Navya : మీరు మంచి తల్లితండ్రులేనా?
ABN, Publish Date - Jul 29 , 2024 | 04:02 AM
తల్లి తండ్రులందరూ తమ పిల్లలు బాగా అభివృద్ధి చెందాలనే కోరుకుంటారు. అయితే వారి వ్యక్తిత్వాల ప్రభావం కూడా పిల్లలపై పడుతుందనే విషయాన్ని మర్చిపోతారు.
Navya : తల్లి తండ్రులందరూ తమ పిల్లలు బాగా అభివృద్ధి చెందాలనే కోరుకుంటారు. అయితే వారి వ్యక్తిత్వాల ప్రభావం కూడా పిల్లలపై పడుతుందనే విషయాన్ని మర్చిపోతారు. స్టాన్‌ఫర్డ్‌కు చెందిన ఎల్‌నేర్ మోకాబే, జాన్ మార్టిన్‌లు తాజాగా రాసిన ఒక వ్యాసంలో తల్లితండ్రులు ఎన్ని రకాలుగా ఉంటారో.. వారి ప్రభావం పిల్లలపై ఎలా పడుతుందో వివరించారు.
పర్మిసివ్ పేరెంట్స్
సాధారణంగా వీరు పిల్లలకు స్నేహితులుగా ఉండాలనుకుంటారు. వీరు పిల్లలతో ఎటువంటి సంఘర్షణ రాకుండా చూసుకుంటూ ఉంటారు. చిన్న తేడా వచ్చినా కలత చెందుతారు. పిల్లలకు ఏం కావాలంటే అవి ఇస్తూ ఉంటారు. వీరిలో కనిపించే లక్షణాలు ఇవే..
పిల్లల పట్ల ఎక్కువ బాధ్యతగా వ్యవహరిస్తూ ఉంటారు. పిల్లలను ఏ విధంగాను డిమాండ్ చేయరు.
వీరు పిల్లలతో స్వేచ్ఛగా మాట్లాడతారు. పిల్లలకు ఏం కావాలో వారే నిర్ణయించుకోవాలని భావిస్తారు.
వీరి పెంపకంలో ఎటువంటి రూల్స్ ఉండవు.
పిల్లలను ఆనందంగా ఉంచటం కోసం ఏ పని చేయటానికైనా వెనకాడరు.
అథారిటేటివ్ పేరెంట్స్
వీరు పిల్లల అవసరాలను గుర్తించి వారికి అండగా నిలబడతారు. నిజాయితీతో.. విలువల ఆధారంగా వీరు పిల్లలతో చర్చలు జరుపుతూ ఉంటారు. ఈ తరహా తల్లితండ్రులు ఉన్న పిల్లలు స్వయం నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఇతరులపై ఆధారపడరు.
లక్షణాలు ఇవే..
పిల్లలు బాధ్యతాయుతంగా ఉండాలనుకుంటారు. ఆ లక్షణాలను డిమాండ్ చేస్తారు.
కచ్చితమైన నియమ నిబంధనలను ఆచరణలో పెడతారు.
పిల్లలతో ప్రతి రోజు మాట్లాడుతూ ఉంటారు. వారి మనసులో మాటలను తెలుసుకోవటానికి ప్రయత్నిస్తారు
పిల్లలు వైఫల్యం చెందితే నిందించరు. అది ఎదిగే ప్రక్రియలో ఒక భాగంగా భావిస్తారు. పిల్లలకు అండగా నిలబడతారు.
నెగ్లెట్‌ఫుల్ పేరెంట్స్
వీరు పిల్లలను అస్సలు పట్టించుకోరు. వారితో ఎక్కువ సమయం గడపరు. వీరు తమ వ్యవహారాలకు ఎక్కువ సమయం కేటాయిస్తూ ఉంటారు. అందువల్ల పిల్లల ఆలోచనలను తెలుసుకోలేకపోతారు.
లక్షణాలు ఇవే..
పిల్లలను పట్టించుకోరు. వారిని ఎక్కువగా డిమాండ్ కూడా చేయరు.
వీరు పట్టించుకోకపోవటం వల్ల పిల్లలు వారంతట వాళ్లే పెరుగుతూ ఉంటారు.
పిల్లలకు ఎటువంటి గైడెన్స్ ఇవ్వరు.
వారే ఆత్మనూన్యతతో బాధపడుతూ ఉంటారు.
అథారిటేరియన్ పేరెంట్స్
వీరు తమ పిల్లలు విపరీతమైన క్రమశిక్షణతో పెరగాలని భావిస్తారు. పిల్లల మాటలను ఏ మాత్రం వినరు. వారి అవసరాలను గుర్తించరు.
లక్షణాలు ఇవే
వీరు పిల్లల నుంచి ఎక్కువ ఆశిస్తారు. ఎక్కువ బాధ్యత తీసుకోరు
పిల్లల మనోభావాలు పట్టించుకోకుండా తమ మాట నెగ్గాలని భావిస్తారు
‘నా మాటే శాసనం.. నేను చెప్పింది వినాల్సిందే’ అని పదే పదే అంటూ ఉంటారు
వీరిలో ఎటువంటి చర్చలు ఉండవు. వారు చెప్పింది చేయాల్సిందే!
స్టైల్ మంచిది?
ప్రతి స్టైల్‌లోను కొన్ని సమస్యలు ఉన్నాయి. కానీ పిల్లల పట్ల బాధ్యతగా ఉంటూ.. వారికి స్వేచ్ఛను ఇవ్వటమే మంచిదని మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. పిల్లల అవసరాలను గమనించి దానికి తగ్గట్టుగా మసలుకుంటే- పిల్లలకు కూడా పరిస్థితుల ఆధారంగా ప్రవర్తించటం వస్తుందని వారు చెబుతున్నారు. ఉదాహరణకు పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు- వారి పట్ల ప్రేమ చూపించి.. అవసరమైతే కొన్ని రూల్స్‌ను బ్రేక్ చేయటం మంచిదంటున్నారు. ఇదే విధంగా పిల్లల భద్రత విషయానికి వచ్చినప్పుడు కచ్చితంగా ఉండాల్సిన అవసరం కూడా ఉందంటున్నారు.
Updated Date - Jul 29 , 2024 | 04:02 AM