Navya : ఆమెకు తారలే అభిమానులు
ABN, Publish Date - Sep 16 , 2024 | 04:42 AM
కఠోర పరిశ్రమ ఎక్కడుంటుందో విజయం అక్కడే ఉంటుంది. సెలబ్రిటీ ఫిట్‌నెస్ ట్రైనర్ యాస్మిన్ కరాచీవాలా జీవితమే ఇందుకు ఉదాహరణ. ఒకప్పుడు బద్దకంగా రోజులు వెళ్లదీసిన ఆమె... నిబద్ధతతో కష్టపడి లక్ష్యాన్ని చేరుకుంది. నేడు సామాన్యులకే కాదు... వెండితెర వేల్పులకూ స్ఫూర్తిమంత్రమైంది.
కఠోర పరిశ్రమ ఎక్కడుంటుందో విజయం అక్కడే ఉంటుంది. సెలబ్రిటీ ఫిట్‌నెస్ ట్రైనర్ యాస్మిన్ కరాచీవాలా జీవితమే ఇందుకు ఉదాహరణ. ఒకప్పుడు బద్దకంగా రోజులు వెళ్లదీసిన ఆమె... నిబద్ధతతో కష్టపడి లక్ష్యాన్ని చేరుకుంది. నేడు సామాన్యులకే కాదు... వెండితెర వేల్పులకూ స్ఫూర్తిమంత్రమైంది.
‘‘నా బాల్యం చాలా విచిత్రంగా గడిచిపోయింది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకొంటే నన్ను నేనే నమ్మలేనంతగా మారిపోయింది నా శరీరం... జీవితం. చిన్నప్పుడు నేను చాలా బద్దకస్తురాలిని. ఆడుకోవడం, తినడం, టీవీ చూడటం, పడుకోవడం ఇదే నా దినచర్య. నా బాల్యమే కాదు, యుక్తవయసు కూడా అలాగే సాగిపోయింది. ఎంత బద్దకస్తురాలినంటే... కొన్నిసార్లు స్కూల్ నుంచి వచ్చాక యూనిఫామ్ మార్చకుండా పడుకునేదాన్ని. పిజ్జాలు, బిర్యానీలంటే పిచ్చి. బర్గర్లు, నూడుల్స్‌లాంటి ఫాస్ట్ ఫుడ్‌తోనే కడుపు నిండిపోయేది. నన్ను, నా అలవాట్లు చూసి మా అమ్మ ఎంతో ఆందోళన చెందేది. నా బద్దకం ఎలా వదిలించాలో తెలియక బాధ పడేది. అలాంటి నేను ఇవాళ యాభై నాలుగేళ్ల వయసులోనూ ఇంత ఫిట్‌గా, క్రమశిక్షణగా ఉన్నానంటే ఎదుటివారికే కాదు, నాకూ ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఒక సంకల్పంతో నిబద్ధతగా కష్టపడితే అసాధ్యమైన లక్ష్యం ఏదీ ఉండదనేది నా నమ్మకం. ఆ నమ్మకమే నన్ను మీ ముందు ఇలా నిలబెట్టింది.
టామ్‌బాయ్‌లా...
నేను పుట్టింది అమెరికాలో. అక్కడే పాఠశాల విద్యాభ్యాసం పూర్తయింది. తరువాత ముంబయికి వచ్చాం. సెయింట్ జేవియర్ కాలేజీలో చదివాను. నా స్నేహితుల్లో ఎక్కువ మగపిల్లలు ఉండేవారు. దాని కోసమే అమ్మను అడిగాను... కోఎడ్యుకేషన్ కాలేజీలో చేర్చమని. అప్పుడైతే వారితో కలిసి ఆడుకోవచ్చనేది నా ఉద్దేశం. నాకు నచ్చినట్టు జడ వేయడానికి అమ్మకు గంటకు పైగా పట్టేది. ఒక రోజు విసిగిపోయి సెలూన్‌కు తీసుకువెళ్లి నా జుట్టు కట్ చేయించింది. షార్ట్ హెయిర్‌తో అప్పటి నుంచి నా ఆహార్యం కూడా టామ్‌బాయ్‌లా మారిపోయింది. ఇక కళాశాలలో నేను ఆడినవి రెండే ఆటలు. షార్ట్‌పుట్, జావెలిన్ త్రో. మన బలం చూపించుకొనే క్రీడలు కదా అవి. అందుకే వాటిని ఎంచుకున్నా. టీనేజీలో రెబల్‌గా ఉండేదాన్ని. ఎవరైనా ఇది చేయమని చెబితే నాకు అస్సలు నచ్చేది కాదు.
