Actress Manushi Chillar Interview : నేను లక్కీ గర్ల్..!
ABN , Publish Date - Feb 18 , 2024 | 04:58 AM
అందాల పోటీల్లో విజయం సాధించి సినీ రంగ ప్రవేశం చేసిన ఐశ్వర్యరాయ్, సుస్మితాసేన్ కోవకు చెందిన నటి మానుషి చిల్లర్. 2017లో ‘మిస్ వరల్డ్’గా ఎంపికైన మానుషి... తాజాగా ‘ఆపరేషన్ వాలెంటైన్’

అందాల పోటీల్లో విజయం సాధించి సినీ రంగ ప్రవేశం చేసిన ఐశ్వర్యరాయ్, సుస్మితాసేన్ కోవకు చెందిన నటి మానుషి చిల్లర్. 2017లో ‘మిస్ వరల్డ్’గా ఎంపికైన మానుషి... తాజాగా ‘ఆపరేషన్ వాలెంటైన్’ ద్వారా తెలుగు చిత్రసీమలోకి ప్రవేశించింది. మధ్యతరగతి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన తాను హీరోయిన్ ఎలా అయిందో ‘నవ్య’కు వివరించింది.
‘మిస్ వరల్డ్’ నుంచి ‘ఆపరేషన్ వాలెంటైన్’ దాకా ప్రయాణం ఎలా సాగుతోంది?
చాలా బావుంది. ఇప్పటికి నేను హిందీలో రెండు సినిమాలు చేశా. ఇది మూడో సినిమా. కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నా. ప్రయాణం చాలా అడ్వెంచర్‌సగా సాగుతోంది.
మీకు ఏ తరహా సినిమాలు ఇష్టం?
నా చిన్నప్పుడు ఇంట్లో అందరం కలిసి సినిమాలు చూసేవాళ్లం. సినిమాకు వెళ్తే కుటుంబం అందరం కలిసే వెళ్లేవాళ్లం. నా ఉద్దేశంలో సినిమా అంటే కుటుంబం మొత్తం చూసేలా ఉండాలి. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ప్రేక్షకులకు ఒక మంచి సినిమా చూశామనే అనుభూతి కలగాలి. కొన్ని సినిమాలు సింగిల్ డైమన్షనల్‌గా ఉంటాయి. కానీ నా ఉద్దేశంలో సినిమాలో రొమాన్స్, యాక్షన్, కామెడీ అన్నీ కలిపి ఉండాలి. ఇక నాకు నచ్చిన సినిమాలంటారా... చాలానే ఉన్నాయి. చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే పిచ్చి. అన్ని సినిమాలూ చూసేదాన్ని. నాకు రొమాన్స్ సినిమాలంటే చాలా ఇష్టం. ‘దిల్‌తో పాగల్‌హై’ ఎన్నిసార్లు చూశానో తెలియదు. దర్శకుడు ప్రియదర్శన్ తీసే సిట్యువేషనల్ కామెడీలంటే ఇష్టం. రాజమౌళి ఫాంటసీ ఇష్టం. చైనీయుల యాక్షన్ ఫిల్మ్స్ అంటే ఇష్టం. ‘లిటిల్ ఉమెన్’ అనే ఒక సినిమా వచ్చింది. దానిని ఎన్నిసార్లు చూశానో నాకే తెలియదు. అంత నచ్చింది ఆ చిత్రం.
మీ బాల్యం ఎలా గడిచింది?
మా అమ్మ, నాన్న... ఇద్దరూ డాక్టర్లే. నాన్న రక్షణ శాఖలో పని చేసేవారు. ఏడేళ్ల దాకా బెంగుళూరులో పెరిగాను. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లిపోయాం. మాది ఒక ఎగువ మధ్యతరగతి కుటుంబం. నాకు చెల్లి, తమ్ముడు ఉన్నారు. చిన్నప్పటి నుంచి అమ్మానాన్న మమ్మల్ని బాగా చదువుకోమని చెబుతూ ఉండేవారు. నా స్నేహితులందరూ ఇంజినీరింగ్ గురించి.. మెడిసిన్ గురించి మాట్లాడుకుంటూ ఉండేవారు. నేను కూడా బాగా చదువుకొని మెడిసిన్‌లో చేరా. రెండేళ్లు చదివా. ఆ సమయంలోనే ‘మిస్ వరల్డ్’ గెలుచుకున్నా. ఒక ఏడాది ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నా. ఆ తర్వాత సినీరంగంలోకి వచ్చేశా.
మీ కుటుంబంలో అందరూ చదువరులు కదా! మీరు ఈ గ్లామర్ రంగంలోకి ఎలా వచ్చారు?
