Health Principles : అరటి ఆకుల్లో ఆరోగ్యం
ABN, Publish Date - Aug 06 , 2024 | 02:08 AM
అరిటాకులో భోంచేస్తాం. అరిటాకులో చుట్టి ఆవిరి మీద ఉడికించుకుంటాం. ఈ అలవాటులో ఎన్నో ఆరోగ్య సూత్రాలు దాగి ఉన్నాయి. మరీ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని సంప్రదాయ వంటకాల్లో...
గుడ్ ఫుడ్
అరిటాకులో భోంచేస్తాం. అరిటాకులో చుట్టి ఆవిరి మీద ఉడికించుకుంటాం. ఈ అలవాటులో ఎన్నో ఆరోగ్య సూత్రాలు దాగి ఉన్నాయి. మరీ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని సంప్రదాయ వంటకాల్లో, పాకశాస్త్రంలో అరటి ఆకులు ప్రధాన పాత్రను పోషిస్తూ ఉంటాయి. ఇందుకు కారణం అరటిఆకుల్లో ఆరోగ్యాన్ని పెంచే పోషకాలు దాగి ఉండడమే!
అయితే అరటిఆకుల్లోని సుగంధభరితమైన పాలిఫినాల్స్ మన శరీరానికి అందాలంటే అరటి ఆకుల్లో భోజనం చేస్తే సరిపోదు.
ఆ ఆకుల్లో పదార్థాలను ఉంచి, ఆవిరి మీద ఉడికించాలి. అరటి ఆకులు కలిగి ఉండే మైనపు ఆకృతి, నిర్దిష్టమైన రుచి, అత్యధిక పీచు వల్ల అవి తినడానికి పనికిరాకపోవచ్చు.
ఒకవేళ తిన్నా మన శరీరంలో సెల్యులోజ్ ఉండదు కాబట్టి ఆ ఆకులు జీర్ణం కావు. కాబట్టి అరటిఆకుల్లోని ఆరోగ్యకరమైన పోషకాలను పొందడం కోసం ఆ ఆకుల్లో పదార్థాలను వండుకునే విధానాన్ని అలవాటు చేసుకోవాలి.
మోమోస్, మోడక్స్, చేపలు మొదలైన పదార్థాలను ఆవిరి మీద వండి తినడానికి అరటి ఆకులు వీలుగా ఉంటాయి. గోవా, పార్సీ వంటకాలు ఎక్కువగా ఈ విధంగానే తయారవుతూ ఉంటాయి.
చైనీస్ వంటకాల్లో కూడా కొన్ని మాంసపు రెసిపీలను అరటి ఆకుల్లోనే వండుతూ ఉంటారు. అయితే వంట కోసం ఉపయోగించే ఆకులు తాజాగా, లేతగా ఉండాలి. వాటిని శుభ్రం చేసి ఉపయోగించుకోవాలి.
ఆరోగ్య ప్రయోజనాలు
అరటి ఆకుల్లో వండిన వంటకాలకు మధుమేహంతో పోరాడే గుణాలు సమకూరతాయని పరిశోధనల్లో తేలింది.
అలాగే అరటి ఆకుల్లో వండడం వల్ల ఆ ఆకుల నుంచి విడుదలయ్యే పాలిఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్ ఆహారంలో కలుస్తాయి.
దాంతో యాంటీఆక్సిడెంట్ ప్రయోజనాలను పొందవచ్చు. వీటి వల్ల మధుమేహం, కేన్సర్, గుండె జబ్బులకు కొంత మేరకు అడ్డుకట్ట వేయవచ్చు.
ఇలా వండుకోవచ్చు
ఆరటి ఆకుల్లో చుట్టిన పదార్థాలను గ్రిల్ చేసుకోవచ్చు. స్టీమ్, డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. కూరలు, అన్నం, కూరగాయలు వీటన్నిటినీ అరటి ఆకుల్లో చుట్టి వండుకోవచ్చు.
ఇడ్లీ పాత్రల్లో అడుగున అరటి ఆకులను ఉంచి, పిండి నిండి ఇడ్లీలను వండుకోవచ్చు. ఇలా ఇడ్లీల కోసమే కాకుండా, ఢోక్లాలను కూడా ఆవిరి మీద వండుకోవచ్చు.
గుజరాతి వంటకమైన పాంకి కోసం, అరటి ఆకుల మీద పాంకి పిండి పోసి, వేడి పెనం మీద నూనె వేసి కాల్చుకుంటారు. గ్రిల్ చేసిన తర్వాత ఆకులను తీసేసి పాల్కిలను తినొచ్చు.
ఇలా గ్రిల్ చేయడం వల్ల అరటిఆకుల్లోని పోషకాలు వంటకంలోని చేరతాయి. వియత్నాంలో కూరగాయలు, బియ్యం, మాంసం వంటకాల తయారీ కోసం ఆయా పదార్థాలను అరటి ఆకుల్లో ఉంచి ఉడికిస్తారు. అలాగే బార్బిక్యూలో తయారీలో మ్యాట్‌గా కూడా అరటి ఆకులను వాడుకోవచ్చు.
Updated Date - Aug 06 , 2024 | 02:08 AM