సెక్విన్ సెన్సేషన్
ABN, Publish Date - Oct 02 , 2024 | 05:41 AM
సెక్విన్లు దుస్తుల్లో ఒక భాగంగా కాకుండా, సెక్విన్లతో తయారైన దుస్తులే ఫ్యాషన్‌గా రాజ్యమేలడం మొదలుపెట్టాయి. లెహంగాలు, సూట్స్, చీరలు... ఇలా అన్ని రకాల దుస్తుల్లో సృజనాత్మకతతో మెరుపులు చిందిస్తున్న సెక్విన్ సెన్సేషన్ ఫ్యాషన్ మీకోసం!
ఫ్యాషన్
సెక్విన్లు దుస్తుల్లో ఒక భాగంగా కాకుండా, సెక్విన్లతో తయారైన దుస్తులే ఫ్యాషన్‌గా రాజ్యమేలడం మొదలుపెట్టాయి. లెహంగాలు, సూట్స్, చీరలు... ఇలా అన్ని రకాల దుస్తుల్లో సృజనాత్మకతతో మెరుపులు చిందిస్తున్న సెక్విన్ సెన్సేషన్ ఫ్యాషన్ మీకోసం!
తగిన మ్యాచింగ్‌తో...
లెహంగా, చీరలు, చుడీదార్లు, జాకెట్స్.. ఇలా అటు ఆధునిక వస్త్రధారణకూ, ఇటు సంప్రదాయ చీరలకూ సెక్విన్లు కొత్త హంగులను తెచ్చిపెడుతున్నాయి. ధరతో పాటు మెరుపు కూడా పెరిగిపోయే సెక్విన్లు డిజైన్ చేసే తీరు కూడా వినూత్నంగా ఉంటుంది. సౌకర్యంగా, సుతి మెత్తగా ఉంటూనే, నచ్చినట్టు డిజైన్ చేసుకోగలిగే సౌలభ్యం ఉన్న సెక్విన్లు అందుబాటులోకి రావడంతో వేడుకకు తగ్గట్టు దుస్తుల్ని డిజైన్ చేసుకునే ధోరణి కూడా పెరిగింది. అలాగే దాదాపు అన్ని రకాల పరిమాణాలు, రంగుల్లో సెక్విన్లు తయారవుతున్నాయి. కాంట్రాస్ట్ కలర్ సెక్విన్లు దుస్తుల్ని మరింత ఆకట్టుకునేలా కనిపించేలా చేస్తాయి. కాబట్టి ప్రత్యేకంగా కనిపించాలనుకునేవాళ్లు ఈ తరహా సెక్విన్ వర్క్ ఎంచుకోవాలి.
ప్రముఖులు మెచ్చే ఫ్యాషన్
మెరిసే దుస్తులను చిన్నతనంగా భావించే రోజులు పోయాయి. వీలైనంత మెరుపులు వెదజల్లే దుస్తులు ధరించడమే లేటెస్ట్ ఫ్యాషన్. ఫ్యాషన్ ట్రెండ్‌ను దగ్గరి నుంచి గమనించే వాళ్లకు ఈ సెక్విన్ ఫీవర్ ఎంతలా పూనిందో తేలికగానే అవగతమైపోతుంది. ఒంటికి హత్తుకున్న సిల్వర్ సెక్విన్ గౌన్ వేసుకుని, ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌లో మెరుపులు చిందించిన, ప్రముఖ మోడల్, కైలీ జెన్నర్ మొదలు, అర్పితా మెహతా డిజైన్ చేసిన ఎరుపు చీర కట్టిన సమంతా రూత్ ప్రభు వరకూ సెక్విన్ లుక్‌ను దాదాపు మహిళలందరూ ఇష్టపడడం మొదలుపెట్టారు. మరీ ముఖ్యంగా ఈవినింగ్ పార్టీలు, లైట్ల వెలుగులతో మెరిసిపోయే వేడుకలకు సెక్విన్ దుస్తులు చక్కగా సూటవుతాయి. కాబట్టే సెక్విన్ ట్రెండ్ సెన్సేషన్‌గా మారింది.
యాక్ససరీస్ ఆచితూచి
భారీ ఝుంకాలు, బ్రేస్‌లెట్లు ఈ తరహా దుస్తులతో మ్యాచ్ చేసుకోవచ్చు. అలాగే కాళ్లకు వేసుకునే హైహీల్స్ కూడా సెక్విన్ వర్క్ కలిగి ఉన్నవైతే ఇంకా బాగుంటుంది. ఇక చేతిలో మెరుపులీనే సెక్విన్ పర్స్, గోళ్లకు చమ్కీ నెయిల్ పెయింట్, పెదవుల మీద గ్లిట్టర్ లిప్‌స్టిక్, కనురెప్పలు, చుబుకాల మీద గ్లిట్టర్ బ్లష్ ధరిస్తే, ఆకాశంలో తారలా వెలిగి పోవచ్చు. అమెరికన్ డైమండ్స్‌తో తయారైన జ్యువెలరీ ఈ తరహా దుస్తులకు చక్కగా నప్పుతుంది.
Updated Date - Oct 02 , 2024 | 05:45 AM