ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Navya : ఆమే ఒక 'వరం'

ABN, Publish Date - Jul 15 , 2024 | 06:17 AM

‘‘పెళ్లి తరువాత చాలామంది అమ్మాయిల కెరీర్‌కు ఫుల్‌స్టాప్‌ పడిపోతుంది. కానీ పారిశ్రామికవేత్తగా నా జీవితం మొదలైంది పెళ్లి తరువాతే. అందుకు ప్రధాన కారణం... మావారు సత్యకిరణ్‌ గన్నారపు, ఇతర కుటుంబ సభ్యుల ప్రోత్సాహం.

సాధికారత

  • అందరిలానే ఎన్నో కలలు కన్నారు... డాక్టర్‌ కావాలని!

  • ప్రయత్నం ఫలించలేదు. కానీ నిరాశతో కుంగిపోలేదు.

  • భర్తతో కలిసి సొంత కంపెనీ బాధ్యతలు పంచుకున్నారు.

  • లక్ష రూపాయలతో మొదలైన సంస్థను 28 కోట్ల టర్నోవర్‌కు తీసుకువెళ్లి... కంపెనీకి ఆమే ఒక ‘వర’మయ్యారు.

  • ‘గ్రీన్‌టెక్‌ ఇండియా లిమిటెడ్‌’ డైరెక్టర్‌

  • వరలక్ష్మి గన్నారపు... తన పాతికేళ్ల పారిశ్రామిక

  • ప్రస్థానాన్ని ‘నవ్య’తో పంచుకున్నారు.

‘‘పెళ్లి తరువాత చాలామంది అమ్మాయిల కెరీర్‌కు ఫుల్‌స్టాప్‌ పడిపోతుంది. కానీ పారిశ్రామికవేత్తగా నా జీవితం మొదలైంది పెళ్లి తరువాతే. అందుకు ప్రధాన కారణం... మావారు సత్యకిరణ్‌ గన్నారపు, ఇతర కుటుంబ సభ్యుల ప్రోత్సాహం. 1995లో మావారు ‘గ్రీన్‌టెక్‌’ సౌర విద్యుత్‌ ఉపకరణాల సంస్థను ప్రారంభించారు. అంతకముందు ఆయన సోలార్‌ వాటర్‌ హీటర్లు విక్రయించేవారు. ఈ రంగంలో ఆయనకు ఆసక్తి ఎక్కువ. అందుకే మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చదివిన ఆయన ఇటు వైపు వచ్చారు. 1999లో మా పెళ్లయింది. మూడు నాలుగేళ్ల తరువాత నేను కూడా కంపెనీ కార్యకలాపాల్లో భాగస్వామినయ్యాను. నేను వెళ్లింది మావారికి కాస్త సాయంగా ఉందామని. కానీ నాటి నుంచి పాతికేళ్లుగా కంపెనీతో మమేకమైపోయాను. నేను పుట్టి పెరిగిందంతా కామారెడ్డిలో. అత్తవారిది హైదరాబాద్‌.

గృహిణిగానే ఉండాలనుకోలేదు...

చిన్నప్పటి నుంచి నా లక్ష్యం డాక్టర్‌ కావాలని. మా సోదరుడు ఒకాయన డాక్టర్‌. ఆయన స్ఫూర్తితో మెడిసిన్‌ చదవాలనుకున్నా. అందుకే ఇంటర్‌లో సైన్స్‌ గ్రూప్‌ తీసుకున్నా. మెడిసిన్‌లో సీటు కోసం కష్టపడ్డాను. రాలేదు. అలాగని కుంగిపోలేదు. 1997లో బీజెడ్‌సీ పూర్తయ్యాక డిప్లమా ఇన్‌ ఫార్మసీ చదివాను. రెండేళ్లు మెడికల్‌ ట్రాన్‌స్ర్కిప్షన్‌ ప్రయత్నించాను. ఒక గృహిణిగా మిగిలిపోవాలని ఎన్నడూ అనుకోలేదు. నాకంటూ ఒక కెరీర్‌ను నిర్మించుకోవాలని అనుకున్నా. పెళ్లి తరువాత మా కంపెనీ బాధ్యతలు చేపట్టినా... మధ్యలో ఇన్సూరెన్స్‌ ఏజెంట్‌గా కూడా చేశాను.

మార్కెటింగ్‌ నేనే...

