ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Major Sita Ashok : విలయ సీమలో వారధిగా..!

ABN, Publish Date - Aug 05 , 2024 | 12:43 AM

కనికరంలేని కఠోర వాతావరణం, పెరుగుతున్న నీటిమట్టాలు, ఎటుచూసినా శిథిలాలు... అడుగుతీసి అడుగు వేసే అవకాశం లేని నేల... ఇలాంటి పరిస్థితుల్లోనూ మేజర్‌ సీతా అశోక్‌ షెల్కే ధైర్యం సడలిపోలేదు.

రాత్రికిరాత్రి ముంచుకొచ్చిన విలయం... కేరళలోని వయనాడ్‌ ప్రాంతాన్ని మృత్యుభూమిగా మార్చేసింది.ఊళ్ళకు ఊళ్లు నేలమట్టమై, వందలమంది ప్రాణాలు కోల్పోయిన పెను విపత్తు నేపథ్యంలో... అడుగడుగునా అవరోధాలు ఎదురవుతున్నా.... దృఢ సంకల్పంతో తన జట్టును నడిపించారు మేజర్‌ సీతా అశోక్‌ షెల్కే. కేవలం 31 గంటల్లో 190 అడుగుల వంతెన నిర్మించి సహాయక చర్యలు వేగవంతం చేశారు.

కనికరంలేని కఠోర వాతావరణం, పెరుగుతున్న నీటిమట్టాలు, ఎటుచూసినా శిథిలాలు... అడుగుతీసి అడుగు వేసే అవకాశం లేని నేల... ఇలాంటి పరిస్థితుల్లోనూ మేజర్‌ సీతా అశోక్‌ షెల్కే ధైర్యం సడలిపోలేదు.

తన 140 మంది సభ్యుల బృందాన్ని పరుగులు పెట్టించారు. రికార్డు స్థాయిలో 31 గంటల్లోనే... ఇరువంజిప్పుజా నది మీద చురాల్‌మల నుంచి ముండక్కై మధ్య 190 అడుగుల వంతెన నిర్మాణం పూర్తి చేయించారు. తద్వారా ముండక్కైలో సహాయక చర్యలు చేపట్టడానికి, బాధితుల కుటుంబాలకు నీరు, ఆహారాన్ని వాహనాల్లో తరలించడానికీ వీలు కలిగింది.

దీనికి దోహదం చేసిన సీత సారథ్యంలోని... భారత సైన్యానికి చెందిన, ‘మద్రాస్‌ ఇంజనీరింగ్‌ గ్రూప్‌ (ఎంఇజి)’ను అభినందనలు ముంచెత్తుతున్నాయి. ‘మద్రాస్‌ సప్పర్స్‌’గా ప్రసిద్ధమైన ఈ ఇంజనీరింగ్‌ యూనిట్‌ ప్రధాన విధులు... సైన్యం ప్రవేశించడానికి మార్గాలను సుగమం చేయడం, వంతెనలు నిర్మించడం, యుద్ధ క్షేత్రాల్లో మందుపాతరలను తొలగించడం.

బెంగళూర్‌ కేంద్రంగా పని చేస్తున్న ఈ యూనిట్‌లో సీత ఏకైక మహిళ మాత్రమే కాదు, ఆ బృందానికి నాయకురాలు కూడా. ‘‘అడుగడుగునా ప్రమాదాలు, సాహసాలతో నిండిన ఈ వృత్తిలోకి ఎంతో ఇష్టపడే వచ్చాను’’ అంటారామె.


  • ఐపీఎస్‌ కావాలనుకొని...

సీత ప్వస్థలం మహారాష్ట్రలోని గాలిల్గావ్‌ గ్రామం. ఆమె తండ్రి అశోక్‌ భికాజీ న్యాయవాది. ‘‘ఐపీఎస్‌ కావాలనేది నా చిన్ననాటి కల. కానీ సరైన మార్గదర్శకత్వం లేకపోవడంతో అది నెరవేరలేదు. అహ్మద్‌నగర్‌లో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేశాను. ఈలోగా సైన్యంలో చేరాలనే కోరిక బలపడింది.

