ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mamata Biswal : ఔషధ మొక్కలు నాటుతూ... అడవుల మీద భారం తగ్గిస్తూ

ABN, Publish Date - Oct 19 , 2024 | 05:35 AM

ఔషధ మొక్కలను విస్తృతంగా పెంచగలిగితే, ఔషధాలు అందరికీ అందుబాటులోకి రావడంతో పాటు, అడవుల మీద భారం తగ్గుతుందని భావించింది ఒరిస్సాకు చెందిన మమతా బిస్వాల్‌.

వినూత్నం

ఔషధ మొక్కలను విస్తృతంగా పెంచగలిగితే, ఔషధాలు అందరికీ అందుబాటులోకి రావడంతో పాటు, అడవుల మీద భారం తగ్గుతుందని భావించింది ఒరిస్సాకు చెందిన మమతా బిస్వాల్‌. వందల రకాల ఔషధ మొక్కల పట్ల, ఆ మొక్కల వ్యాప్తికి తోడ్పడే పక్షుల పట్ల అందర్లో అవగాహన పెంచుతూ వినూత్నమైన పనికి పూనుకున్న మమత గురించిన ఆసక్తికరమైన కథ ఇది.

చిన్నప్పటి నుంచే మొక్కలను పెంచే అభిరుచిని అలవరుచుకున్న మమత, ఔషధగుణాలు కలిగిన తులసి, కలబంద, అశోక, షమి మొక్కలను విరివిగా పెంచుతూ ఉండేది. పెళ్లయ్యాక ఆమె అభిరుచికి భర్త సహకారం తోడవడంతో, ఆ మొక్కల విస్తృత సాగు గురించి ఇంటర్నెట్‌లో పరిశోధించింది. లెక్కలేనన్ని పుస్తకాలు చదివింది. అలా సమకూర్చుకున్న పరిజ్ఞానంతో, 2011లో వాసంగ, గుడూచి, తులసి, సర్పగంధ, అశ్వగంధ, స్టీవియా, కాలమేఘ మొక్కలను ఇంట్లోనే పెంచడం మొదలుపెట్టింది.

క్రమేపీ ఔషధ మొక్కల పెంపకం... బడులు, కాలేజీలు, ఆలయాలూ, ఒరిస్సాలోని మునిసిపాలిటీలకు కూడా వ్యాప్తి చెందింది. జీవవైవిద్యాన్ని పరిరక్షించడంతో పాటు, అడవుల్లో ఔషధమొక్కల సేకరణ కోసం వెళ్లే మనుషుల సంఖ్యను తగ్గించి, తద్వారా అడవులతో పాటు వన్యప్రాణుల మీద ఒత్తిడి తగ్గించాలనే సంకల్పంతో ఔషధ మొక్కల పెంపకాలను విస్తృతంగా చేపట్టినట్టు మమత పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది.

2016 నుంచి వేలకొద్దీ ఔషధ మొక్కలను నాటిన మమత, ఆ అభిరుచికి తన ఇల్లు ఎలా తోడ్పడిందో వివరిస్తూ...‘‘ఒరిస్సా హోమ్‌ డిపార్ట్‌మెంట్‌లో స్పెషల్‌ ఆఫీసర్‌గా పనిచేసే మా వారికి, ప్రభుత్వం విశాలమైన ఇల్లు కేటాయించింది. దాంతో ఇంట్లోనే 50 రకాల ఔషధ మొక్కలను నాటి, నెమ్మదిగా వాటి సంఖ్యను పెంచుకుంటూ పోయాను. ఇప్పుడు ఆలయాలు, బడులు, కాలేజీలు... ఇలా ఔషధ మొక్కల పెంపకానికి అనువైన ప్రతి ప్రదేశంలో వాటిని పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నాను.’’ అంటూ చెప్పుకొచ్చింది. తాజాగా ‘ఆమ్‌ ఔసధ్య ఉద్భిడ’ (ఒడిసాలోని ఔషధ మొక్కలు) అనే పుస్తకం కూడా రాసిందామె.


  • రిసోర్స్‌ పర్సన్‌గా మారి...

‘‘ఔషధ మొక్కలను సాగు చేయడం వల్ల ఆ మొక్కలను అంతరించిపోకుండా కాపాడుకోవడంతో పాటు, మనుషులు జంతువుల మధ్య ఘర్షణను కూడా తగ్గించవచ్చు. వాటిని సేకరించడం కోసం అడవుల్లోకి అడుగు పెట్టే మనుషుల సంఖ్య తగ్గుతుంది కాబట్టి అటవీ పర్యావరణం కూడా ఆరోగ్యంగా ఉంటుంది’’ అంటూ ఓ సందర్భంలో చెప్పుకొచ్చిన మమతకు, 2016లో స్టేట్‌ మెడిసినల్‌ ప్లాంట్‌ బోర్డు శరక అశోక అనే ట్రైనింగ్‌ సెషన్‌కు ఆమెను ఆహ్వానించింది.