లక్ష రూపాయల పెట్టుబడితో ప్రారంభమైన మా కంపెనీ 2007లో ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీగా మారింది. ఆరంభంలో బెంగళూరు నుంచి వాటర్‌ హీటర్లు తెచ్చి విక్రయించేవాళ్లం. క్రమంగా వాటి తయారీ మొదలుపెట్టాం. ఒక్కో ఉత్పత్తి పెంచుకొంటూపోయాం. ప్రస్తుతం సోలార్‌ ప్యానల్స్‌తో పాటు ఇతర ఉపకరణాలు కూడా తయారు చేస్తున్నాం. దేశవ్యాప్తంగా ఇళ్లు, కంపెనీలు, కమర్షియల్‌ బిల్డింగ్స్‌కు సోలార్‌ పవర్‌ ప్రాజెక్ట్స్‌ చేపడుతున్నాం. చిన్న యూనిట్‌గా ఆరంభమైన మా కంపెనీకి ఇప్పుడు ఢిల్లీ, పుణే, చెన్నైల్లో బ్రాంచీలు ఉన్నాయి. ప్రొడక్షన్‌, ఎరక్షన్‌, కమిషనింగ్‌... ఇదీ మా పని. మా ఫ్యాక్టరీ తూఫ్రాన్‌లో ఉంది. కంపెనీలోకి వచ్చాక మొదట్లో అడ్మినిస్ర్టేషన్‌ చూసుకొనేదాన్ని. కొన్నేళ్ల నుంచి మార్కెటింగ్‌ బాధ్యతలు తీసుకున్నాను.


అంత సులువు కాదు...

ప్రస్తుతం ‘గ్రీన్‌టెక్‌’లో వంద మందికి పైగా పని చేస్తున్నారు. ఫ్యాక్టరీ మొదలు ఇంజనీరింగ్‌, మార్కెటింగ్‌ వరకు అన్నిచోట్లా మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నాం. మా అందరి సమష్టి కృషితో మొన్న ఏప్రిల్‌కు మా కంపెనీ టర్నోవర్‌ 28 కోట్లు దాటింది. దీనికి బ్యాక్‌పగా వేరే కంపెనీలు కూడా పెట్టాం. వాటి కార్యకలాపాలు కూడా నేనే చూసుకొంటున్నాను. సోలార్‌ పవర్‌ ఉత్పత్తులకు సంబంధించి మార్కెటింగ్‌ అంత సులువు కాదు. ఇది ఒక భిన్నమైన రంగం. దానిపై ముందు కస్టమర్లకు అవగాహన కల్పించాలి. ఆపై మా ఉత్పత్తులు, సేవల పట్ల నమ్మకం కలిగించాలి. మార్కెట్‌లో పోటీని తట్టుకోగలిగితేనే నిలబడగలం.

అదే పెద్ద సవాలు...

ఒక మహిళా పారిశ్రామికవేత్తగా నిత్యం ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. ఇంటి పనులు, పిల్లలు, అత్తమామలు... ఇలా రకరకాల బాధ్యతలు. అన్నిటినీ చక్కబెట్టి, బయటకు వెళ్లి కంపెనీ వ్యవహారాలు చూసుకోవాలి. ఒక్కోసారి బంధువులు, సన్నిహితుల ఇళ్లల్లో వేడుకలు జరుగుతుంటాయి. అదే సమయంలో ప్రాజెక్ట్‌ పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు దేనికి ప్రాధాన్యం ఇవ్వాలనేది నిర్ణయించుకోవడం చాలా కష్టం. అన్నిటినీ సమన్వయం చేసుకొంటూ ముందుకు సాగడం పెద్ద సవాలు. అయితే దేన్నయినా సరే సవాలుగా తీసుకొని పని చేయడం నాకు ఇష్టం. కష్టపడే తత్వంతో పాటు మా కుటుంబం, ఆ భగవంతుడి కృపవల్ల అన్నిటినీ సమన్వయం చేసుకోగలుగుతున్నా. ఎప్పుడైనా నిరుత్సాహానికి లోనైనప్పుడు మా గురువు ప్రేమ్‌రావత్‌ బోధనలు వింటాను. వెంటనే మనసు కుదుట పడుతుంది.

ఇవే నా బలం...

కుటుంబం, ఆరోగ్యం... ఇవే నా బలం. 48 ఏళ్ల వయసులోనూ ఇంత చలాకీగా ఉన్నానంటే అందుకు క్రమం తప్పని వ్యాయామం, ఆహార నియమాలే కారణం. మాకు ఒక అబ్బాయి. ఇంజనీరింగ్‌ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. ఇప్పుడు నన్ను చూసి మా అన్నయ్యలు, వదినలు ‘వరలక్ష్మి... నువ్వు ఎంతో సాధించావు’ అంటూ గర్వపడుతున్నారు. నేను కోరుకున్నది ఇలాంటి విజయాన్నే.’’

- హనుమా

Updated Date - Jul 15 , 2024 | 06:17 AM

Advertising
Advertising
<