ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అది తెలుసుకుంటే... మరేవీ అక్కర్లేదు

ABN, Publish Date - Jun 21 , 2024 | 01:00 AM

సామాజికమైన అంతరాలను నిరసిస్తూ ఒడిశాలో ప్రారంభమైన ఒక ఉద్యమం... అలెఖ్‌ మహిమ ధర్మం.నిరాడంబరమైన, కఠినమైన జీవన విధానాన్ని అనుసరిస్తూ, సర్వసమానత్వాన్ని కాంక్షిచే ఆ సంప్రదాయానికి చెందిన సాధు త్రినాథ్‌ దాస్‌...

అతిథి

సామాజికమైన అంతరాలను నిరసిస్తూ ఒడిశాలో ప్రారంభమైన ఒక ఉద్యమం... అలెఖ్‌ మహిమ ధర్మం.నిరాడంబరమైన, కఠినమైన జీవన విధానాన్ని అనుసరిస్తూ, సర్వసమానత్వాన్ని కాంక్షిచే ఆ సంప్రదాయానికి చెందిన సాధు త్రినాథ్‌ దాస్‌...

‘హిందూస్‌ ఫర్‌ ప్యూరాలిటీ అండ్‌ ఈక్వాలిటీ’ (హెచ్‌పిఇ) సంస్థకు జాతీయ అధ్యక్షునిగా... మత విద్వేషాలు, అసమానతలపై పోరాడుతున్నారు. ఆయన పలు అంశాలపై తన అభిప్రాయాలను ‘నివేదన’తో పంచుకున్నారు...

అలెఖ్‌ మహిమ సంప్రదాయంలోకి ఎలా వచ్చారు?

ఆ సంప్రదాయంలో నేనొక సాధువును. మాది ఒడిశాలోని కలహండి దగ్గర ఒక గ్రామం. నాకు పదేళ్ళ వయసున్నప్పుడే ఇంటి నుంచి బయటకు వచ్చేశాను. నా మాతృభాష ఒరియా. తరువాత హిందీ, తెలుగు లాంటి భాషలు కొద్దికొద్దిగా నేర్చుకున్నాను. నేను అయిదో తరగతి వరకూ చదువుకున్నాను. ఆ వయసులోనే నాకు సాధు మార్గంలో నడవాలనే ఆలోచన కలిగింది. నేను ఏదైనా నేర్చుకున్నానంటే అది మా గురువుల దగ్గరే. ‘ఉన్నది ఒక్కటే... బ్రహ్మమొక్కటే’ అనేది వారి నుంచే తెలుసుకున్నాను.


ఈ సంప్రదాయంలో ప్రధానమైన భావన ఏమిటి?

మేము అన్నింటిలోనూ దేవుణ్ణి దర్శిస్తాం. మాకు విగ్రహారాధనలు లేవు. తిలకాలు దిద్దుకోవడం, పూజలు చేయడం లాంటివి లేవు. ప్రతి ఒక్కరిలోనూ దేవుడున్నాడు. వారు ఎవరనేది మాకు అనవసరం. వారిలో ఉన్న దేవుణ్ణి మేము పూజిస్తాం. అలెఖ్‌ సంప్రదాయంలోని విశేషం అదే. ఈ ప్రపంచంలో మీరు ఏది చేస్తున్నా... అది మీరు ఉపాసన చేస్తున్న దేవుణ్ణే చేరుతుంది.

ఈ సంప్రదాయాన్ని స్థాపించింది ఎవరు?

అలెఖ్‌ పరబ్రహ్మ మహిమా గోస్వామి. అప్పట్లో మతకలహాలు, మత విభేదాలు ఎక్కువగా ఉండేవి. అలెఖ్‌ స్వామి ఎక్కడ పుట్టారో, ఎక్కడ పెరిగారో ఎవరికీ తెలీదు. మత విభేదాలు, కులవిభేదాలు వద్దని ఆయన బోధించారు. అన్ని కులాలవారినీ, మతాలవారినీ కలిపి సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసేవారు. దీన్ని అగ్రకులాలవారు వ్యతిరేకించారు. అలెఖ్‌ స్వామి అనే వ్యక్తి ఎవరో వచ్చి కుల కట్టుబాట్లను నాశనం చేస్తున్నారని ఆ ప్రాంతంలోని రాజుకు ఫిర్యాదు చేశారు. ఆ స్వామిని బంధించాలని రాజు ఆదేశించినా... అది సాధ్యం కాలేదు. అలెఖ్‌ స్వామి ముప్ఫై అయిదు ఏళ్ళు మాత్రమే జీవించారు. తరువాత ఆయన నెలకొల్పిన సంప్రదాయం కొనసాగుతోంది. అది చాలా ప్రాచుర్యం పొందినదే. ఈ సంప్రదాయం ఒడిశాలో, ఆంధ్రప్రదేశ్‌లో, బిహార్‌లో, ఛత్తీస్‌గఢ్‌లో... ఇలా అనేక రాష్ట్రాలలో ఉంది.