ఆ ఆలోచనకు నా కుటుంబం కూడా మద్దతునిచ్చింది. సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డ్‌ (ఎస్‌ఎ్‌సబి) పరీక్షలో రెండు సార్లు ఫెయిలయ్యాను. మూడోసారి సాధించి, 2012లో ఆర్మీలో చేరాను’’ అని గుర్తు చేసుకున్నారు సీత. చెన్నైలోని ‘ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ (ఓటిఏ)లో శిక్షణ పొందాక... ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. అంచెలంచెలుగా ఎదిగి... యూనిట్‌కు సారథ్యం వహించే స్థాయికి చేరుకున్నారు.

దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రకృతి విపత్తులప్పుడు, ముఖ్యంగా 2018లో కేరళను వరదలు ముంచెత్తినప్పుడు సహాయక చర్యల్లో ఈ యూనిట్‌ చాలా చురుగ్గా పాల్గొంది. తాజాగా వయనాడ్‌లోని ముండక్కై, చురాల్‌మల్‌ ప్రాంతాల్లో సైన్యంతో కలిసి ఈ ఇంజనీర్ల బృందం సాహసోపేతంగా పని చేస్తోంది. ‘‘వాతావరణ పరిస్థితులవల్ల వంతెన నిర్మాణానికి ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. అవసరమైన భాగాలన్నిటినీ బెంగళూరు నుంచి తీసుకువచ్చాం.

రాత్రీ పగలూ కష్టపడి పని చెయ్యడం వల్ల... త్వరగా దాన్ని పూర్తి చెయ్యగలిగాం. 24 టన్నుల బరువు తట్టుకొనే సామర్థ్యం ఈ వంతెనకు ఉంది. రెండో దశ సహాయ, పునరావాస కార్యక్రమాలను సైన్యం చేపట్టడానికి దీనివల్ల వీలు కలిగింది. వాహనాలు కూడా దాని మీద ప్రయాణించవచ్చు. శాశ్వతమైన వంతెన నిర్మించేవరకూ దీన్ని ఉపయోగించుకోవచ్చు’’ అన్నారు సీత.


  • ఆ గుర్తింపును కోరుకోను...

ఈ వంతెన అందుబాటులోకి రావడంతో... ఎందరో ప్రజలను కాపాడడానికీ, మృతదేహాలను త్వరగా వెలికి తియ్యడానికీ వీలు కలుగుతోంది. ‘‘ఇప్పుడేకాదు, విపత్తులబారిన పడిన ప్రాంతాల్లో నిద్రాహారాలను పట్టించుకోకుండా ఆమె పని చేసిన సందర్భాలు అనేకం.

ఆమె అంకితభావం, నైపుణ్యం, ప్రతికూలతల మధ్య తన బృందాన్ని నడిపించే సామర్థ్యం ఎన్నోసార్లు రుజువయ్యాయి’’ అంటూ సైనిక ఉన్నతాధికారులు ఆమెను ప్రశంసించారు.

ఇక సోషల్‌ మీడియా సైతం ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతోంది. తనపైనా, తన బృందంపైనా కురుస్తున్న అభినందనల వర్షంపై సీత స్పందిస్తూ ‘‘ఇది కేవలం సైన్యం సాధించిన విజయం మాత్రమే కాదు. స్థానిక, రాష్ట్ర అధికారులతో సహా ఎందరో మాకు అనేక దశల్లో సహకారం అంధించారు.

ఎంతో కష్టంలో ఉన్నప్పటికీ స్థానిక ప్రజలు కనబరిచిన ధైర్యానికీ, సహాయశీలతకు ధన్యవాదాలు’’ అన్నారు. తనను సాహసోపేతమైన మహిళగా అభివర్ణించడాన్ని ఆమె అంగీకరించరు. ‘‘నేను కేవలం మహిళగా గుర్తింపును కోరుకోను. నేను సైనికురాలిని. ఈ బృందంలో భాగంగా ఉన్నందుకు నేనెంతో గర్వపడుతున్నాను’’ అంటారు మేజర్‌ సీత.

Updated Date - Aug 05 , 2024 | 12:43 AM

Advertising
Advertising
<