ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Navya : లడాక్‌లో.. ఒంటరి ప్రయాణం

ABN, Publish Date - Jul 06 , 2024 | 06:45 AM

గడ్డకట్టే చలి, ఇసుక గాలులు, కళ్లు తిరిగే లోయలు... ఇవేవీ ఆమెను వెనక్కి లాగలేదు. బండి జారి కింద పడినా...

గడ్డకట్టే చలి, ఇసుక గాలులు, కళ్లు తిరిగే లోయలు... ఇవేవీ ఆమెను వెనక్కి లాగలేదు. బండి జారి కింద పడినా, ఏమాత్రం తొణకకుండా ప్రయాణాన్ని కొనసాగించి పట్టుదలగా గమ్యం చేరిందామె. ఆమే హైదరాబాద్‌కు చెందిన హారిక మందలపు. తాజాగా లడాక్‌లోని ఉమ్లింగ్‌ లా పాస్‌కు మోటర్‌సైకిల్‌ నడిపిన హారిక ‘నవ్య’తో తన సాహసోపేత ప్రయాణ విశేషాలను ఇలా పంచుకుంది.

ఉమ్లింగ్‌ లా చూడాలన్నది నా కల. అయితే మోటార్‌సైకిల్‌ మీద వెళ్లాలనే ఆలోచన ముందు నుంచీ లేదు. కనీసం కార్‌లో అయినా అక్కడకు వెళ్లి రావాలని అనుకుంటూ ఉండేదాన్ని. లేహ్‌, లడాక్‌ చూడాలనే కోరికతో స్నేహితురాలితో కలిసి శ్రీనగర్‌ వెళ్లాను. అక్కడున్న వారం రోజుల్లో చూడవలసిన పర్యాటక ప్రదేశాన్నీ చూసేశాం. తర్వాత నా స్నేహితురాలు తిరుగు ప్రయాణమైంది.

నేను మాత్రం ఉమ్లింగ్‌ లా చూడాలనే కోరికతో లేహ్‌లోనే ఉండిపోయాను. నాకు మోటర్‌సైకిల్‌ నడపడం వచ్చు. అలాంటప్పుడు ఉమ్లింగ్‌ లాకు, కారులో కాకుండా మోటర్‌సైకిల్‌ మీద ఎందుకు వెళ్లకూడదు? అనే ఆలోచన వచ్చింది. దాంతో మంచి కండిషన్‌లో ఉన్న మోటార్‌సైకిల్‌ కోసం స్థానికంగా ఉన్న రెంటల్‌ ఏజన్సీలను కలిశాను. ఒక చోట కొత్త వెహికల్స్‌ అద్దెకు ఇస్తున్నారు. వాటిలో ఆఫ్‌రోడ్‌ జర్నీకి ఉపయోగపడే, హిమాలయన్‌ను ఎంచుకున్నాను. అయితే ఆ మోటర్‌సైకిల్‌ను నేను అంతకు ముందు నడపలేదు. కాబట్టి అలవాటు పడడం కోసం స్థానికంగానే రెండు, మూడు రోజులు ఆ బండి మీద తిరిగి డ్రైవింగ్‌ మీద పట్టు పెంచుకుని తర్వాతే ఉమ్లింగ్‌ లాకు బయల్దేరాను.


భయం గుప్పిట్లో...

లేహ్‌ నుంచి ఉమ్లింగ్‌ లా 375 కిలోమీటర్లు. కాబట్టి ఎక్కడా ఆగకుండా నేరుగా అక్కడి వరకూ ప్రయాణించడం కష్టం. అందుకే నేను మొదటి మజిలీగా హాన్లేను ఎంచుకున్నాను. అలా గత మే 24న ఉదయం నాలుగున్నరకు బయల్దేరి సాయంత్రానికి హాన్లే చేరుకుని, ఆ మరుసటి రోజు ఉమ్లింగ్‌ లాకు బయల్దేరాను. చలి ఎక్కువగా ఉండడంతో ఉదయం 7 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 12:30కి ఉమ్లింగ్‌ లా చేరుకున్నాను. అక్కడ తట్టుకోలేనంత చలి, పైగా గాలిలో ఆక్సిజన్‌ తక్కువ. దాంతో 15 నిమిషాలు గడిపి, తిరుగు ప్రయాణమయ్యాను. హాన్లే నుంచి ఉమ్లింగ్‌ లా వెళ్లి రావడానికి రెండు రోడ్లు ఉంటాయి. ఒకటి తారు రోడ్డు, ఇంకొకటి ఆఫ్‌ రోడ్‌. వెళ్లేటప్పుడు తారు రోడ్డు మీద వెళ్లినా, వచ్చేటప్పుడు ఆఫ్‌ రోడ్‌ను ఎంచుకున్నాను. నిజం చెప్పాలంటే ఇది నా మొట్టమొదటి రిస్కీ జర్నీ. మనకి మనం ఎంత ధైర్యం చెప్పుకున్నా, ఊహించని ప్రమాదాలు, వాతావరణ పరిస్థితులు మనల్ని భయాందోళనలకు గురి చేస్తూనే ఉంటాయి. ఇలాంటి ప్రయాణాల్లో ఇవన్నీ సహజం.

