ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Navya : అరుదైన రాజకుమారి ఏస్రా!

ABN, Publish Date - Sep 15 , 2024 | 05:00 AM

రాజ కుటుంబాలలో మహిళలు ఎక్కువగా చదువుకోరనే అపోహ చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది. కానీ అది వాస్తవం కాదు. విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించి.. తమ కళాదృష్టితో హైదరాబాద్‌ సంస్కృతికి మెరుగులు దిద్దినవారెందరో!

అలనాటి కథ

రాజ కుటుంబాలలో మహిళలు ఎక్కువగా చదువుకోరనే అపోహ చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది. కానీ అది వాస్తవం కాదు. విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించి.. తమ కళాదృష్టితో హైదరాబాద్‌ సంస్కృతికి మెరుగులు దిద్దినవారెందరో! అలాంటి వారిలో నా ప్రియ స్నేహితురాలు ప్రిన్సెస్‌ ఏస్రా ప్రథమ స్థానంలో నిలుస్తుంది.

1940, 50 దశకాలలో ప్రపంచంలోనే అత్యంత ధనిక రాజ్యాలలో హైదరాబాద్‌ ఒకటి. అలాంటి హైదరాబాద్‌ను పరిపాలించే రాజకుటుంబానికి కోడలుగా రావటమంటే సామాన్యమైన విషయం కాదు. అలాంటి సమయంలో- నిజాం మనవడు ప్రిన్సెస్‌ ముఖరం ఝా - టర్కీకి చెందిన రాజకుమారిని పెళ్లి చేసుకుంటున్నాడనే వార్తలు గుప్పుమన్నాయి. చాలా రోజుల పాటు ఆ యువరాణి ఎవరు? ఎలా ఉంటుంది? అందరితో కలివిడిగా ఉంటుందా? లేదా అనే విషయంపై చర్చించుకున్నట్లు గుర్తు.

ఆ రాజకుమారే ఏస్రా. తన పుట్టింది టర్కీలో. 13 ఏళ్ల వయస్సులోనే లండన్‌కు వెళ్లిపోయింది. అక్కడే చదువుకుంది. 18 ఏళ్లకు ఫ్లోరెన్స్‌ విశ్వవిద్యాలయంలో చేరింది. ఆ సమయంలోనే ముఖరం ఝాను కలిసిందని.. వారిద్దరు ప్రేమలో పడ్డారని.. అయితే నిజాంకు ఈ పెళ్లి ఇష్టం లేదని.. జవహర్‌లాల్‌ నెహ్రూ కలగజేసుకున్న తర్వాత నిజాం ఒప్పుకున్నారని చెప్పుకుంటూ ఉండేవాళ్లం. ముఖరం ఝా, ఏస్రాల పెళ్లి లండన్‌లో జరిగింది. నిఖా మాత్రం హైదరాబాద్‌లోనే జరిగింది. ఆ పెళ్లికి కేవలం నిజాం కుటుంబ సభ్యులను మాత్రమే పిలిచారు. నిజాంకు సన్నిహితంగా ఉండే మా కుటుంబాన్ని కూడా పిలిచిన జ్ఞాపకం లేదు. కానీ హైదరాబాద్‌ అంతా మాత్రం సుమారు వారం రోజులు వేర్వేరు ప్రాంతాల్లో వేడుకలు నిర్వహించారు. అన్నదానాలు చేశారు. ప్యాలె్‌సలను అందంగా ముస్తాబు చేశారు. కొత్త దంపతులకు నిజాం హిల్‌ఫోర్ట్‌పై ఉన్న ప్యాలె్‌సను కానుకగా ఇచ్చారు. వారు అక్కడ నివసించటం ప్రారంభించారు.


ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. రాజకుటుంబాలలో రాజకుమారిగా బతకటం అంత సులభం కాదు. అందమైన బట్టలు.. విలువైన నగలతో పాటుగా కుటుంబం భారం కూడా వారిపైనే పడుతుంది. స్వేచ్ఛగా బతకాలనుకొనేవారికి ఈ బంధనాలు ఇబ్బంది పెడతాయి. ఏస్రా విషయంలో కూడా అదే జరిగింది. నిజాం కుటుంబంలో నివసించే వారు కొన్ని మర్యాదలను తప్పనిసరిగా పాటించాలి. నిజాం అనుమతి లేకుండా బయటకు వెళ్లకూడదు. సామాన్య ప్రజలతో మాట్లాడకూడదు. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు- వారికి ఎలాంటి మర్యాదలు చేయాలనే విషయంపై కూడా నిబంధనలు ఉంటాయి. కానీ ఇస్రా వీటిని పట్టించుకోలేదు. తనదైన జీవన విధానంతో హైదరాబాద్‌పై ముద్ర వేసింది.

