ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

NBK: ఇప్పటికీ బాల కృష్ణుడినే!

ABN, Publish Date - Sep 01 , 2024 | 12:53 AM

నా జీవితంలో నేను ఇప్పటికీ స్టూడెంట్‌నే!నేను ఇంకో 50 ఏళ్లు ఉంటా! నా కొడుకు, నా మనవడు నాకు పోటీ అవ్వాలి. ఇది అహంకారం కాదు. ఆత్మవిశ్వాసం.

నా జీవితంలో నేను ఇప్పటికీ స్టూడెంట్‌నే! నేను ఇంకో 50 ఏళ్లు ఉంటా! నా

కొడుకు, నా మనవడు నాకు పోటీ అవ్వాలి. ఇది అహంకారం కాదు.

ఆత్మవిశ్వాసం.

పౌరాణికం, జానపదం, చరిత్రాత్మకం, సాంఘికం...

ఇలా జానర్‌ ఏదైనా బాలకృష్ణకు టైలర్‌మేడ్‌. మంచి పాత్ర పడిందంటే...

అభిమానులకు పండగే. రొమాన్స్‌ నుంచి రౌద్రం వరకూ ఏ రసాన్నైనా

అలవోకగా అభినయించి, మెప్పించడం... ఆయనకే సాధ్యం.

అందుకే... థియేటర్లే కాదు, పబ్‌లు, పార్టీల్లోనూ... ఇతర నటుల సినిమాల్లో సైతం

‘జై బాలయ్య’ అనే అరుపే జనంలో జోష్‌ నింపే తారకమంత్రం.

అయిదు దశాబ్దాల ఆయన నట జీవితాన్ని ప్రేక్షకలోకం వేడుక చేసుకుంటోంది.

తెలుగు చలన చిత్ర పరిశ్రమ నేడు ఘనసత్కారం చేస్తోంది.

ఈ సందర్భంగా యాభయ్యేళ్ళ వెండితెర బాలుడు ‘నవ్య’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ.


  • హీరోగా మీ తొలి సినిమా ‘తాతమ్మ కల’ విడుదలయి 50 ఏళ్లు పూర్తయింది. ఆ సినిమాలో తొలి షాట్‌ మీకు గుర్తుందా?

ఎందుకు గుర్తులేదు... ఇప్పటికీ కళ్ల ముందు కదులుతోంది. అప్పట్లో నాన్నగారి సినిమాల ప్రభావం నాపై చాలా ఉండేది. ఆయన నడిచే తీరు, హావభావాలు నా మనసులో గాఢంగా పడిపోయాయి. ‘తాతమ్మ కల’ సినిమాలో నా మొదటి షాట్‌ భానుమతిగారితో! నేను ఆవిడ మనవడిని. నాకు ఆవిడ తన భర్త పేరు పెట్టుకుంటుంది. అందువల్ల నన్ను పేరుతో పిలవదు. నా మొదటి షాట్‌లో- నేను స్కూలు నుంచి ఇంటికి వస్తాను. ఈ లోపులో భానుమతిగారు- ‘‘ఆయన ఏరీ?’’ అని మిగిలిన వారిని అడుగుతారు.

నాన్నగారు కెమెరా వెనక ఉన్నారు. ‘‘యాక్షన్‌’’ అన్నారు. భానుమతిగారు - ‘‘ఆయన ఏరీ?’’ అన్నారు. నేను ఆవిడ దగ్గరకు నాన్నగారిలా- భుజాలు అటూ ఇటూ కదుపుతూ వెళ్లా. నాన్నగారు వెంటనే ‘‘కట్‌’’ అని అరిచారు. ‘‘గాడిదా... రౌడీలా ఆ నడకేంటి? డీసెంట్‌ ఫెలోలా రా!’’ అన్నారు. ఒక్క నిమిషం నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. మిమ్మల్నే అనుకరించానంటే అక్కడే కొడతారు. ఆ తర్వాత మామూలుగా నడిచాను. షాట్‌ ఓకే అయింది. ఇదీ నా తొలిషాట్‌ అనుభవం.