దీనికి ఒక స్థిరమైన వ్యవస్థ ఉందా?

‘అలెఖ్‌ మహిమ సమాజ్‌’ అనే వ్యవస్థ ఉంది. దానికి అధ్యక్షుడు ఉంటారు. పదకొండు మంది సభ్యులతో ఒక కమిటీ ఉంటుంది. వారి నేతృత్వంలో అన్నీ క్రమబద్ధంగా నడుస్తాయి. ఇక మాకు ఆదాయ మార్గాలేవీ లేవు. ప్రత్యేకమైన వ్యాపార వ్యవహారాలేవీ లేవు. రాజకీయ ప్రాపకాల ద్వారా ఆదాయాన్ని మేము కోరుకోం. అలెఖ్‌ సంప్రదాయంలో ఉన్న వారితో పాటు ఇతర భక్తులు, దాతలు విరాళాలను ఇస్తారు. వాటి మీదనే మా వ్యవస్థ నడుస్తుంది. మేము ఒక రోజు ఒక ఊర్లో ఉంటాం. మరో రోజు ఇంకో ఊరిలో ఉంటాం. ఈ పూట మీ ఇంట్లో భోజనం చేస్తే... ఇక రెండో పూట మీ ఇంట్లో భోజనం చేయం. మా సంప్రదాయంలో అది ముఖ్యమైన నియమం. ఎందుకంటే... మోహం ఉండకూడదు. గాలి, నీరు అనేవి ఎప్పుడూ ప్రయాణిస్తూనే ఉంటాయి. ఎందుకంటే వాటిని బంధించలేం. మా సంప్రదాయం కూడా అలాంటిదే. మేము ఎవరినీ ద్వేషించం. నిరాడంబరంగా ఉంటాం. ఒకే చోట ఉంటే ఆ ప్రదేశం మీద, వ్యక్తుల మీద ప్రేమ, అభిమానం కలుగుతూ ఉంటాయి. ఏదో ఒక బంధంలో చిక్కుకుంటాం. ఈ బంధం ఎలాంటిదంటే... కాలసర్పంలా కాళ్ళకి చుట్టేస్తుంది.

మీ దినచర్య ఎలా ఉంటుంది?

మేము ఎక్కడ ఉన్నా... సాధువులమైనా, భక్తులమైనా... తెల్లవారుజామున మూడు గంటలకు నిద్ర లేస్తాం. కాలకృత్యాలు తీర్చుకొని, స్నానం చేస్తాం. ప్రార్థనలు చేస్తాం. వాటిలో వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీతల్లోంచి తీసుకున్నవి, మా సంప్రదాయానికి చెందినవీ ఉంటాయి. అనంతరం ధ్యానం, ప్రాణాయామం చేస్తాం. విమల్‌ భాయీ అనే మహాకవి అలెఖ్‌ మహిమ సమాజ్‌కు చెందిన వ్యక్తి. ఆయన ఒరియాలో రాసిన భజనలను మేము గానం చేస్తాం. ఆ తరువాత అల్పాహారంగా భక్తులు ఏది పెడితే అది తీసుకుంటాం. ఉదయం తొమ్మిది... పది గంటల లోపు భోజనం చేసి... మరో ఊరుకు వెళ్ళిపోతాం. ఒక రోజు రాత్రి ఉన్న ఊర్లో... రెండో రాత్రి ఉండం. అదీ ప్రధానంగా మా దినచర్య.


చాలా ప్రాంతాల్లో మీకు ఆశ్రమాలు ఉన్నాయా?

