Actor Ajay Ghosh : వద్దన్నా ఆ వేషం వేయించారు
ABN , Publish Date - May 12 , 2024 | 02:13 AM
అజయ్ ఘోష్.. ఈ పేరు వినగానే ఏ బెంగాలీ నటుడో అనిపిస్తుంది.కానీ ఆయన పక్కా లోకల్. అచ్చంగా తెలుగోడు.ఆయన తండ్రి కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు అజయ్ ఘోష్
అజయ్ ఘోష్..
ఈ పేరు వినగానే ఏ బెంగాలీ నటుడో అనిపిస్తుంది.
కానీ ఆయన పక్కా లోకల్. అచ్చంగా తెలుగోడు.
ఆయన తండ్రి కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు
అజయ్ ఘోష్‌కు
అనుచరుడు. అందుకే కొడుక్కి ఆ పేరు పెట్టుకున్నారు. ‘ప్రస్థానం’ చిత్రంతో దాదాపు పదిహేనేళ్ల క్రితం
సినీ రంగంలో నడక
ప్రారంభించి, ప్రస్తుతం
పరిశ్రమలో పరుగులు
పెడుతున్న అజయ్ ఘోష్ ‘నవ్య’కు ఇచ్చిన ఇంటర్వ్యూ.
కంగ్రాట్స్.. మీరు కూడా హీరోల లిస్టులో చేరారుగా
హీరో అనే పెద్ద పదాలు వద్దు సామీ! ‘మ్యూజిక్ షాప్ మూర్తి’లో నాది ప్రధాన పాత్ర.. అంతే. కరోనాకు ముందు పాలడుగు శివ అనే దర్శకుడు నా దగ్గరకు వచ్చి, ఈ కథ చెప్పాడు అప్పటికి ‘పుష్ప కూడా రాలేదు. చిన్న చిన్న వేషాలతో నెట్టుకొస్తున్నా. అందుకే ఆలోచించుకోమని చెప్పా. సరేనని వెళ్లిపోయి, మళ్లీ రెండేళ్ల తర్వాత ఒక రోజు పొద్దున్నే వేటపాలెంలో మా ఇంటికి వచ్చి ‘‘మీరు చేస్తానంటే కథను డెవలప్ చేసుకుంటా’’ అన్నాడు. మరోసారి కథ చెప్పించుకుని విన్నా. ‘‘రాజేంద్రప్రసాద్, నరేశ్ లాంటి పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు కదా! నా దగ్గరకే ఎందుకు వచ్చావు?’’ అని అడిగా. ‘‘ఈ తరహా పాత్రలు వాళ్లు చాలా చేసేశారు. మీరు చేస్తే వెరైటీ అవుతుంది’’ అని నన్ను కన్విన్స్ చేశాడు. అతని తపన చూసి ‘సరే’ అన్నా. ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ పాత్ర నాకు కూడా బాగా కనెక్ట్ అయింది. మూర్తికి ఇంటా, బయట అన్నీ ప్రతికూల పరిస్థితులే. అయినా అనుకున్నది అతను ఎలా సాధించాడన్నదే కథ.
వేషాల కోసం అలుపెరుగని పోరాటం చేసి, ఈ స్థాయికి చేరుకున్నారు. వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తోంది?
నాకు మొదటి నుంచీ నటన అంటే పిచ్చి. సినిమాల్లో నటించాలనీ, సత్యనారాయణ, నాగభూషణం, కోట శ్రీనివాసరావు లాగా విలన్ పాత్రలు పోషించాలనీ కలలు కనేవాణ్ణి. కానీ పరిశ్రమలో ఎవరితోనూ పరిచయాలు లేవు. అయినా ఏదో ఆశ, నమ్మకం. వేషాల కోసం తిరగని చోటు లేదు. సినిమాల్లో ఛాన్సు దొరకక్క యూస్‌ఫగూడ అడ్డాలో నిల్చొని, కూలి పనులకు వెళ్లిన రోజులు కూడా ఉన్నాయి. అవి కూడా దొరకని రోజున మా ఊరికి వెళి,్ల ఆశ చంపుకోలేక మళ్లీ ఇక్కడికి వచ్చేవాణ్ణి. ఇదంతా చూసి ఓ రోజు మా ఆవిడ ఒక మాట అంది. ‘సినిమాల్లో అవకాశాల కోసం వెళ్లిన వాడివి అక్కడే ఉండి కొంత కాలం ప్రయత్నం చెయ్యి. మళ్లీ మళ్లీ ఇలా తిరిగి వస్తుంటే ఇక్కడి వాళ్లకి సమాధానం చెప్పడం కష్టమవుతోంది. పిల్లల విషయం నేను చూసుకుంటాను. నువ్వు వెళ్లు’’ అని ధైర్యం చెప్పింది. తను కూడా పొలంలో కూలి పనులకు వెళ్లి పిల్లల్ని చూసేది. ఆ రోజుల్లో మా ఊరి నుంచి హైదరాబాద్ రావాలంటే టికెట్ ఖరీదు 105 రూపాయలు. అవి కూడా నా దగ్గర లేకపోవడంతో మా ఆవిడ అప్పు చేసి ఇస్తే ట్రైన్ ఎక్కా. సికింద్రాబాద్‌లో రైలు దిగిన తర్వాత... చేతిలో డబ్బు లేకపోవడంతో అక్కడి నుంచి యూస్‌ఫగూడ వరకూ నడుచుకుంటూ వచ్చిన రోజుల్ని మరిచిపోలేను.