గుండెలు ఝల్లుమన్నాయి

నాకు ఎత్తైన ప్రదేశాలంటే భయం. ఉమ్లింగ్‌ లా ప్రయాణమంతా ఎత్తుకే సాగుతూ ఉంటుంది. పైగా రోడ్డు అంచునే లోయ, తల పక్కకి తిప్పి చూస్తే, కళ్లు తిరగడం ఖాయం. ఏటవాలుగా బండిని కిందకు దింపేడప్పుడు, మలుపులు తిప్పేటప్పుడు గుండెలు ఝల్లుమంటూ ఉంటాయి. అయినా ధైర్యాన్ని కూడదీసుకుని వీలైనంత నెమ్మదిగా బండిని నడపడం మొదలుపెట్టాను. వీచే గాలులతో పాటు ఇసుక లేచి, రోడ్డు మీద పడిపోతూ ఉంది. అలా ఒక మలుపులో రోడ్డు మీద పడి ఉన్న ఆ ఇసుక వల్ల మోటర్‌సైకిల్‌ స్కిడ్‌ అయి, పడిపోయింది.


దాంతో ఇక నా పని అయిపోయింది అనుకున్నాను. విపరీతంగా భయపడ్డాను. కానీ అదృష్టవశాత్తూ బండికీ, నాకూ ఎలాంటి ప్రమాదం జరగలేదు. మళ్లీ బండి లేపి, ప్రయాణాన్ని కొనసాగించాను. తిరిగొచ్చేటప్పుడు చలికి నా కుడి చేయి మొద్దు బారింది. అప్పుడు బండిని ఆపేసి, నాకు తెలిసిన ఆక్యుపంక్చర్‌ చికిత్సతో సమస్యను సరిదిద్దుకున్నాను. ఇలాంటి అవసరాలకు అక్కరకొస్తుందనే నా జాకెట్‌లో ఆక్యుపంక్చర్‌ కిట్‌ను ఉంచుకున్నాను. ఈ ప్రయాణంలో నాకూ, బండికీ ఇద్దరికీ ఇంధనాన్ని నిల్వ చేసుకున్నాను. ఆ మార్గంలో హోటళ్లూ, పెట్రోల్‌ బంకులూ ఉండవు కాబట్టి రెడీ టు ఈట్‌ ఉప్మా, పోహా లాంటివి ప్యాక్‌ చేసుకున్నాను. బండి కోసం రెండు పది లీటర్ల క్యాన్స్‌లో పెట్రోల్‌ నింపుకున్నాను. బండి అద్దెకిచ్చిన అతనే నాకొక రైడర్స్‌ జాకెట్‌ ఇచ్చాడు. అది చలికి చాలా బాగా ఉపయోగపడింది.

ఉమ్లింగ్‌ లా లాంటి ప్రదేశాలకు మోటర్‌సైకిల్‌ మీద వెళ్లాలంటే ఎంతో ముందుగానే సిద్ధపడాలి. స్వతహాగానే మోటర్‌సైకిళ్లను నడుపుతూ ఉండే నేను వాటి మైనర్‌ రిపేర్ల గురించి ముందుగానే అవగాహన పెంచుకున్నాను. అలాగే బరువైన బండి కింద పడిపోతే దాన్ని సునాయాసంగా లేపగలిగే టెక్నిక్స్‌ నేర్చుకున్నాను. బ్రీదింగ్‌ ఎక్సర్‌సైజెస్‌ సాధన చేశాను.