ఉన్నాయి. వాటి నిర్వహణ భక్తులు చూసుకుంటారు. అయితే సాధువులకు ప్రత్యేకంగా ఆశ్రమాలేవీ ఉండవు. మేము ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్ళినప్పుడు... అక్కడ ఆశ్రమం లేకపోతే... జనసమ్మర్ధం లేని ప్రదేశాల్లో... పాఠశాలల్లాంటి వాటిలో రాత్రి బస చేస్తాం. అలెఖ్‌ స్వాములు త్యాగానికి ప్రతిరూపాలు. అత్యున్నత స్థితికి చేరుకున్నవారు కేవలం కౌపీనం (గోచీ) మాత్రమే ధరిస్తారు. మేము కూడా ఆశ్రమాల్లో ఉన్నప్పుడు కౌపీనంతోనే ఉంటాం. సాధు సమ్మేళనాల్లాంటి వాటికి హాజరైనప్పుడు... పరిస్థితులను బట్టి వస్త్రాలు ధరిస్తాం.

కొత్తవారిని చేర్చుకోవడానికి నిబంధనలు ఏవైనా ఉన్నాయా?

ఎవరైనా శిష్యరికం చెయ్యాలంటే... మా జీవన విధానాన్ని వాళ్ళు తెలుసుకోవాలి. మా లక్ష్యాన్నీ, ఉద్దేశాలనూ అర్థం చేసుకోవాలి. ఎవరినీ మేము బలవంతం చెయ్యం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఏదో ఆరాధన చేస్తూనే ఉంటారు. దుర్మార్గాలకు పాల్పడకుండా ఏది చేసినా మేము ఆమోదిస్తాం. చంపడం, దోచుకోవడం, హాని చేయడం లాంటి వాటికి పాల్పడకుండా... మీరు ఏ దేవుణ్ణి ఆరాధించినా, ఏ దేవుణ్ణీ ఆరాధించకపోయినా మాకు అభ్యంతరం లేదు. కానీ అలాంటి పనులు చేస్తే మాత్రం మేము కచ్చితంగా అభ్యంతరం చెబుతాం.


మీరు సాకార ఆరాధన చేస్తారా?

మాకు ఆ పద్ధతి లేదు. అయితే... సాకార ఆరాధన, నిరాకార ఆరాధన అనే అభ్యంతరాలేవీ మాకు లేవు.

మీ శిష్యులు సాకార ఆరాధన చేసినా అభ్యంతరం ఉండదా?

ఈ సంప్రదాయాన్ని ఎవరైతే అనుసరిస్తారో... వారు విగ్రహారాధన చేయరు. అలెఖ్‌ సంప్రదాయాన్ని స్వీకరించిన వారి కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు విగ్రహారాధన చేస్తూ ఉండవచ్చు. వాళ్ళందరినీ మార్చాలనే ఉద్దేశాలు మాకు ఉండవు. ‘ఏకమేవ అద్వితీయం’... ‘ఉన్నది ఒక్కటే’ అనేది తెలుసుకుంటే... ఇవన్నీ అక్కర్లేదు.

గృహస్థ ధర్మం పాటిస్తున్న వారున్నారా...

ఉన్నారు. వారు వివాహం చేసుకుంటారు. రోజువారీ కార్యక్రమాలు చేసుకుంటారు. కానీ మా సంప్రదాయంలోని నియమాలను పాటిస్తారు. గురువు ఏది చేస్తే అదే చేయాలి.

సమాజంలో అసహనం పెరిగిపోతోందని చెబుతున్నారు. ‘హిందూస్‌ ఫర్‌ ప్యూరాలిటీ అండ్‌ ఈక్వాలిటీ’ (హెచ్‌పిఇ) సంస్థకు జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. మరి మీ ధర్మం దీని గురించి ఏం చెబుతోంది?

