలహీనపడసాగాయి. డెమొక్రటిక్ పార్టీ పెద్దల వెన్నులో వణుకు పుట్టింది. పది రోజులు గడిచిపోయాయి. పరిస్థితి చేజారిపోతున్నదని బైడెన్ సైతం గ్రహించాడు. ఇక తప్పని పరిస్థితులలో పోటీ నుంచి వైదొలగుతున్నట్టు బైడెన్ బహిరంగంగా ప్రకటించాడు. ఆయన ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌తో మాట్లాడి తాను పోటీ నుంచి తప్పుకుంటానని చెప్పిన దరిమిలా ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి కమల అంగీకరించారు.
కమల పేరు బయటకు రావడంతోనే బరాక్ ఒబామాతో పాటు మిషెల్, క్లింటన్‌తో పాటు హిల్లరీ తదితర ప్రముఖులు తమ మద్దతు ఆమెకేనని బహిరంగంగా ప్రకటించారు. హాలీవుడ్ మొత్తం ఆమె వెనుక మేం ఉంటాం అని భరోసా ఇచ్చింది. విరాళాలు మళ్లీ ఇబ్బడిముబ్బడిగా వచ్చిపడడం మొదలైంది. అంతకుముందు చిల్లి గవ్వ కూడా విదిల్చేది లేదని తేల్చి చెప్పిన దాతలే కమలకు మద్దతుగా భారీ విరాళాలు చెల్లించారు. గతంలో ఎన్నడూ లేనంతగా కమల ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో విరాళాలు రాబట్టగలిగారు. ఎక్కడికక్కడ సభలు, సమావేశాలు పెద్ద ఎత్తున జరిగాయి. బైడెన్ పోటీ నుంచి తప్పుకోవడం అన్న ఒక్కగానొక్క ప్రకటన అమెరికా ఎన్నికల తీరునే మార్చేయగలిగినంత స్థాయిలో ప్రభావం చూపింది. ఆ ఒక్క ప్రకటనతో కంపెనీలలో పనిచేసే వారి దగ్గరనుంచి విశ్వ విద్యాలయాలలో చదువుకుంటున్న విద్యార్థుల వరకూ వేల సంఖ్యలో డెమొక్రటిక్ పార్టీకి పని చేయడం మొదలుపెట్టారు. కమల రోజువారీ పోల్ ర్యాంకింగ్ పైపైకి ఎగబాకింది. ట్రంప్ దూకుడుకు కళ్లెం పడింది. ఇప్పుడు పోటీ మరింత హోరాహోరీగా జరగబోతోంది. రాబోయే రెండు రోజులూ ప్రపంచం నలుమూలలా అందరి కళ్లూ అమెరికా ఎన్నికల మీదే!
ఈ ఎన్నికల ఫలితం ఎలా వచ్చినా అమెరికా చరిత్రలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్టే. కమలా హ్యారిస్ గెలిస్తే అమెరికా గడ్డపై తొలి మహిళా అధ్యక్షురాలిగా కొత్త చరిత్ర సృష్టిస్తారు. అమెరికా రాజకీయాలు గతంలో కంటె భిన్నంగా ఉంటాయి. ఆమె ఎన్నికతో అమెరికాలో మహిళలు మరింత క్రియాశీలకంగా రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు మెరుగుపడతాయి. అదే డోనాల్డ్ ట్రంప్ గెలిచినా మరో చరిత్ర మొదలవుతుంది. ఇప్పటివరకూ ఏవైతే ఆధునిక ప్రజాస్వామిక సూత్రాలు అని ప్రపంచం భావిస్తూ, గౌరవిస్తూ వస్తోందో వాటిని ట్రంప్ చరిత్ర పుటలకే పరిమితం చేస్తాడు. కంటికి కన్ను... పంటికి పన్ను... వంటి మాటలు ఇక చేతలు కావచ్చు... గుడ్ లక్ అమెరికా!
- జగన్, 99854 11211
ఆచితూచి అడుగువేసే ఓటర్లు ఇక్కడే...