  • 50 ఏళ్ల నట జీవితం తర్వాత మీలో వచ్చిన మార్పులేమిటి?

మార్పు సహజం. అందరూ అంగీకరించాల్సిందే. నాన్నగారు మాకు చాలా క్రమశిక్షణ నేర్పారు. దానిని ఇప్పటికీ పాటిస్తా. ప్రతి రోజు ఉదయాన్నే మూడున్నరకు లేస్తా. కొన్నిసార్లు రెండున్నరకు కూడా లేస్తూ ఉంటా. లేచి నా ఎక్సైర్‌సైజ్‌లు చేసుకుంటా. పూజ చేసుకుంటా. ప్రపంచమంతా లేవకముందే - ఇవన్నీ కానిచ్చి- షూటింగ్‌ ఉంటే వెళ్లిపోతా. లేకపోతే వేరే పనులలో బిజీ అయిపోతా.

ఒక్కోసారి నా దినచర్యను చూసుకుంటే నా చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తాయి. మేము పెరిగింది హైదరాబాద్‌లో. నాన్నగారు ఎప్పుడూ షూటింగ్‌లలో ఉండేవారు. ఆయన హైదరాబాద్‌కు వచ్చినప్పుడు కూడా చుట్టూ జనం ఉండేవారు. లేకపోతే ఆడిటర్స్‌, ఆర్కిటెక్ట్స్‌- ఇలా అందరూ చుట్టుముట్టేవారు. రాత్రి వచ్చారనుకొనేవాళ్లం. మర్నాడు ఉదయం లేచి చూస్తే- మద్రాసు వెళ్లిపోయేవారు. ఒక విధంగా ఆయన మాకు అపరిచితుడే! సినిమాల్లోనే ఆయనను చూసేవాళ్లం.


  • నిజమైన బాలకృష్ణ ఎవరు అని అడిగితే మీరేం సమాధానం చెబుతారు..?

ప్రపంచానికంతా తెలిసిన బాలకృష్ణే నాకు కూడా తెలుసు. నా పని, నా కుటుంబం, ప్రజా సేవ... ఈ మూడే నాకు తెలుసు. ఆర్టిస్టుగా పనిచేస్తున్నా. ఎమ్మెల్యేగా ప్రజాసేవ చేస్తున్నా. బసవతారకం ఆసుపత్రి ఛైర్మన్‌గా ఆసుపత్రిని ముందుకు తీసుకువెళ్తున్నా. ఈ మూడే తప్ప నాకు వేరే వ్యాపకాలు లేవు. నేను పార్టీలకు వెళ్లను. ఎవరినీ కలవను. కలవాలన్నా ఖాళీ దొరకదు. ఇక వేరే విధంగా చెప్పాలంటే నాలో రెండు కోణాలున్నాయి. సరదాగా చూస్తే- ఇప్పటికీ నేను బాలకృష్ణుడినే! మరో కోణంలో నేను ఒక అగ్నిపర్వతాన్ని. ఎప్పుడూ నాలో నేను మధనపడుతూ ఉంటాను. వరమో, శాపమో నాకు తెలియదు కానీ మొదటినుంచి నాకు ఆత్మాభిమానం చాలా ఎక్కువ.


  • మీకు ప్రథమ కోపం చాలా ఎక్కువ అనే పేరు ఉంది కదా...

నేను కచ్చితంగా ఉంటా. ఇతరుల నుంచి కచ్చితత్వాన్ని కోరుకుంటా. అది లేకపోతే కోపం వస్తుంది. మీకో ఉదాహరణ చెబుతా. నేను వేస్తున్న ఒక పాత్రలో- గుర్రం మీద స్వారీ చెయ్యాలి. ఆ సమయంలో నా భుజం మీద ఒక తుపాకీ ఉంటుంది. నేను స్వారీ చేసే సమయంలో- ఆ తుపాకీ నిటారుగా ఉండకుండా పడిపోతోంది. ఇలా చాలాసార్లు జరిగింది. పనిచేసేవాళ్లు జాగ్రత్తగా, నైపుణ్యంతో పనిచేయాలి కదా. ఇలాంటి సందర్భాలలో నాకు విపరీతమైన కోపం వస్తుంది.

