Delhi: ఎన్నికల ముందే ఎందుకు? కేజ్రీవాల్ అరెస్టుపై ఈడీకి సుప్రీం ప్రశ్న
ABN, Publish Date - May 01 , 2024 | 05:33 AM
మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుపై సుప్రీం కోర్టు ఈడీకి కీలక ప్రశ్నలు సంధించింది. ఈ ప్రశ్నలకు శుక్రవారం తదుపరి విచారణలో సమాధానం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుపై సుప్రీం కోర్టు ఈడీకి కీలక ప్రశ్నలు సంధించింది. ఈ ప్రశ్నలకు శుక్రవారం తదుపరి విచారణలో సమాధానం చెప్పాలని ఈడీ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజును ఆదేశించింది. సార్వత్రిక ఎన్నికలు ప్రారంభం కావడానికి కొద్ది రోజుల ముందు కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడంలో ఆంతర్యం ఏంటని ధర్మాసనం ప్రశ్నించింది.
విచారణ ప్రారంభానికీ అరెస్టుకూ మఽధ్య ఎందుకంత సమయం పట్టిందని ప్రశ్నిస్తూ మనీ లాండరింగ్ నిరోధక చట్టం సెక్షన్ 8 ప్రకారం ఈ రెండింటి మధ్య అంతరం ఏడాది కంటే ఎక్కువ ఉండకూడదు కదా అని గుర్తు చేసింది. ఈ కేసులో న్యాయపరమైన చర్యలు తీసుకోకుండా క్రిమినల్ చర్యలను ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించింది. ఈ కేసులో ఇంతవరకు కేజ్రీవాల్ నుంచి డబ్బు కానీ ఆస్తులు కానీ అటాచ్ చేయలేదని, అలాంటప్పుడు కుంభకోణంలో కేజ్రీవాల్ పాత్ర ఏమిటో వివరించాలని ఆదేశించింది.
అంతకుముందు కేజ్రీవాల్ తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదిస్తూ ఢిల్లీ ఎక్సైజ్ విధానం రూపకల్పనలో కేజ్రీవాల్ ప్రత్యక్ష పాత్ర ఏమీ లేదని పేర్కొన్నారు. ఈడీ ఎలాంటి డబ్బు స్వాధీనం చేసుకోలేదన్నారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రకటనల ఆధారంగా కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడం సరైంది కాదన్నారు. తన కుమారుడు రాఘవ రెడ్డి అరెస్టయిన అయిదు నెలల తర్వాత శ్రీనివాసులు రెడ్డి ప్రకటన చేశారన్నారు. గత ఏడాది సెప్టెంబరు 16 వరకు కేజ్రీవాల్‌పై ఎలాంటి ఆరోపణలూ లేని, తనకు కేజ్రీవాల్ తెలియదని రాఘవ రెడ్డి చెప్పారని సింఘ్వీ గుర్తు చేశారు.
Updated Date - May 01 , 2024 | 05:33 AM