ప్రారంభంలో అవమానాలు ఎదుర్కొన్నారా?
కామాక్షి మూవీస్ సంస్థలో చెంచురెడ్డి అని ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ఉండేవాడు. ఆయన్ని ఓసారి కలవమని మిత్రుడు చెబితే యూస్‌ఫగూడ నుంచి భారతీయ విద్యాభవన్ స్కూల్ దగ్గర ఉన్న వాళ్ల ఆఫీసుకు నడుచుకుంటూ వెళ్లా. అప్పట్లో నా అవతారం వేరేగా ఉండేది. లూజు ఫ్యాంటు, బట్టతల, రబ్బరు చెప్పులు. చెంచురెడ్డిని కలవగానే ఆయన ఏ చిరాకులో ఉన్నాడో ఏమో... ‘‘ఆయన చెప్పగానే నీకు వేషం ఇచ్చేస్తారా? అద్దంలో నీ ముఖం చూసుకున్నావా? నాగార్జునగారికి ఖాళీ లేదంట. పోనీ నువ్వు చేస్తావా హీరోగా...’’ అని వేళాకోళంగా మాట్లాడాడు. ‘ఏమిటిలా మాట్లాడుతున్నాడు?’ అని అప్పుడు బాధ కలిగినా... నాలాంటి వాళ్లు రోజూ చాలా మంది వస్తుంటారు కనుక అతనికున్న టెన్షన్‌లో అలా అని ఉంటాడని సరిపెట్టుకున్నా. ఇలా అవమానాలు సహిస్తూ, వేషాల కోసం తిరిగి తిరిగి విసుగు పుట్టేది. ఆ రోజుల్లో యాపిల్ పండు కొనుక్కొని తినాలనే కోరిక చాలా బలంగా ఉండేది. మనసు చంపుకోలేక ఓ రోజు యూస్‌ఫగూడ చెక్‌పో్‌స్టలో ఉన్న షాప్‌లో యాపిల్ రేటు ఎంతో అడిగా. 30 రూపాయలో, 40 రూపాయలో చెప్పాడు. ‘అంత డబ్బు ఉంటే నాకు రెండు రోజులు గడుస్తాయి కదా’ అనుకొని... ‘‘తక్కువకి రాదా?’’ అని అడిగాను. ‘నీది కొనే మొహమేనా’ అన్నట్లు నా వంక చూసి ‘‘ఛలో... ఛలో’’ అన్నాడు షాపతను. ఇప్పుడు ఇంత సంపాదిస్తున్నా... డబ్బు విలువ నాకు తెలుసు. అందుకే ఖర్చు పెట్టడానికి వెనకా ముందు ఆలోచిస్తుంటా. నాది చాదస్తం అనుకోవచ్చు. అనుకున్నా నేనేమీ ఫీల్ అవను.
‘జ్యోతిలక్ష్మి’ తర్వాత కూడా మీకు అవకాశాలు పెద్దగా రాలేదు కదా...
అదో విచిత్రం సామీ. మీకు చెప్పాలి. షూటింగ్ పూర్తయిన తర్వాత ఓ రోజు పూరి జగన్నాథ్ ఫోన్ చేసి ‘‘ఇప్పుడే ఎయిర్‌పోర్ట్‌లో నాగబాబు కలిశారు. ‘‘చాలా బాగుంది రా. మంచి నటుణ్ణి తీసుకొచ్చావు’’ అని నీకు కాంప్లిమెంట్ ఇచ్చాడు అజయ్’’ అని చెప్పగానే పొంగిపోయా. ఆ సినిమా రిలీజ్ అయ్యాక బాగా చేశావని అందరూ పొగుడుతూ ఉంటే... ‘హమ్మయ్య కష్టాలు గట్టెక్కాయి’ అనుకున్నా. అయితే ఒక్క కొత్త వేషం కూడా రాలేదు. ఏడాది గడిచిపోయింది. కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. అద్దె కట్టడం కూడా కష్టమవుతుండడంతో మళ్లీ పూరి జగన్నాథ్ దగ్గరకు వెళ్లి నా కష్టాలు చెప్పుకొన్నా. ‘‘దిగులు పడకు. నీకు మంచి రోజలు వస్తాయి. నీ గురించి పాత్రలు రాసుకొనే రోజులు వస్తాయి. కొంచెం ఓపిక పట్టు’’ అని ధైర్యం చెప్పారు. దేవుడి దయ వల్ల ఆయన మాటలు నిజమయ్యాయి. తమిళంలో ‘విశారణై’ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమా చూసి నాకు ‘రంగస్థలం’లో అవకాశం ఇచ్చారు సుకుమార్. ఇక ‘పుష్ప’ చిత్రం నన్నెక్కెడికో తీసుకెళ్లింది. మీకో గమ్మత్తు విషయం చెప్పనా... ‘పుష్ప’ సినిమాలో నటించడానికి నేను మొదట ఒప్పుకోలేదు. ‘‘నేను చేయను మొర్రో’’ అంటున్నా వినకుండా కన్విన్స్ చేసి ఆ వేషం చేయించారు.