ఇంకో విషయం కూడా చెబుతాను. నన్ను కలవటానికి అనేకమంది వస్తూ ఉంటారు. వారిలో ఎవరు నటిస్తున్నారు? ఎవరు నిజమైన వారు? అనే విషయం నాకు తెలిసిపోతూ ఉంటుంది. నేను పొగడ్తలను దూరంగా ఉంటాను. ఎవరైనా నాతో సంభాషణ మొదలుపెట్టడం కోసం ముందు - ‘‘మేము నాన్నగారి ఫ్యాన్స్‌ అండి’’ అంటారు. నాకు చిర్రెత్తుకొస్తుంది. ‘‘ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ కానీవారు ఎవరో చెప్పండి. చెప్పకపోతే దెబ్బలు పడతాయి...’’ అంటాను. వాళ్లదీ తప్పు కాకపోవచ్చు. కానీ వాళ్లకు సమాధానం ఎలా చెప్పాలి?


  • ఈ 50 ఏళ్ల నట జీవితంలో మీకు ఆదర్శం ఎవరు?

నాన్నగారు. ఆ తర్వాత నన్ను నేనే ఆదర్శంగా తీసుకుంటా. ఈ విషయంలో ఎవరు ఏమనుకున్నా నాకు పర్వాలేదు. ఇక స్ఫూర్తి అంటారా... నాన్నగారి నుంచి క్రమశిక్షణ, పట్టుదలలను స్పూర్తిగా తీసుకుంటా! నాగేశ్వరరావుగారి నుంచి పొగడ్తలకు దూరంగా ఉండటం, భజనపరులను దూరంగా పెట్టడం స్ఫూర్తిగా తీసుకున్నా.


  • సినీ నిర్మాణంలో కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చాయి. వాటిని మనం సమర్థంగా వాడుకుంటున్నామా?

ఈ మధ్యకాలంలో టెక్నాలజీ, టెక్నిక్‌- ఇవన్నీ ఊతపదాలయిపోయాయి. అందరూ మాట్లాడేస్తున్నారు. ఇప్పుడు ఉన్నన్ని ఆధునిక టెక్నాలజీలు లేకపోయినా, సౌకర్యాలు లేకపోయినా మన వాళ్లు గొప్ప సినిమాలు తీశారు. నాన్నగారు తీసిన ‘సీతారామకళ్యాణం’లోని లైటింగ్‌, కెమెరా యాంగిల్స్‌ చూస్తే టెక్నిక్‌ అంటే ఏమిటో మనకు అర్థమవుతుంది. నా ఉద్దేశంలో సినిమాకు భాష, అభినయం- ఈ రెండూ ప్రధానం. ఆ తర్వాతే టెక్నిక్‌ వస్తుంది.

ఇక టెక్నాలజీ విషయానికి వస్తే మనం దాన్ని సరిగ్గా వాడుకోవటం లేదనుకుంటా! ‘భైరవద్వీపం’ సమయంలో మన దేశంలోకి రెండు గ్రాఫిక్‌ కంపెనీలు వచ్చాయి. ఒక గ్రాఫిక్‌ కంపెనీ ఓపెనింగ్‌కు సింగీతం శ్రీనివాసరావుగారిని, నన్ను పిలిచారు. మహాబలిపురం రోడ్డులో ఆ ఓపెనింగ్‌ జరిగింది. అక్కడికి గ్రాఫిక్స్‌కు సంబంధం లేనివారు చాలామంది వచ్చారు. ఆ సమావేశంలో నన్ను కూడా మాట్లాడమన్నారు. ‘‘దీన్ని అంగడిలో వస్తువు చేయకండి. కస్టమైజ్‌ చేయండి. మా అవసరాలు గుర్తించండి. కార్పొరేట్‌ స్థాయి అంటే దెబ్బతింటారు’’ అని చెప్పాను. ఆ తర్వాత అదే జరిగింది. ఇప్పుడు కాలం మారింది. వీధి వీధికి ఒక గ్రాఫిక్‌ స్టూడియో వచ్చేసింది.


