Pet Hygiene: పెంపుడు జంతువులతో జాగ్రత్త!
ABN, Publish Date - Dec 09 , 2024 | 03:09 AM
మనం ఇళ్లలో సాధారణంగా కుక్కలు, పిల్లులు, మేకలు లాంటి జంతువుల్ని చిలుకలు, బాతులు, పావురాలు లాంటి పక్షులను పెంచుకుంటూ ఉంటాము.
మనం ఇళ్లలో సాధారణంగా కుక్కలు, పిల్లులు, మేకలు లాంటి జంతువుల్ని చిలుకలు, బాతులు, పావురాలు లాంటి పక్షులను పెంచుకుంటూ ఉంటాము. వీటి ఆరోగ్యం, పరిశుభ్రత తదితరాలపై ప్రత్యేక శ్రద్ద చూపిస్తూ ఉంటాం. అయిన్పటికీ పెంపుడు జంతువులు లేదా పక్షుల నుంచి మనకు కొన్ని అంటువ్యాధులు సోకే ప్రమాదం ఉంటుంది. వాటి గురించి తెలుసుకుందాం!
రేబిస్: పిల్లలకు పాలిచ్చి పెంచే క్షీరదజాతి జంతువులైన కుక్కులు, పిల్లులు, తదితరాల నుంచి రేబిస్ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి సోకిన జంతువుల లాలాజలంలో వ్యాధికారక క్రిములు ఉంటాయి. పెంపుడు జంతువులతో దగ్గరగా మసలుతున్నపుడు అవి కరచినా, తుమ్మినా వ్యాధి క్రిములు మన శరీరంలోకి చేరతాయి. తీవ్రమైన తలనొప్పి, గొంతునొప్పి, జ్వరం వంటివి రేబిస్ లక్షణాలు. ఇది ప్రాణాంతక వ్యాధి. రేబిస్ వేక్సిన్ తీసుకున్నప్పటికీ ఆర్నెల్ల నుంచి రెండేళ్ల వరకు మాత్రమే రక్షణ లభిస్తుంది. పెంపుడు జంతువులతో గడుపుతున్నపుడు మాస్కులు ధరించడం, తరచూ చేతులు పరిశుభ్రం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. పెంపుడు జంతువులకు ప్రతినెలా ఆరోగ్య పరీక్షలు చేయించి అవసరమైన చికిత్సలు అందించాలి.
బర్డ్ ఫ్లూ: ఇది కోళ్లు, బాతుల వల్ల వ్యాప్తి చెందుతుంది. వీటివల్ల మనుషులకే కాదు జంతువులకు కూడా బర్డ్ ఫ్లూ వచ్చే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి సోకిన పక్షుల రెట్టలు, లాలాజలం, కళ్ల స్రావాల్లో వ్యాధి కారక వైరస్ ఉంటుంది. బర్డ్ ఫ్లూ వ్యాధికి గురైన వారిని దగ్గు, శ్వాసకోశ ఇబ్బందులు, తలనొప్పి, జ్వరం, కండరాల నొప్పి, ముక్కు కారడం, గొంతు నొప్పి లాంటివి వేధిస్తుంటాయి. ఈ లక్షణాలు కనిపించి రెండు రోజులైనా తగ్గని పక్షంలో వైద్యుని సంప్రదించాలి. కోళ్లని పెంచుతున్నపుడు అవి ఉన్న ప్రదేశాన్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేయాలి. కనీసం రెండు నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు చేయించాలి.
గోండి: ఈ వ్యాధి పిల్లుల మల మూత్రాల వల్ల వ్యాప్తి చెందుతుంది. పిల్లులు ఎక్కువగా తిరిగే ప్రదేశాల్లో ఉండే ఇసుక కాడా హానికారకమే. ఈ వ్యాధి సోకినపుడు కండరాల నొప్పి, కీళ్ల వాపు, జలుబు బాధిస్తుంటాయి. పిల్లులను పెంచేవారు తరచూ చేతులను శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఇంటి చుట్టూ మొక్కలను పెంచుతున్నట్లయితే అక్కడ కూడా పిల్లులు తిరుగుతూ ఉంటాయి కాబట్టి కుండీల్లో మట్టిని మార్చడం, తోటపని తరవాత చేతులు, గోళ్లను వేడి నీటితో కడుక్కోవాలి. ఒకసారి ఈ వ్యాధికి గురయితే దీనిని నివారించడం అసాధ్యం.
Updated Date - Dec 09 , 2024 | 03:35 AM