ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

A story : మనవాళ్లకు దక్కని గౌరవం

ABN, Publish Date - Aug 11 , 2024 | 05:37 AM

శేషేంద్రతో కలిసి నేను అనేక సాహితీ సమావేశాలకు వెళుతుండేదాన్ని. ఇలాంటి సమావేశాలకు విదేశీ రచయితలు వస్తే... సాధారణంగా అందరి దృష్టి వారిపైనే ఉండేది.

అలనాటి కథ

శేషేంద్రతో కలిసి నేను అనేక సాహితీ సమావేశాలకు వెళుతుండేదాన్ని. ఇలాంటి సమావేశాలకు విదేశీ రచయితలు వస్తే... సాధారణంగా అందరి దృష్టి వారిపైనే ఉండేది. మన దేశానికి చెందిన రచయితలకు ఒకింత తక్కువ గౌరవమే లభించేది. విదేశాలలో జరిగిన సమావేశాల్లో ఈ తరహా సమస్యలు ఎదురయ్యేవికావు. మన దేశంలో నా ఈ అనుభవాలు... అనేకమందికి కూడా ఎదురయి ఉండవచ్చు.

మన దేశంలో ఇటీవల కాలంలో అతిఎక్కువ మంది రచయితలు పాల్గొనే సాహితీ సమావేశం... ‘జైపూర్‌ లిటరరీ ఫెస్టివల్‌’. దీనికి దేశవిదేశాల నుంచి రచయితలు వస్తూ ఉంటారు. దీనిని ప్రారంభించక ముందు... అంటే 1980ల్లో భోపాల్‌లో ఈ తరహా ప్రయత్నమే జరిగింది. దీనికి నిర్వాహకుడు ప్రముఖ రచయిత అశోక్‌ బాజ్‌పేయ్‌. ఆ సమావేశానికి అనేకమంది రచయితలతో పాటు శేషేంద్రను కూడా ఆహ్వానించారు. అక్కడకు వెళ్లిన దగ్గర నుంచి రకరకాలైన ఇబ్బందులు ఎదురయ్యాయి.


మొదటగా మాకు కనీస వసతులు లేని ఒక రూమ్‌ కేటాయించారు. మా సమస్యను అశోక్‌ దృష్టికి తీసుకువచ్చాము. కానీ ప్రయోజనం లేకపోయింది. దీంతో మాకు కోపం వచ్చి, అక్కడ వేరే హోటల్‌కు వెళ్లాం. మా దురదృష్టమేమిటంటే అక్కడ కూడా రూమ్‌లు లేవు. తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడి మేనేజర్‌ రూమ్‌ పక్కనే ఉన్న చిన్న గదిలో ఆ రోజు రాత్రి సర్దుకోవాల్సి వచ్చింది.

ఆ మర్నాడు సమావేశం ప్రారంభమయింది. భారతీయ రచయితలకు సంబంధించిన కొన్ని సెషన్స్‌ ఉన్నా... వాటికి వెళ్లేవారు అతి కొద్ది మందే కనిపించారు. విదేశీ రచయితల ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. ఆ రోజు రాత్రి అప్పటి మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి అర్జున్‌సింగ్‌... రచయితలందరికీ ఒక విందు ఏర్పాటు చేశారు. ఆ విందుకు నేను, శేషేంద్ర కూడా వెళ్లాం. వెళ్లిన వెంటనే అక్కడ అర్జున్‌సింగ్‌ కనిపించారు.


ఆయన పక్కనే ఉన్న ఒక నిర్వాహకుడు... ‘ఈమె ఇందిరా ధన్‌రాజ్‌గిర్‌. ఆయన శేషేంద్ర’’ అని పరిచయం చేశాడు. అర్జున్‌సింగ్‌ వెంటనే... ‘‘హిందూ బెనారస్‌ యూనివర్సిటీలో నేను చదువుకున్నప్పుడు... ధన్‌రాజ్‌గిర్‌ హాస్టల్‌లోనే ఉండేవాడిని’’ అన్నారు. ఇలా కొంత సంభాషణ సాగింది. అర్జున్‌సింగ్‌తో సంభాషణ తర్వాత అక్కడున్న నిర్వాహకులకు మాపై గౌరవం పెరిగినట్లు అనిపించింది. మమ్మల్ని విదేశీ ప్రతినిధులు కూర్చునే టేబుల్‌ దగ్గర కూర్చోబెట్టారు. నా పక్కనే ప్రముఖ ఆంగ్ల రచయిత సర్‌ స్పెన్సర్‌ భార్య కూర్చుంది.


కొద్దిసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నాం. ఈ లోపు అర్జున్‌సింగ్‌ రచయితల టేబుల్స్‌ దగ్గరకు వచ్చి పలకరించటం మొదలుపెట్టారు. అర్జున్‌సింగ్‌తో పాటు ఆయన సిబ్బంది... వారితో కెమెరామెన్‌... ఇలా ఒక గుంపులా కదలటం మొదలుపెట్టారు. భారతీయ రచయితలందరూ ఆయనకు లేచి వినయంతో నమస్కారాలు చేస్తున్నారు.

ఈ మొత్తం వ్యవహారం నాకు చాలా ఇబ్బంది కలిగించింది. ఆ మర్నాడు ఉదయం... భారతీయ భాషలకు సంబంధించిన సెషన్స్‌ ఉన్నాయి. సమావేశ మందిరానికి వెళ్లిన వెంటనే అక్కడ మాకు ప్రముఖ కన్నడ రచయిత గోపాలకృష్ణ అడిగ కనిపించారు.

మమ్మల్ని చూసిన వెంటనే ఆయన మా దగ్గరకు వచ్చి... ‘‘ఈ రోజు ఉదయం నన్ను ప్రధాని సన్మానిస్తారని చెప్పారు. దాంతో ఉదయాన్నే లేచి వచ్చేశా. అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు కాఫీ ఇచ్చేవారు కూడా లేరు. భారతీయ రచయితగా పుట్టడం కన్నా ఇంగ్లీషు రచయితగా పుడితే ఎక్కువ గౌరవం లభిస్తుందనిపిస్తోంది’’ అని నిరాశగా ఆన్న అన్నారు. ఆ మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి.

-రాజకుమారి ఇందిరాదేవి ధన్‌రాజ్‌గిర్‌

Updated Date - Aug 11 , 2024 | 05:37 AM

Advertising
Advertising
<