  • మీ అబ్బాయి మోక్షజ్ఞ సినిమాల్లోకి రాబోతున్నాడు. తనకు మీరు ఇచ్చే సలహాలేమిటి?

వాడు డిగ్రీ చదువుకున్నాడు. న్యూయార్క్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు వెళ్లాడు. సత్యానంద్‌గారి దగ్గర తర్ఫీదు కూడా తీసుకున్నాడు. ఒక్క సినిమా కూడా రాకుండానే స్టార్‌ అయిపోయాడు. వాడికి నేను మూడు సలహాలిచ్చాను. మొదటిది- ‘‘వారసత్వ భారాన్ని మోయొద్దు. ‘మనదో గొప్ప ఫ్యామిలీ. దాని పేరు నిలబెట్టాలి’ అనుకోవద్దు’’ అని చెప్పాను. రెండోది- ‘‘మమ్మల్ని ఎవరినీ అనుకరించకు’’ అని చెప్పాను. మూడోది- క్రమశిక్షణతో ఉండమని, ఎక్కువ సినిమాలు చేయమని చెప్పాను. నా ఉద్దేశంలో ఆర్టిస్టు ఒక నిత్యావసర వస్తువులాంటివాడు. ఎప్పుడూ కనబడుతూ ఉండాలి. పరిశ్రమను, ప్రొడ్యూసర్‌ను, పంపిణీదారుణ్ణి, ఎగ్జిబిటర్‌ను జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడే ఇండస్ట్రీ బావుంటుంది.

ఇండస్ట్రీ బావుంటే ఎక్కువ మందికి ఉపాధి దొరుకుతుంది. అప్పుడు అందరూ ఆనందంగా ఉంటారు. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. వాడిపై చాలా అంచనాలు ఉన్నాయి. అందువల్ల వాడి సబ్జెక్ట్స్‌ నేనే ఎంపిక చేస్తున్నా. నా కెరీర్‌ విషయంలో నాన్నగారు ఎప్పుడూ పట్టించుకోలేదు. ‘జననీ జన్మభూమి’ సినిమా తప్ప వేరే సినిమాలేవీ చూడలేదు కూడా. కానీ నేను అలా కాదు. అమరశిల్పి జక్కన్న చెక్కినట్లు వాడిని చెక్కుతా!


  • చిన్నప్పటి నుంచే ఆసక్తి...

50 ఏళ్ల సినీ ప్రస్థానంలో 109 సినిమాలు మాత్రమే చేశా. దీనికి కారణం- నాన్నగారు 10 ఏళ్ల పాటు మా బ్యానర్‌లో మాత్రమే చేయమన్నారు. ఇక్కడో విషయం చెప్పాలి. నాన్నగారికి పిల్లలు బాగా చదువుకోవాలని ఉండేది. డిగ్రీ అయితే తప్ప హీరోగా చేయటానికి ఒప్పుకోలేదు. నాకు చదువు మీద ఇంట్రెస్ట్‌ ఉండేది కాదు. ‘కెమెరా ముందుకు ఎప్పుడెప్పుడు వస్తానా?’ అని ఎదురుచూస్తూ ఉండేవాడిని.

  • ఎన్టీఆరే తెలీదు...

