Cooking Tips : ముల్లంగి అంటే వ్యాధులకు హడల్!
ABN, Publish Date - Sep 21 , 2024 | 12:47 AM
‘‘సుకలిత మతిసూక్ష్మం బాలమూలస్య మూలం లవణమథిత మూర్ఛైః పీడితం పాణియుగ్మ్ఢే!! సురభితమతినింటూ హింగుధూపేన యుక్తం భవతి జఠరవహ్నేస్తూర్ణమృద్దీపనాయ!!’
‘‘సుకలిత మతిసూక్ష్మం బాలమూలస్య మూలం లవణమథిత మూర్ఛైః పీడితం పాణియుగ్మ్ఢే!! సురభితమతినింటూ హింగుధూపేన యుక్తం భవతి జఠరవహ్నేస్తూర్ణమృద్దీపనాయ!!’ అంటాడు క్షేమశర్మ తన క్షేమకుతూహలంలో! రకరకాల వ్యాధులకు ముల్లంగి గొప్ప మందు అనేది ఈ శ్లోకార్ధం.
ముల్లంగి దుంపలకు, ఆ చెట్టు ఆకులకు విశేషమైన ఔషధ గుణాలు ఉన్నాయని మన పూర్వీకులు ఎప్పుడో గమనించారు. అందుకే మన పూర్వీకులు ముల్లంగిని ఒక విశిష్టమైన దుంపగా గుర్తించారు. కాలేయం దెబ్బతిన్నప్పుడు.. మొలలు తగ్గటానికి.. అజీర్తి సమస్య తొలగిపోవటానికి.. మూత్ర పిండాల్లో రాళ్లు కరగటానికి.. సొరియాసిస్ లాంటి చర్మవ్యాధులు రాకుండా ఉండటానికి ముల్లంగి ఉపకరిస్తుందని ఆయిర్వేద గ్రంధాల్లో పేర్కొన్నారు. అంతే కాదు- ముల్లంగి వల్ల అనేక ఇతర ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి.
ముల్లంగి దుంపను ముక్కలుగా తరిగి- దానిని రాత్రి నీళ్లలో నానబెట్టి- ఉదయాన్నే లేచి ఆ నీళ్లు తాగితే స్థూలకాయం తగ్గుతుంది.
ముల్లంగి ముక్కలతో జ్యూస్ చేసి.. దానిలో నీళ్లు, నిమ్మకాయ రసం కలిపి- ఉదయాన్నే తాగితే మధుమేహం తగ్గుతుంది. చెడు కొలస్ట్రాల్‌కు చెక్ పడుతుంది.
ముల్లంగి దుంప, ఆకులను తీసుకొని మిక్సిలో వేసి జ్యూస్ చేసి తాగితే కళ్లకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి.
ముల్లంగి రసం, నువ్వుల నూనె కలిపి బాగా కాచి- చల్లారిన తర్వాత ఒక సీసాలో పోసుకోవాలి. దీనిని క్రమం తప్పకుండా రాస్తే బొల్లి మచ్చలు తగ్గిపోతాయి.
మన మెదడు మధ్యభాగంలో ఉండే పీనియల్ గ్రంథి- రాత్రి సమయంలో మెలటోనిన్ అనే హార్మోనుని ఉత్పత్తి చేస్తుంది. పగలు ఈ హార్మోను ఉత్పత్తి కాదు. రాత్రిళ్లు మెలుకువగా ఉండేవారిలో ఈ హార్పోను ఉత్పత్తి కాదు. దీని వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. వీటికి ముల్లంగి పరిష్కారాన్ని చూపిస్తుంది.
కూర ఎలా చేయాలి?
లేత ముల్లంగి దుంపలను ఎంచుకొని.. పై తొక్క తీసేయాలి. దుంపలను చిన్న ముక్కలుగా తరిగి ఉప్పు చల్లాలి. అప్పుడు కొన్ని నీళ్లు ఊరతాయి. వాటిని తీసేయాలి. ఒక మూకుడులో నూనె వేసి కాచాలి. ఆ నూనెలో తాలింపు పెట్టాలి. ఇంగువ కూడా వేయాలి. ఆ తర్వాత ముల్లంగి ముక్కలను వేసి మూత పెట్టి కొద్ది సేపు మగ్గనివ్వాలి. వేడి తగ్గిన తర్వాత కూరలో నిమ్మకాయ రసాన్ని కలపాలి. కొందరు ముల్లంగిని తురిమి పెరుగులో కలిపి పచ్చడి కూడా చేస్తారు.
-గంగరాజు అరుణాదేవి
Updated Date - Sep 21 , 2024 | 12:47 AM