అశోకారిష్ఠ అనే మూలికా కషాయం తయారీకి ఉపయోగపడే ‘శరక అశోక’ మహిళల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఆ సెషన్‌కు వెళ్లే ముందు తాను ఆ మొక్క గురించి మరింత లోతుగా అధ్యయనం చేశాననీ, ఎస్‌ఎమ్‌పిబికి, రిసోర్స్‌ పర్సన్‌గా మారిన తర్వాత, ఔషధ మొక్కల గురించి మరెన్నో కీలకమైన విషయాలను తెలుసుకున్నాననీ చెప్పుకొచ్చింది. సంరక్షణ, సాగు, పరిశోధన, అభివృద్ధి ద్వారా ఒరిసా ప్రభుత్వం, ఎస్‌ఎమ్‌పిబి ద్వారా, ఔషధ మొక్కల రంగానికి ప్రచారం కల్పిస్తోంది. సాంకేతిక సహకారం, ప్రాథమిక ప్రాసెసింగ్‌ సౌకర్యాలను కల్పించడం ద్వారా ఎస్‌ఎమ్‌పిబి, ఔషధ మొక్కల పెంపకందారులను ప్రోత్సహిస్తోంది. రిసోర్స్‌ పర్సన్‌గా పని చేస్తున్న మమత, స్థానికంగా ఉన్న ప్రత్యామ్నాయ వైద్యులతో తన పరిజ్ఞానాన్ని పంచుకుంటోంది.


  • మొక్కలను కొంటూ, ఉచితంగా పంచుతూ..

మమత ప్రతి ఏటా భువనేశ్వర్‌ సిటీ డివిజన్‌కు చెందిన అటవీ శాఖ నుంచి వెయ్యి ఔషధ మొక్కలను కొనుగోలు చేస్తూ, వాటి నుంచి శాంప్లింగ్స్‌ను ఉత్పత్తి చేసి, అందరికీ పంచి పెడుతోంది. హెర్బల్‌ గార్డెన్‌ను పెంచాలనుకునేవాళ్లకు ఉచితంగా మొక్కలను పంచడం వల్ల, వాళ్లను పోత్రహించినట్టు అవుతుందని మమత భావిస్తోంది. మమత తన బృందంతో కలిసి ఇప్పటివరకూ తీర ఒరిస్సాలోని 120 ఆలయాల్లో మొక్కలు నాటింది. తులసి, గంధం, అశోక, షమి మొక్కలను రోడ్ల పక్కన, ఆలయాల్లో నాటింది. అలాగే త్రిస్సూర్‌, కేరళలోని త్రివేండ్రంలలో 20 మంది ప్రత్యామ్నాయ వైద్యుల బృందానికి నాయకత్వం వహిస్తోంది.


  • పక్షుల పట్ల ప్రేమ

మొక్కల జాతులను గుర్తుపట్టడంలో, మొక్కల వ్యాప్తిలో పక్షులెంతో సహాయపడతాయని గ్రహించిన మమత, స్థానిక పక్షుల పట్ల మక్కువ పెంచుకుంది. పక్షుల గురించిన అవగాహన పెంచుకోవడం కోసం నిపుణులతో కలిసి చిల్కా సరస్సును కూడా సందర్శిస్తూ ఉంటుంది. నిపుణుల బృందం వలస పక్షుల మీద దృష్టి పెడితే, మమత, స్థానిక పక్షుల పట్ల అవగాహన పెంచుకుంటోంది.

‘‘స్థానిక పక్షులు వేర్వేరు కీటకాలను తినడంతో పాటు, కొన్ని సముద్రపు మొక్కలను తింటూ ఉండడాన్ని నేను గమనించాను. ఈ పక్షులను ఆకర్షించేలా వాటికి ఆహారంగా ఉపయోగపడే మొక్కలను పెంచగలిగితే, స్థానికంగా పెరిగే ఔషధమొక్కలు వేర్వేరు ప్రాంతాలకు విస్తరించే అవకాశాలున్నాయి.

కాబట్టి స్థానిక ప్రజలకు పక్షుల పట్ల కూడా అవగాహన పెంచుతున్నాను.’’ అంటూ చెప్పుకొచ్చిన మమత, బ్రతికినంతకాలం ఔషధ మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్తూనే ఉంటాననీ, వీలున్న ప్రతిచోటా మొక్కలను నాటుతూనే ఉంటాననీ అంటోంది.

Updated Date - Oct 19 , 2024 | 05:35 AM