‘దానవీరశూరకర్ణ’ సినిమాలో చలపతిరావుగారు నాలుగు వేషాలు వేశారు. నాన్నగారితో ఆయన చాలా సన్నిహితంగా మెలిగేవారు. సత్యన్నారాయణ, చలపతిరావు, రమాప్రభగార్లను నాన్నగారు మాత్రమే ఏకవచనంతో పిలిచేవారు. మూడు వేషాలు అయిపోయిన తర్వాత ఒక రోజు ఆయనను నాన్నగారు ఉదయాన్నే లేపి, వేరే వేషం వేయమన్నారు. చలపతిరావుగారు అలిగారు. ‘‘ప్రజలేమైనా పిచ్చోళ్లు అనుకుంటున్నారా? ఇప్పటికే మూడు వేషాలు వేశాను. ఇంకోటి కూడా నేనే వేస్తే - కొందరు ‘ఎన్టీఆర్‌ లోభి’ అనుకుంటారు. డబ్బు ఖర్చు పెట్టరనుకుంటారు’’ అన్నారు. అప్పుడు నాన్నగారు నవ్వి- ‘‘కొన్ని కొన్ని పల్లెటూళ్లలో ఎన్టీఆర్‌ ఎలా ఉంటాడో తెలీదు. నిన్నెవరు గుర్తుపడతారురా గాడిద! పో... మేకప్‌ వేసుకొని రా!’’ అన్నారు.


  • సిద్ధుడి కథ...

‘...బ్రహ్మంగారి చరిత్ర’ సినిమా క్లైమాక్స్‌ షూట్‌ చేస్తున్నాం. అప్పుడు నాన్నగారు పిలిచి- ‘‘ఒరేయ్‌! ఈ సినిమా అంతా ఒక ఎత్తు. ఈ క్లైమాక్స్‌ ఒక ఎత్తు. నువ్వు దీన్ని పండించగలిగితే సినిమా హిట్‌ అయినట్లే!’’ అన్నారు. ‘నేను ఈ సీన్‌ పండిస్తే హిట్‌ అంటారేమిటి?’ అనుకున్నా. నాకు అర్థం కాలేదు. భయపడుతూ చేశా. షూటింగ్‌ చూడటానికి వచ్చిన వాళ్లందరూ అక్కడ ఉన్నారు. నాన్నగారు సీన్‌ అయిపోయిన వెంటనే- ‘‘నా సినిమా హిట్‌ రా! సీన్‌ బాగా పండించావు.’’ అన్నారు. నేను చేసిన వాటిలో అదో గొప్ప పాత్ర.

  • విందు భోజనంలా...

బాలకృష్ణ సినిమా అంటే విందు భోజనంలా ఉండాలి. అయితే నా కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటా. కొందరు వచ్చి - ‘‘డేట్స్‌ ఇవ్వండి... చాలు’’ అంటారు. వెంటనే ‘గెటౌట్‌’ అంటాను. ‘‘నాకు మంచి కథ ఉంటే చెప్పు. నచ్చితే దాన్ని డెవలప్‌ చేద్దాం. ఎవరెవరు ఉండాలో డిసైడ్‌ చేద్దాం. అదే నా విధానం’’ అని చెబుతా. నాకు అందరూ పుస్తకాలు పంపుతూ ఉంటారు. వాటిని చదువుతాను. ప్రస్తుతం ‘అసురా’ అనే పుస్తకం చదువుతున్నా. చాలా బావుంది. ‘దీన్ని ఒక సినిమాగా కుదించాలా లేక వెబ్‌సిరీ్‌సగా తీస్తే బావుంటుందా?’ అని ఆలోచిస్తున్నా.