ఆ సమయంలో నేను ఆల్‌ ఇండియా ఉమెన్స్‌ కాన్ఫరెన్స్‌ (ఏజేయూసీ) కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేదానిని. ఇస్రా ఈ సంస్థకు పేట్రన్‌గా ఉండేది. ఇతర రాజకుటుంబీకులతో కలిపి మా ప్యాలె్‌సలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనేది. బేగం బషీర్‌ యార్‌ జంగ్‌, బేగం ఫజూలిద్దీన్‌ ఖాన్‌, మసూమా బేగం మొదలైన వారు ఈ సమావేశాల్లో పాల్గొనేవారు. ఈ సమావేశాల్లో పాల్గొనే మహిళలందరూ- చీర కొంగను తలపై కప్పుకొనేవారు. ఇస్రా మాత్రం అలాంటి ఆచారాలను పాటించేది కాదు. అందరితో కలిసిపోయేది. ఒక రోజు తను నాకు హఠాత్తుగా ఫోన్‌ చేసి- ‘‘నేను తిరుపతి వెళ్లాలను కుంటున్నాను’’ అంది. నాకు షాక్‌ కొట్టినట్లు అయింది.


నిజాం కుటుంబ సభ్యులు తిరుపతి వెళ్లటమనేది జీర్ణించుకోలేకపోయా. నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ‘‘నువ్వు నమ్మితే వెళ్లు’’ అన్నా. ‘‘వేల మంది దేవుడిని అక్కడికి వెళ్తున్నప్పుడు నేను ఎందుకు వెళ్లకూడదు?’’ అంది. నాకు ముసీకి వరదలు వచ్చిన సమయంలో మహబూబ్‌ ఆలీ పాషా హారతి ఇచ్చిన సందర్భం గుర్తుకు వచ్చింది. తను తిరుపతి వెళ్లి వచ్చిన తర్వాత నన్ను కలిసింది. ‘‘నువ్వు ఒక పెద్ద సాహసం చేశావు’’ అన్నా. తను నవ్వి ఊరుకుంది. తను విపరీతంగా పుస్తకాలు చదువుతుంది. ఈ విషయంలో మా ఇద్దరికీ అనేక పోలికలు ఉన్నాయి. మేమిద్దరం కలిసి పారి్‌సకు హాలిడేకు వెళ్లినప్పుడు- అక్కడకు అనేక పుస్తకాలు తీసుకువచ్చేది. పారిస్‌ నుంచి తిరిగి వచ్చే లోపులో వాటిని పూర్తి చేసేసేవాళ్లం. మేమిద్దరం నూర్‌ మహల్‌ గార్డెన్లో కూర్చుని టీ తాగిన అనేక సందర్భాలు నాకు ఇంకా గుర్తున్నాయి.

ఇక చౌమల్లా ప్యాలెస్‌, ఫలక్‌నామా ప్యాలె్‌సలకు పునర్‌వైభవాన్ని తీసుకురావటంలో ఆమె పాత్ర మరచిపోలేనిది. టాటా గ్రూపునకు ఫలక్‌నామా ప్యాలె్‌సను లీజుకు ఇచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు వారితో కలిసి పనిచేసింది. ఆ ప్యాలెస్‌ ఓపినింగ్‌కు నేను కూడా వెళ్లా. నిజాం ముఖరం ఝా సహా అనేక మంది పాత స్నేహితులను కలిసా. ఈ రోజు ఆ ప్యాలె్‌సలకు ప్రపంచ వ్యాప్తంగా అంత పేరు ప్రఖ్యాతులు రావటంలో ఇస్రా పోషించిన భూమిక అపూర్వమనే చెప్పాలి. ఇప్పుడు కూడా హైదరాబాద్‌కు వచ్చినప్పుడు నన్ను కలుస్తూ ఉంటుంది. మొదటి పరిచయంలో ఎంత ప్రేమను, అభిమానాన్ని చూపించిందో.. ఈ రోజుకు అదే ప్రేమాభిమానాలు చూపిస్తుంది. తన వ్యక్తిత్వం ద్వారా అనేక మందికి స్ఫూర్తిగా నిలిచిన ఇస్రా చాలా అరుదైన రాజకుమారి!

-రాజకుమారి ఇందిరాదేవి ధన్‌రాజ్‌గిర్‌

Updated Date - Sep 15 , 2024 | 05:00 AM

Advertising
Advertising