అవును. నేను కూడా బాగా చదివేదాన్ని. కానీ పరీక్షల ముందు మాత్రమే చదివేదాన్ని. మిగిలిన సమయాల్లో డ్యాన్స్, పెయింటింగ్ కాంపిటేషన్స్‌కు వెళ్లేదాన్ని. మా స్కూల్లో కూడా ఇలాంటి కాంపిటీషన్స్‌ను ప్రొత్సహించేవారు. మంచి మార్కులు వచ్చేవి కాబట్టి అమ్మానాన్న ఏమనేవారుకాదు. 15 ఏళ్ల వయస్సులో నాన్న దగ్గరకు వెళ్లి... ‘‘నేను డాక్టర్ అవుతా’’ అన్నా. అప్పుడు నాన్న... ‘‘డాక్టర్ అవ్వాలంటే కష్టపడి చదవాలి. హాబీలంటూ తిరిగితే కష్టం’’ అని చెప్పారు. దాన్ని ఒక ఛాలెంజ్‌గా తీసుకున్నా. ఎంబీబీఎ్‌సలో చేరా! ఇక్కడ నేను చెప్పదలుచుకున్నదేమిటంటే.. నేను ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవటానికి ఇష్టపడతాను. దానిని ఒక ఛాలెంజ్‌గా తీసుకుంటాను.
ముందు అందాల పోటీలు.. ఇప్పుడు సినిమాలు .. ఇవి కూడా అంతేనా?
అవును. నేను ఎప్పుడూ ‘మిస్ వరల్డ్’ అవుతానని అనుకోలేదు. ‘మిస్ ఇండియా’ అవుతానని కూడా అనుకోలేదు. ఎవరితోనైనా చెబితే నమ్మరు కానీ... ‘మిస్ ఇండియా’ పోటీల ముందు రోజు విపరీతమైన టెన్షన్ పడ్డాను. కళ్లజోడు పెట్టుకొని నైట్ డ్రెస్‌లో పుస్తకం పట్టుకొని కూర్చున్నా. ‘మిస్ ఇండియా’ ఫైనలి్‌స్టనంటే ఎవ్వరూ నమ్మరు కూడా. ఒకవేళ పోటీలో ఓడిపోతే? కాలేజీ అటెండెన్స్ ఎలా? అని ఆలోచిస్తూ కూర్చున్నా. ‘మిస్ ఇండియా’ పోటీల్లో గెలిచిన తర్వాత రెండున్నర నెలలకు ‘మిస్ వరల్డ్’ పోటీలు జరిగాయి. ఆ రెండున్నర నెలల్లో చాలా నేర్చుకున్నా. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చా. ఇప్పుడూ నేర్చుకొంటున్నా. ‘‘ హీరోయిన్ అవుతానని చిన్నప్పుడే తెలిస్తే... ముందే అన్నీ నేర్చుకొనేదాన్ని కదా’’ అని అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటా. ఒక విధంగా చూస్తే నేను చాలా లక్కీ గర్ల్. అదృష్టం కలిసిరాకపోతే ఇవన్నీ సాధించటం కష్టమే!
మీ జీవితంలో మీకు లభించిన అతి గొప్ప కాంప్లిమెంట్..?
‘ఆపరేషన్ వాలెంటైన్’ టీజర్ విడుదలయిన తర్వాత నాన్న... ‘లైఫ్ ఈజ్ వాట్ యూ మేకిట్’ అన్నారు. నా జీవితంలో నేను ఆ సిద్ధాంతానే నమ్ముతాను. మనకు అవకాశాలు వస్తూనే ఉంటాయి. వాటిని ఎలా వాడుకుంటామనే విషయంపైనే మొత్తం ఆధారపడి ఉంటుంది. అమ్మానాన్న మాకు ఎప్పుడూ అదే చెప్పేవారు. ‘‘నీ జీవితం ఎలా బతుకుతావన్నది నీ ఇష్టం. నీకు మేము కేవలం సాయం మాత్రమే చేయగలం’’ అనేవారు. మొదట్లో నాకు ఈ వాక్యాలు అర్థం కాలేదు. ఇప్పుడు నెమ్మదిగా అర్ధమవుతున్నాయి.
మీ ఇంట్లో చాలా మంది రక్షణ దళాల్లో పనిచేశారు కదా.. ‘ఆపరేషన్ వాలెంటైన్’ షూటింగ్‌లో ఎలా అనిపించింది?
మా అంకుల్స్ ఆర్మీలో ఉండేవారు. గతంలో ఆర్మీ నేపథ్యంలో వచ్చిన సినిమాలను అందరం కలిసి చూసేవాళ్లం. ఆ సినిమాలు వాస్తవికంగా ఉండేవి కాదు. దాంతో మా అంకుల్స్‌కు నచ్చేవి కావు. నాన్న కూడా రక్షణ శాఖలోనే పనిచేస్తూ ఉండటం వల్ల అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో నాకు తెలుసు. అయితే ఈ సినిమాలో నేను రాడార్ కంట్రోలర్ పాత్రలో నటించా. షూటింగ్ జరుగుతున్న సమయంలో మాతో పాటు ఒక లేడీ రాడార్ కంట్రోలర్ ఉండేవారు. ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో వివరించేవారు. ఈ సినిమా తర్వాత నాకు రక్షణ దళాలలో ఉన్నవారిపై గౌరవం మరింత పెరిగింది. ఇలాంటి పాత్రలు అతి తక్కువగా ఉంటాయి. వాటిలో ఒకటి నాకు రావటం చాలా ఆనందంగా అనిపిస్తోంది.
సీవీఎల్‌ఎన్ ప్రసాద్