ఎందుకు చేయనన్నారు?
ఆ సమయంలో కరోనాతో బాధ పడుతున్నా. ఇంట్లోనే ఉంటున్నా. అడుగు తీసి అడుగు వేయడమే కష్టమైన పరిస్థితి. ‘ఇక నా పని అయిపోయింది. చచ్చిపోవడం ఖాయం’ అనుకున్నా. ఆ సమయంలోనే ‘పుష్ప’ సినిమా కోసం ఫోన్ చేశారు. ‘‘నాకు సినిమాలూ వద్దు. ఏమీ వద్దు. ఇలా బతకనివ్వండి చాలు’’ అని చెప్పేశాను. చాలా సార్లు ఫోన్లు చేసినా అదే మాట చెప్పేవాణ్ణి. చివరికి ఒక రోజు సుకుమార్ ఫోన్ చేసి అరగంట సేపు నాతో మాట్లాడారు. సుకుమార్‌గారు ఒకటే అన్నారు... ‘‘అజయ్ నువ్వు ఈ సినిమాలో నటించవద్దు. కానీ ఎంతకాలం అక్కడ ఒంటరిగా ఉంటావు. ఒకసారి మనుషుల్లోకి రా. మేమందరం ఇక్కడ పని చేస్తున్నాం. మాతో పాటే నువ్వూ’’ అని ఆయన చెప్పగానే ‘‘వస్తున్నాను సార్’’ అనేశా. మారేడుమిల్లి అడవుల్లో షూటింగ్. నా కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు నిర్మాతలు.
సుకుమార్ డ్యాన్స్ చేశారు...
తమిళంలో నేను ‘మూక్కుత్తి అమ్మన్’ అనే చిత్రంలో నటించాను. తెలుగులో అది ‘అమ్మోరు తల్లి’ పేరుతో విడుదల అయింది. అందులో నయనతార, నేను పాల్గొన్న సాంగ్ బాగా హిట్ అయింది. ‘పుష్ప’ షూటింగ్‌లో ఒకసారి రెండు వందల మంది యూనిట్ సభ్యుల ముందు డాన్సు చేస్తూ ‘‘ఆ పాటకు నువ్వు ఇలాగే డ్యాన్స్ చేశావు కదూ’’ అన్నారు సుకుమార్. నన్ను ఎంతో ఎంకరేజ్ చేశారాయన. నా కోసం నెల రోజుల పాటు షూటింగ్ కూడా ఆయన వాయిదా వేయడానికి కూడా సిద్ధమయ్యారని తెలిసి కళ్లు చెమర్చాయి.
రంగస్థలం’ తర్వాత ఏర్పడిన నమ్మకం ‘పుష్ప’తో బలపడింది. ‘హమ్మయ్య నాకు పని దొరుకుతోంది’ అనుకుంటూ ఉన్నాను. ఆ ధైర్యంతోనే మా ఊళ్లో ఇల్లు కట్టుకున్నా. నాకు ఇద్దరు పిల్లలు. పెద్దవాడు చంద్రశేఖర్ ఆజాద్‌కు పెళ్లయింది. ఉద్యోగం చేస్తున్నాడు. చిన్నవాడు భగత్‌సింగ్ వ్యాపారం ప్రారంభించే ఆలోచనలో ఉన్నాడు. వాడికి కూడా పెళ్లి చేస్తే నా బాధ్యత తీరినట్లే.
హిందీలో యశ్‌రాజ్ ఫిల్మ్స్ వాళ్లు ఓ సినిమాకు అడిగారు. భాష మీద పట్టు ఉంటే చేయగలం కానీ హిందీ బొత్తిగా రాదు. అందుకే ఏదో చెప్పి తప్పించుకున్నా. ఇప్పుడు సన్నీ డియోల్‌తో మలినేని గోపీచంద్ తీస్తున్న చిత్రంలో విలన్‌గా చేయడానికి ఓకే చెప్పా.
నిరుపేద కుటుంబం కదా. రెండు జతల బట్టలే ఉండేవి. కొనుక్కుందామంటే డబ్బు ఉండేది కాదు. నా పరిస్థితి చూసి నా స్నేహితులు జాలిపడి... వాళ్ల అన్నయ్యలు వాడిన బట్టల్ని నాకు తెచ్చి ఇచ్చేవారు. కొంచెం లూజుగా ఉన్నా మొహమాటపడకుండా అవే వేసుకునేవాణ్ణి. ఇప్పటికీ ఇలాగే ఉండడం ఇష్టమయ్యా. లుంగీ, ఖద్దరు షర్ట్, పైన టవల్... ఇదే నాకు కంఫర్ట్.
- వినాయకరావు