స్నేహితురాలితో వెళ్లి...
నా ఫిట్‌నెస్ ప్రయాణం అనుకోకుండా మొదలైంది. ఒక రోజు నా స్నేహితురాలు మా ఇంటికి వచ్చింది. అప్పటికే తను ఓ అబ్బాయితో ప్రేమలో ఉంది. అందుకే బరువు తగ్గాలని అనుకొంటున్నానని, దాని కోసం జిమ్‌కు వెళ్లాలని, నన్ను తోడు రమ్మని అడిగింది. అప్పుడు నా వయసు పద్ధెనిమిదేళ్లు. స్నేహితురాలు అడగడంతో కాదనలేకపోయాను. కొన్నిసార్లు మన జీవితంపై ఎదుటివారి ఒత్తిడి అనేక విధాలుగా పని చేస్తుంది. అయిష్టంగానే తన వెంట జిమ్‌కు వెళ్లి, నేనూ ఫిట్‌నెస్ క్లాస్‌లో చేరాను. ఏరోబిక్స్ సెషన్‌తో నా ఫిట్‌నెస్ జర్నీ మొదలైంది. డ్యాన్స్ మూమెంట్స్‌లా ఉండే ఆ వ్యాయామాలు నాకు బాగా నచ్చాయి. జిమ్‌కు వెళ్లేవరకు అందరు అమ్మాయిల్లా నేనూ బాగా డ్యాన్స్ చేయగలననే నమ్మకం ఉండేది. ఏరోబిక్స్ మొదలుపెట్టాకే తెలిసింది... నాకు అసలు డ్యాన్స్ రాదని. నా కదలికలు మిగిలినవారికి భిన్నంగా ఉండేవి. అందరూ నన్ను వింతగా చూసేవారు. అది నాకు అవమానంగా అనిపించింది. దాంతో పట్టుదల పెరిగింది. ఒక్కరోజు కూడా మానకుండా జిమ్‌కు వెళ్లాను. ఎంతో శ్రమించాను. బాగా మెరుగయ్యాను.
టీచర్ సలహాతో...
నాలోని పట్టుదల, నైపుణ్యం చూసిన మా ఏరోబిక్స్ టీచర్... అమెరికాలో ఫిట్‌నెస్ కోర్సు చేయమని చెప్పారు. ఆమె సలహాతో ‘అమెరికన్ కాలేజీ ఆఫ్ ఎక్సర్‌సైజ్’లో చేరి, ఫిట్‌నెస్ శిక్షణ తీసుకున్నాను. అలా ఒక ఫిట్‌నెస్ కోర్సులో సర్టిఫికెట్ పొందిన తొలి భారతీయురాలిని నేనే. అదే సమయంలో కిండర్‌గార్డెన్ టీచర్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాను. ముంబయికి తిరిగి వచ్చాక ఫిట్‌నెస్ పాఠాలు మొదలుపెట్టాను. ఉదయం టీచింగ్, సాయంత్రం ఫిట్‌నెస్ క్లాస్‌లు. రోజూ నగరంలో ఈ చివర నుంచి... ఆ చివరకు ప్రయాణం. కొన్ని నెలలు గడిచాయి. ‘ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ స్కూల్’లో ఇంగ్లీష్ టీచర్‌గా ఉద్యోగం వచ్చింది. తరువాత మినాజ్ కరాచీవాలతో పెళ్లయింది. మా అబ్బాయి పుట్టాక ఫిట్‌నెస్ తరగతులు కుదించుకున్నా.