అమెరికా ఎన్నికల్లో దాదాపు అన్ని రాష్ట్రాలలోనూ ఎవరి బలం ఎంత అనేది కాస్త అటు ఇటుగా తేలికగానే అంచనా వేయవచ్చు. కానీ ఓటరు నాడి అందని రాష్ట్రాలు ఉన్నాయి. మామూలు భాషలో ఊగిసలాడే రాష్ట్రాలుగా మాట్లాడుకునే ఆరిజోనా, జార్జియా, మిషిగన్, నెవాడా, నార్త్ కారోలినా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్. ఇవి చాలా కీలకమైనవి. వీటి సంగతి అలా ఉంచితే మరో అత్యంత కీలకమైన రాష్ట్రం న్యూ హ్యాంప్ షైర్. ఇక్కడి ఓటర్లు ఎవరిని అందలం ఎక్కిస్తారో, ఎవరిని లాగి పక్కన పడేస్తారో పరిశీలకులకు అందదు. ఆచి తూచి పోలింగునాడు ఎంతో విచక్షణ చూపిస్తారు గనుకనే ఈ రాష్ట్రాలు స్వింగ్ స్టేట్స్‌గా పేరుగాంచాయి.
ఆధునిక స్త్రీని ఇప్పుడైనా ఆమోదిస్తారా?
ప్రగతి శీలతకు, ప్రజాస్వామ్యానికీ మారుపేరుగా చెప్పుకునే అమెరికాలో ఇన్ని శతాబ్దాల రాజకీయ చరిత్రలో ఒక్కరంటే ఒక్క మహిళకు దేశాధ్యక్ష పదవి దక్కలేదు. అమెరికా దృష్టిలో వర్ధమాన దేశాలుగా మాత్రమే గుర్తింపు పొందిన ఎన్నోదేశాలు మహిళలకు ఏనాడో చట్ట సభల్లో అత్యున్నత స్థానాలలో కూర్చోబెట్టాయి. ఇక్కడ ఇందిరా గాంధి, శ్రీలంకలో సిరిమావో బండారు నాయికె, ఇజ్రేల్ లో గోల్డా మేర్, అర్జంటీనాలో ఇసబెల్, మన పక్కనే పాకిస్తాన్‌లో బెనజీర్ భుట్టో, బంగ్లాదేశ్‌లో షేక్ ఖలేదా జియా, షేక్ హసీనా, జర్మనీలో మెర్కెల్, మయన్మార్‌లో ఆంగ్ సాన్ సూకీ... ఇలా ఎంత మంది పేర్లు అయినా చెప్పవచ్చు. మరి అమెరికాకు ఏమైంది? ఒక మహిళను ఎందుకని దేశాధ్యక్షురాలిగా ఎన్నుకోవడం లేదు?
అమెరికాలో సామాజిక స్పృహ లేదా అంటే కావాల్సినంత ఉంది. మొట్టమొదటి మహిళా హక్కుల సదస్సు ఎప్పుడో 1848లోనే న్యూయార్క్‌లో జరిగింది. మహిళలకు ఓటు హక్కు కల్పించాలనే డిమాండు ఈ సదస్సులోనే చేశారు. ఓటు హక్కు రాకపోయినా పోటీ చేసి తీరుతానని ఇసబెల్ 1866లోనే అమెరికా ప్రతినిధుల సభకు పోటీ చేసినట్టు చరిత్ర చెబుతోంది. ఆ తర్వాత అమెరికా సుప్రీమ్ కోర్టులో ప్రాక్టీసు చేయడానికి అనుమతి పొందిన తొలి మహిళా న్యాయవాది లాక్ వుడ్ 1884లోనూ, 1888లోనూ దేశాధ్యక్ష పదవికి రెండుసార్లు పోటీచేసి చరిత్ర సృష్టించారు. ఇటువంటి వారి సుదీర్ఘ పోరాట ఫలితంగా 1920లో మహిళలకు ఓటు హక్కు కల్పిస్తూ చట్టం వచ్చింది. ఓటు వేయడం వరకే చట్టం వచ్చింది గాని, అమెరికన్ ఓటరు మనసు ఒక మహిళను అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టేవరకూ పరిణతి చెందలేదు... చివరికి మొన్నీమధ్య హిల్లరీ క్లింటన్ అధ్యక్ష పదవిని చేజిక్కించుకునే వరకూ వచ్చారు. కానీ చివరి క్షణంలో చేజారిపోయింది. ఇప్పుడు కమలా హ్యారిస్ రంగంలో ఉన్నారు. కమల ఇప్పుడు తొలి మహిళా అధ్యక్షురాలిగా గెలుపొంది చరిత్ర సృష్టిస్తారా?
Updated Date - Nov 03 , 2024 | 08:14 AM