ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Health Remedies : నోటి పుండ్లను నివారిద్దామిలా!

ABN, Publish Date - Nov 17 , 2024 | 12:18 AM

నోటి పుండ్లు సాధారణంగా దవడ లోపల, పంటి చిగుళ్ల మీద, పెదాల లోపల, నాలుక చివర్లలో ఏర్పడుతుంటాయి.

నోటి పుండ్లు సాధారణంగా దవడ లోపల, పంటి చిగుళ్ల మీద, పెదాల లోపల, నాలుక చివర్లలో ఏర్పడుతుంటాయి. వీటివల్ల ఎటువంటి హాని ఉండదు. కానీ ఆహారం తీసుకోవాలన్నా, మాట్లాడాలన్నా తీవ్రమైన నొప్పి బాధిస్తుంది. నోటిని పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం, మలబద్దకం, పోషకాహార లోపం, జీర్ణాశయ సమస్యలు, హార్మోన్‌ మార్పుల కారణంగా నోటి పుండ్లు ఏర్పడతాయి. వీటి నివారణలో అద్భుతంగా పనిచేసే ఇంటి చిట్కాల గురించి తెలుసుకుందాం!

  • కొబ్బరి పాలు: కొబ్బరిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి నొప్పి, వాపులను తగ్గిస్తాయి. అర చిప్ప కొబ్బరి ముక్కలకు తగిననన్ని నీళ్లు చేర్చి మెత్తగా రుబ్బి సన్నని వస్త్రంతో వడకట్టాలి. ఇలా తయారుచేసుకున్న కొబ్బరి పాలను నోటి నిండా నింపుకొని ఒక నిముషం అలాగే ఉండాలి. తరవాత నోటిని పుక్కిలించాలి. ఇలా రోజుకు మూడుసార్లు చేస్తూ ఉంటే రెండు రోజుల్లో పుండ్లు తగ్గిపోతాయి. పుండ్ల మీద తరచూ కొబ్బరి నూనె రాస్తుంటే కూడా ఉపశమనంగా ఉంటుంది.

  • అతి మధురం: ఇది పేరుకు తగ్గట్టు తీయగా ఉండే ఆయుర్వేద ఔషధం. ఇందులో సహజంగానే నొప్పిని తగ్గించే గుణాలు ఉంటాయి. ఒక గిన్నెలో ఒక చెంచా అతి మధురం పొడి వేసి దానికి రెండు చెంచాల నీళ్లు కలిపి తయారుచేసిన మిశ్రమాన్ని పుండ్ల మీద రాయాలి. కనీసం పదిహేను నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. తరవాత మంచి నీటితో నోరు కడుక్కోవచ్చు. ఇలా రోజుకు రెండుసార్లు చేస్తూ ఉంటే మూడు రోజుల్లో క్రమంగా మంట తగ్గి పుండ్లు మాయమవుతాయి. ఒక చెంచా అతి మధురం పొడిని అర చెంచా తేనెతో కలిపి తింటే నోటి పుండ్లకు కారణమైన వ్యర్థాలన్నీ బయటికి వెళ్లిపోతాయి.


  • కలబంద గుజ్జు: ఇది పుండ్లను గాయాలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. కలబంద ఆకును నిలువుగా కత్తిరించి అందులోని గుజ్జును తీసుకోవాలి. దీనిని దూది సహాయంతో నోటిలోని పుండ్ల మీద పట్టించాలి. పది నిమిషాల తరవాత గోరువెచ్చని నీటితో నోరు కడుక్కోవాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేస్తే పుండ్లు మానిపోతాయి.

  • లవంగ నూనె: ఇది దంత సమస్యలతోపాటు పంటి చిగుళ్ల మీద ఏర్పడే పుండ్లకు కూడా మంచి ఔషధంలా పనిచేస్తుంది. నోటిలో ఉండే హానికారక క్రిములను నాశనం చేస్తుంది. ఒక గిన్నెలో మూడు చుక్కల లవంగం నూనె, రెండు చుక్కల కొబ్బరినూనె లేదా గ్లిసరిన్‌ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని దూది సహాయంతో పుండ్ల మీద అద్దాలి. కొద్దిసేపటి తరవాత నోటిలో ఊరిన లాలాజలాన్ని ఉమ్మివేయాలి. ఇలా రోజుకు నాలుగుసార్లు చేస్తే పుండ్ల చుట్టూ ఉన్న వాపు, నొప్పి తగ్గుతాయి.

  • త్రిఫల చూర్ణం: ఇది ఉసిరి కాయలు, కరక్కాయలు, తానికాయలు కలిపి పొడిచేసిన ఆయుర్వేద ఔషధం. ఈ పొడి వ్యాధికారక క్రిములతో పోరాడి వాటిని నాశనం చేస్తుంది. ఒక గ్లాసు నీటిలో అర చెంచా త్రిఫల చూర్ణం వేసి బాగా మరగించి కషాయంలా తయారు చేసుకోవాలి. దీనితో రోజుకి మూడు పూటలా పుక్కిలించాలి. ఇలా రెండు రోజులు చేస్తే నోరు శుభ్రపడి పుండ్లు తగ్గిపోతాయి.


  • తులసి: నాలుక చివర్లలో పుండ్లు ఏర్పడినపు అయిదు తులసి ఆకులను నోటిలో వేసుకుని బాగా నమలాలి. అప్పుడు తులసి ఆకుల నుంచి వచ్చే రసం పుండ్ల మీదకు చేరి వాటిని తగ్గిస్తుంది. ఒక గ్లాసు మంచినీటిలో తులసి ఆకులు వేసి గంటసేపు ఉంచాలి. తరవాత ఆ నీటిని వడబోసి తాగినాకూడా మంచి ఫలితం కనిపిస్తుంది.

  • తేనె, పసుపు: తేనె క్రిమి నాశినిగా పనిచేస్తుంది. పసుపులోని కర్కుమిన్‌ అనే పదార్థం గాయాలను త్వరగా మాన్పుతుంది. ఒక గిన్నెలో రెండు చెంచాల తేనె, రెండు చిటికెల పసుపు వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని పుండ్ల మీద రాయాలి. పదిహేను నిమిషాలు అలాగే ఉంచుకుని తరవాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా రెండు రోజులు చేస్తే పుండ్లు తగ్గుముఖం పడతాయి.

Updated Date - Nov 17 , 2024 | 12:26 AM