అవహేళన చేసినా...
మా బాబు కాస్త పెరిగే వరకు నా అవసరం ఉంటుంది కదా. దాని కోసం చాలా అవకాశాలు వదులుకున్నా. కుదిరిన సమయంలోనే శిక్షణ ఇచ్చేదాన్ని. అయితే అందరిలా కాకుండా... నాకంటూ ఒక గుర్తింపు కావాలనిపించింది. దాంతో మరింత నైపుణ్యం పెంచుకొనేందుకు పర్సనల్ ట్రైనర్ కోర్సు చేశాను. ఆ సమయంలో నా శరీరాకృతిని చూసి ‘మగరాయుడిలా ఉంది’ అంటూ అవహేళనగా మాట్లాడేవారు. ‘నాకంటూ ఒక రోజు వస్తుంది’ అని వారికి సమాధానం ఇచ్చేదాన్ని. అందుకే సవాలుగా తీసుకుని ముందు నా శరీరాన్ని నాజూగ్గా తయారు చేసుకున్నా. దీన్ని గమనించిన కొందరు తమకు కూడా అలాంటి ఆకృతి కావాలంటూ అడిగారు. తరువాత వారందరూ నా శిష్యులు అయ్యారు.
స్టూడియోకు శ్రీకారం...
ఫిట్‌నెస్ పాఠాల కోసం నా దగ్గరకు వచ్చేవారు క్రమంగా పెరిగారు. దాంతో మా గెస్ట్ రూమ్‌ను ఫిట్‌నెస్ స్టూడియోగా మార్చాను. కొన్నాళ్లకు అది సరిపోక స్టూడియో... లివింగ్ రూమ్‌కు, తరువాత టెర్ర్‌సకు, అక్కడి నుంచి బాంద్రాలోని పెద్ద హాల్‌కు మారింది. ఇంట్లో నేను తరగతులు చెప్పినంతసేపూ మావారు నాకు తోడుగా ఉండేవారు. ఇంకా ఏదో చేయాలన్న తపనతో అమెరికా వెళ్లి పిలెట్స్ ట్రైనింగ్ తీసుకున్నా. తద్వారా భారత్‌లో తొలి బీఏఎ్‌సఐ (బాడీ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఇంటర్నేషనల్) సర్టిఫైడ్ పిలెట్స్ ఇన్‌స్ట్రక్టర్‌ను అయ్యాను.
తారల ట్రైనర్‌గా...
ఇక అప్పటి నుంచి నా జీవితమ అనూహ్య మలుపు తీసుకుంది. బాలీవుడ్ తారల నుంచి పిలుపు వచ్చింది. కత్రినా కైఫ్, దీపికా పదుకొనే, కరీనా కపూర్, అలియాభట్... దాదాపు ప్రముఖ హీరోయిన్లు అందరితో కలిసి పని చేశాను. వారికి వ్యక్తిగత ట్రైనర్‌గా కూడా ఉన్నాను. ‘యాస్మిన్ బాడీ ఇమేజ్’ పేరిట ముంబయిలో అతిపెద్ద పిలెట్స్ స్టూడియో నెలకొల్పాను. దాంతోపాటు నగరంలోనే మరో రెండు, ఢిల్లీ, దుబాయ్, ఢాకాల్లోనూ ఫ్రాంచైజీలు ప్రారంభించాను. రెండున్నర దశాబ్దాలకు పైబడిన నా ఈ ప్రయాణంలో... ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నాను. భారత్‌లో ఫిట్‌నె్‌సను ఒక పరిశ్రమ స్థాయికి తీసుకవెళ్లానని ప్రముఖులు ఎందరో కొనియాడారు. అందుకు ఎంతో గర్వంగా ఉంది.’’
Updated Date - Sep 16 , 2024 | 04:49 AM