  • రెండు తత్వాలు

నా లగ్నం మిధునం. రాశి ధనస్సు. కాబట్టి నాలో వాయుతత్వం, అగ్నితత్వం కలిసి ఉంటాయి. అందుకే ఎప్పుడూ నేను ఎండలోనే ఉంటాను. షూటింగ్‌ సమయంలో మేకప్‌ వేసుకొని బయటకు వస్తే- కారవాన్‌లోకి కూడా వెళ్లను. ‘అఖండ’ సినిమా షూటింగ్‌ విపరీతమైన ఎండలో జరిగేది. అందరూ షాట్‌ అయిన వెంటనే వెళ్లిపోయేవారు. నేను మాత్రం చెప్పులు లేకుండా ఎండలో నిలబడే ఉండేవాడిని. నేను ఎవరినీ సినిమాలు కావాలని అడగను. ఈ మధ్యకాలంలో ఉత్తరాది వారు కూడా కంటెంట్‌ కోసం మనవైపే చూస్తున్నారు. ‘నేలకొండ భగవంత్‌ కేసరి’కి హిందీ డబ్బింగ్‌ నేనే చెప్పాను. దానికి మంచి రెస్సాన్స్‌ వచ్చింది.

  • నా కోసమే వస్తారు...

ప్రేక్షకులు థియేటర్‌కు నా కోసం వచ్చి సినిమాలు చూస్తారు. కాబట్టి సినిమాలో వారికి కావాల్సినవన్నీ ఉండాలి. అందుకే నా సినిమాల్లో ఎక్కువ పాటలు పెట్టమని చెబుతా. నా సినిమాల్లో ఐదు కాదు... ఏడు పాటలు పెట్టినా ప్రేక్షకులు చూస్తారు. ఇది అహంకారం కాదు. ఆత్మవిశ్వాసం.

  • అస్సలు ఫాలో కాను...

నేను సోషల్‌ మీడియాను అస్సలు ఫాలో కాను. వివాదాస్పదమైన కామెంట్స్‌ చేయను. వివాదాలకు దూరంగా ఉంటా. ఇక నన్ను విమర్శించే వారి విషయం అంటారా.. అది వాళ్ల ఖర్మ... అంతే!


  • పెద్దపాప అంటే భయం...

నాకు పెద్ద పాప బ్రాహ్మిణి అంటే భయం! తనది పూర్వాషాడ నక్షత్రం. పోరాడే తత్వం. తనకు ఏదీ తక్కువ లేదు. ‘హెరిటేజ్‌’ సంస్థను చూస్తుంది.. సీఎం కోడలు, మినిస్టర్‌ భార్య, బాలకృష్ణ కూతురు. అయినా ఏదో చేయాలనే తపనతో ఉంటుంది. నా నుంచి వచ్చిన హైపర్‌నెస్‌ కూడా తనలో ఉంది. ఇక చిన్న పాప తేజస్విని బ్యాలెన్సింగ్‌ చేస్తుంది. అన్నీ వింటుంది. అన్నీ పడుతుంది. ‘అన్‌స్టాపబుల్‌’కు పనిచేసింది. ఇప్పుడు నా సినిమాకు కూడా పనిచేస్తోంది. మొన్న తనో సబ్జెక్ట్‌ చెప్పింది. ‘నో’ చెప్పా. ఒకసారి నేను ‘నో’ చెబితే మళ్లీ ప్రస్తావించరు.

  • తను భూదేవి...

నా భార్య వసుంధర నాకు సంబంధించిన ఆర్ధిక వ్యవహారాలన్నీ చూసుకుంటుంది. తన పేరులోనే ‘భూదేవి’ అని ఉంది. ఓర్పు, సహనం చాలా ఎక్కువ. తనపైనే నేను ఎక్కువ ఆధారపడతా. ఇక నాన్నగారి దగ్గర నుంచి ఎలా ఉండాలో నేర్చుకున్నా. ఎలా ఉండకూడదో కూడా నేర్చుకున్నా. ఇక ఒత్తిడి బాగా ఉన్నప్పుడు- పుస్తకాలు చదువుతా. మంచి పాటలు వింటా. నాన్నగారి పాటలు వింటే ఎంత చిరాకైనా పోతుంది.

Updated Date - Sep 01 , 2024 | 09:44 AM

Advertising
Advertising