ఈ ద్వేషాన్నీ, అసహనాన్నీ నిరోధించాలి.. వేల సంవత్సరాల కిందట సింధునదికి ఇవతలివారిని ‘సింధువాసులు’ అని పిలిచేవారు. ‘సింధు’ కాస్తా ‘హిందు’ అయింది. మన ధర్మాన్ని అలా పిలుచుకోవడంలో తప్పులేదు. కానీ అప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడూ అలాగే ఉండాలి. ఎవరు ఏ సంప్రదాయంలో ఉన్నారు, ఏ మతంలో ఉన్నారు అనేది మనకి అవసరం లేదు. అన్ని ప్రాణుల పట్ల గౌరవం ఉండాలి. ప్రకృతి పట్ల మర్యాద ఉండాలి. ప్రకృతి బాగుంటే మనం బాగుంటాం. ఎవరి మీదా కక్ష కానీ, ద్వేషం కానీ లేని దేశం మనది. మతం వేరు, మత విద్వేషం వేరు. మా భావాలకు సన్నిహితంగా, అనుగుణంగా ఉన్న సంస్థలతో కలిసి పోరాటం చేస్తున్నాం. తద్వారా ప్రపంచానికి ఎంతో కొంత మేలు జరుగుతుందనేది మా ఉద్దేశం. ఇప్పటికే ఈ దిశగా పని చేస్తున్నాం. కానీ సంఘటితంగా పని చేస్తే... లక్ష్యాన్ని తొందరగా సాధించగలమని అనుకుంటున్నాం.


చైతన్యం రావాలంటున్నారు, ఎక్కడినుంచి...? ప్రజల నుంచా? ప్రభుత్వాల నుంచా?

ప్రభుత్వాలకూ, దీనికీ సంబంధం లేదు. చైతన్యం ప్రజల్లోనే రావాలి. మీరు రాముడి భక్తుడు, మీ అబ్బాయి కృష్ణ భక్తుడు, మీ భార్య లక్ష్మీదేవి భక్తురాలు అనుకోండి. అలాగని మీరు ఇంట్లో ఘర్షణ పడతారా? కొట్టుకుంటారా? సమాజంలో కూడా అంతే కదా! ఎవరు ఏ మతం పాటిస్తే ఇబ్బంది ఏమిటి? ఎవరు ఎవరిని పూజిస్తే మనకు సమస్యేమిటి?

సమాజంలో మీరు ఎలాంటి మార్పును కోరుకుంటున్నారు?

మనది బహుళత్వంతో... పలు విశ్వాసాలతో కూడిన జీవన విధానం మీరు ఏ సంప్రదాయానికి చెందిన వ్యక్తో నాకు తెలీదు. మీరు ఏ దేవుడికి ఆరాధన చేస్తున్నారో నాకు తెలీదు. మీ పక్కన ఉన్న వ్యక్తి, నేను... మేము ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నామో మీకు తెలీదు. ఇక్కడ మనం వందల, వేల సంవత్సరాలనుంచి కలిసి మెలిసి ఉన్నాం. దీన్ని భంగపరచడానికి సంప్రదాయం ముసుగులో కొందరు దాడులు చేస్తున్నారు. మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. దాన్ని ఆపడానికి మేము ప్రయత్ని స్తున్నాం. మనం ముందు నుంచీ ఇలాగే ఉన్నాం, ఇప్పుడూ అలాగే ఉన్నాం, భవిష్యత్తులోనూ ఇలాగే ఉంటాం. ఇలాగే ఉండాలనేదే నా తపన. జ్ఞాన దృష్టితో చూసినప్పుడు... నువ్వూ ఈశ్వరుడివే, నేనూ ఈశ్వరుణ్ణే. చెట్టు, పుట్ట, గాలి, నీరు... ఇవన్నీ ఈశ్వరుడే. సమస్తం ఈశ్వరుడే. ఇక్కడ ఈశ్వరుడు తప్ప మరేదీ లేదు. మరి ఎవరిని నొప్పిద్దాం? ఎవరిని ద్వేషిద్దాం? ఇతనిది అగ్రకులం, అతనిది నిమ్నకులం, నేను సాధువుని, నువ్వు గృహస్తువి... ఇవన్నీ మనం చూసే దృష్టిలో ఉన్న లోపాలు. దీన్ని దాటి మనం వెళ్ళగలిగితే... ‘ఏకమేవ అద్వితీయం’... ‘ఉన్నది ఒక్కటే. రెండోది ఏది లేదు’ అనేది అర్థం అవుతుంది.

సంభాషణ: కృష్ణశర్మ

Updated Date - Jun 21 , 2024 | 01:01 AM

Advertising
Advertising