ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ayurvedic Tips: నెయ్యితో అనారోగ్యం దూరం

ABN, Publish Date - Dec 08 , 2024 | 05:44 AM

చలికాలంలో ఎదురయ్యే అనారోగ్య సమస్యలను నివారించడంలో నెయ్యి ప్రధాన పాత్ర పోషిస్తుంది.

చలికాలంలో ఎదురయ్యే అనారోగ్య సమస్యలను నివారించడంలో నెయ్యి ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆయుర్వేద మందుల్లో కూడా నెయ్యిని విరివిగానే ఉపయోగిస్తుంటారు. శీతాకాలంలో తరచూ జలుబు, దగ్గు, పొడిచర్మం, కీళ్ల నొప్పులు బాధిస్తుంటాయి. వీటి నుంచి ఉపశమనం పొందడానికి నెయ్యితో అనుసరించే ఇంటి చిట్కాల గురించి తెలుసుకుందాం!

దగ్గుకి: ఒక చిన్న గిన్నెలో రెండు చెంచాల నెయ్యి వేసి వేడి చేయండి. ఇందులో చిటికెడు మిరియాల పొడి లేదా చిటికెడు పసుపు వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని రోజుకి రెండు సార్లు తినడం వల్ల గొంతు గరగర, దగ్గు లాంటివి తగ్గుతాయి.

మంచి నిద్రకి: రాత్రి పడుకునేముందు పాదాలను, అరికాళ్లను గోరువెచ్చని నెయ్యితో మర్దన చేయండి. దీనివల్ల మెదడు నుంచి పాదాల వరకు రక్త ప్రసరణ జరిగి మంచి నిద్ర పడుతుంది. అలాగే ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో ఒక చెంచా నెయ్యి, చిటికెడు జాజికాయ పొడి కలుపుకుని తాగినా మంచి ఫలితం కనిపిస్తుంది. అలసట తీరి శరీరం విశ్రాంతి పొందుతుంది. కాలేయం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

పొడి చర్మానికి: ఒక గిన్నెలో అయిదు చెంచాల నెయ్యి వేసి కొద్దిగా వేడి చేయండి ఈ మిశ్రమాన్ని ముఖానికి చేతులకు పట్టించండి. నెయ్యిలో ఉండే తేమ, పోషకాలు అంది చర్మం మృదువుగా మారుతుంది. మంచి ఛాయతో మెరుస్తుంది కూడా.

పంటి చిగుళ్లకు: నెయ్యిలో అధికంగా బ్యుటిరిక్‌ యాసిడ్‌ అనే ఫ్యాటీ యాసిడ్‌ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి పంటి చిగుళ్లు, దవడల లోపలి భాగాల్లో చేరే వ్యాధి కారక క్రిములతో పోరాడుతాయి. ప్రతి రోజూ భోజనంలో రెండు చెంచాల నెయ్యిని చేర్చుకోవడం వల్ల చిగుళ్ల వాపు, ఇతర నోటి సమస్యలు తగ్గుతాయి.


రోగనిరోధక శక్తికి: నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో జీవక్రియలను వేగవంతం చేసి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. శరీరం వేడిని కోల్పోకుండా చేస్తాయి. నిస్సత్తువ, అలసట, నీరసాన్ని తగ్గిస్తాయి. ప్రతిరోజూ ఉదయం కాఫీ లేదా టీలో కొద్దిగా నెయ్యి కలుపుకుని తాగితే రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. అల్పాహారంలో కూడా ఒక చెంచా నెయ్యిని చేర్చుకుంటే ఎటువంటి వ్యాధులు దరిచేరవు.

కీళ్ల నొప్పులకు: నెయ్యిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఒక చెంచా నెయ్యిని కొద్దిగా వేడిచేసి అందులో చిటికెడు శొంఠి లేదా వాము పొడి కలిపి తింటూ ఉంటే కీళ్ల నొప్పులు, కండరాల వాపు తగ్గుతాయి. వీపు నొప్పి, నడుము నొప్పి, మోకాళ్ల సమస్యలు తీరతాయి. వెన్నెముక కూడా దృఢంగా మారుతుంది.

ముక్కు సమస్యలకు: జలుబు కారణంగా ముక్కు రంధ్రాలు మూసుకుపోతుంటాయి. శ్వాస కూడా ఆడదు. ఇటువంటి సమయాల్లో చూపుడు వేలిని నెయ్యిలో ముంచి దానిని ముక్కు రంధ్రాల్లోకి జొప్పించి గుండ్రంగా తిప్పుతూ మర్దన చేయాలి. దీనివల్ల ముక్కు రంధ్రాలు తెరచుకుని శ్వాస ఆడుతుంది. తలనొప్పి తగ్గుతుంది. ఏకాగ్రత కుదురుతుంది.

ఆందోళనకు: రాత్రి పడుకునేముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర చెంచా త్రిఫల చూర్ణం, ఒక చెంచా నెయ్యి కలుపుకుని తాగితే వెంటనే నిద్ర పడుతుంది. దీనివల్ల ఆందోళన, మానసిక వ్యాకులత తగ్గుతాయి. మెదడు కూడా విశ్రాంతి పొందుతుంది. పేగు కదలికలు సజావుగా జరిగి జీర్ణాశయం, మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి.

Updated Date - Dec 08 , 2024 | 05:46 AM