మాది హైదరాబాదే! కానీ 2013లో నాన్నగారు పోయాక, అమ్మ హిమ, నేనూ బెంగుళూరులో స్థిరపడ్డాం! అమ్మానాన్న, చిన్నప్పటి నుంచీ నన్నెంతో ధైర్యంగా పెంచారు. ఈ ప్రయాణం గురించి చెప్పినప్పుడు మొదట అమ్మ కంగారుపడినా, తర్వాత ప్రోత్సహించింది. హాన్లే నుంచీ ఫోన్‌ సిగ్నల్స్‌ ఉండవు. అప్పటివరకూ అమ్మతో మాట్లాడుతూనే ఉన్నాను. ఇక ముందు విదేశాలకు కూడా రైడింగ్‌, డ్రైవింగ్‌ చేయాలని ఉంది. అలాగే ఆక్యుపంక్చర్‌ను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కూడా ఉంది. ఈ జర్నీలో హాన్లే వెళ్లే దార్లో కనిపించిన నీలం రంగు ఇండస్‌ నది, బౌద్ధారామాలను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను.


లడాక్‌ మహిళల సోలో ట్రావెలింగ్‌కు ఎంతో సురక్షితమైన ప్రదేశం. అక్కడి ప్రజలు మంచివాళ్లు, వినమ్రంగా ఉంటారు. ఆడదాన్ని అనే కారణంగా అక్కడ నేనెలాంటి ఇబ్బందులూ ఎదుర్కోలేదు. మహిళలు బైక్‌ మీద ఉమ్లింగ్‌ లా వెళ్లాలనుకుంటే, స్వీయ శక్తినీ, సామర్థ్యాన్నీ అవసరానికి మించి ఊహించుకోకుండా, వాస్తవికంగా ఆలోచించాలి. గుండెధైర్యం ఉండాలి, కానీ తెగింపు ఉండకూడదు.

- గోగుమళ్ల కవిత

  • గెట్‌ సెట్‌ గో!

  • ఏ మోటర్‌సైకిల్‌?

బిఎస్‌6 హిమాలయన్‌ (441సిసి). ఇది ఆఫ్‌ రోడ్స్‌కు చాలా బాగా పనికొస్తుంది. ఎత్తైన ప్రదేశాలకు తగిన వాహనం.

  • అద్దె ఎంత?

నాన్‌ సీజన్‌లో రోజుకు 1500. సీజన్‌లో రోజుకు 2,500 నుంచి 3,000 ఉంటుంది. నార్త్‌లో జూన్‌ నుంచి సెప్టెంబరు వరకూ వేసవి కాలం. అప్పుడు తాపమానాలు ప్రయాణాలకు అనుకూలం కాబట్టి ఎక్కువ మంది సందర్శిస్తూ ఉంటారు.

  • డ్రైవింగ్‌ గేర్‌ సంగతేంటి?

మోకాళ్లకు నీ ప్యాడ్స్‌, తలకు హెల్మెట్‌, ఒంటికి జాకెట్‌

  • వెంట తీసుకెళ్లిన ఆహారం?

రెడీ టు ఈట్‌ ఉప్మా, పోహ. అక్కడ ఎవర్ని అడిగినా వేడి నీళ్లు ఇస్తారు. డబ్బాలో ఉన్న ఉప్మా, లేదా పోహాలో వేడినీళ్లు పోసి, ఐదు నిమిషాలు మూత పెట్టి ఉంచితే అవి తినడానికి రెడీ అయిపోతాయి.

  • పెట్రోల్‌ నిల్వ చేసుకున్నారా?

బండిలో ట్యాంకు నిండా పెట్రోల్‌ నింపినా, ఎక్కువ దూరం సెకండ్‌ గేర్‌లోనే వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి, మైలేజ్‌ తగ్గిపోతుంది. అందుకని 10 లీటర్ల పెట్రోల్‌ క్యాన్‌లు రెండు కొని, వాటి నిండా పెట్రోల్‌ నింపుకుని వెంట తీసుకెళ్లాను.

  • ఎలా సిద్ధపడాలి?

ప్రాణాయామం సాధన చేయాలి. నడపబోయే వాహనం మీద పట్టు పెంచుకోవాలి. ముందుగానే వెళ్లబోతున్న ప్రాంతం గురించి లోతుగా పరిశోధించుకోవాలి. లగ్జరీ కంటే భద్రతకే ప్రాధాన్యం ఇవ్వాలి. ఊహించని పరిణామాలకు ధైర్యంగాఎదుర్కోగలిగే ఆత్మస్థయిర్యం పెంచుకోవాలి.

Updated Date - Jul 06 , 2024 | 06:45 AM

Advertising
Advertising