‘సక్యులెంట్స్’తో సరికొత్తగా...
ABN, Publish Date - Dec 26 , 2024 | 06:31 AM
అందమైన ఆకులతో కనువిందు చేసే మొక్కలే ‘సక్యులెంట్స్’. ఇవి ఎడారి మొక్కలు. దళసరి ఆకులతో సహజసిద్ధ్దంగా ఉంటూ చూడడానికి పగడపు దిబ్బలు, ఆక్టోపస్ లాంటి సముద్ర జీవుల ఆకృతులను పోలి ఉంటాయి. చిన్న కుండీల్లో సైతం చక్కగా...
అందమైన ఆకులతో కనువిందు చేసే మొక్కలే ‘సక్యులెంట్స్’. ఇవి ఎడారి మొక్కలు. దళసరి ఆకులతో సహజసిద్ధ్దంగా ఉంటూ చూడడానికి పగడపు దిబ్బలు, ఆక్టోపస్ లాంటి సముద్ర జీవుల ఆకృతులను పోలి ఉంటాయి. చిన్న కుండీల్లో సైతం చక్కగా పెరుగుతాయి. సంరక్షణ కూడా పెద్దగా అవసరం ఉండదు. ప్రస్తుతం ఇంటి అలంకరణలో ప్రత్యేక స్థానం వీటిదే. కార్యాలయాల్లో కూడా విరివిగానే పెంచుతున్నారు. పలు సందర్భాల్లో ఈ మొక్కలను కానుకగా ఇచ్చి పుచ్చుకుంటున్నారు. ఇంట్లో అందంగా పెరిగే సక్యులెంట్స్ ఇవే...
జేడ్
దీనిని మోహిని మొక్క అని కూడా అంటారు. మందపాటి చిన్న ఆకులతో గుబురుగా పెరుగుతుంది. దీనికి నీరు ఎక్కువగా అవసరం లేదు. కుండీలోని మట్టి పూర్తిగా పొడిగా అయితేనే నీళ్లు పోయాలి. రోజుకి కనీసం నాలుగు గంటలు మొక్కకి ఎండ తగిలేలా చూసుకోవాలి. ఈ మొక్క ఇంటి లోపలి గాలిని శుభ్రం చేస్తుంది. కుండీని గదిలో ఆగ్నేయం మూలలో లేదా తూర్పు వైపున పెట్టుకుంటే అదృష్టం కలిసి వస్తుందనీ ఆర్థిక ప్రయోజనాలు సమకూరుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
ఇకివేరియా
ఈ మొక్క చూడడానికి పెద్ద గులాబీ పువ్వులా ఉంటుంది. చక్కని రంగుల్లో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కొంచెం నీరు పోస్తే చాలు వేగంగా పెరుగుతుంది. ఎండిన ఆకులతో తయారు చేసే ఎరువు దీనికి సరిపోతుంది. వేడిని, చలిని తట్టుకుంటుంది.
సెడమ్
ఈ మొక్క గుబురుగా పైకి పెరుగుతుంది. దీని ఆకులు చిన్నగా మందంగా ఉంటాయి. ఇది ఎండ తగలకపోయినా కూడా చక్కగా పెరుగుతుంది. చిన్న కుండీల్లో ఈ మొక్క అద్భుతంగా కనిపిస్తుంది.
బనానా స్ట్రింగ్
పేరుకు తగ్గట్టు ఈ మొక్క ఆకులు లావుగా పొడవుగా అరటిపండును గుర్తుకు తెస్తాయి. కొద్దిగా నీరు చిలకరిస్తే చాలు. తక్కువ వ్యవధిలోనే కుండీ మొత్తం వ్యాపిస్తాయి. వేలాడదీసిన కుండీల్లో ఈ మొక్క అందంగా పెరుగుతుంది.
పాండా
దీని ఆకులు వెడల్పుగా మందంగా ఉంటాయి. ఆకు మొత్తం ముదురు ఆకుపచ్చ రంగులో ఉన్నప్పటికీ అంచులు మాత్రం ఎర్రని రంగులో ఉంటాయి. చిన్న, పెద్ద ఆకులతో గుబురుగా పెరిగి ప్రత్యేకంగా కపిస్తుంది ఈ మొక్క. ఇంట్లో ఉండే కాంతి దీనికి సరిపోతుంది.
ఎలిఫెంట్ బుష్
ఇది జేడ్ మొక్కలాగే కనిపిస్తుంది కానీ ఆకులు అంత మందంగా ఉండవు. గుండ్రంగా ఉండే చిన్ని ఆకులతో కొమ్మ వేగంగా పెరుగుతూ నలువైపులా పచ్చదనాన్ని వ్యాపింపజేస్తుంది. ఇంటిని మొత్తం ఆక్సిజన్‌తో నింపేస్తుంది. ఇంట్లో ఉండే కాంతి, కొద్దిగా నీరు ఈ మొక్కకు సరిపోతాయి.
పెరల్స్ స్ట్రింగ్
దీని ఆకులు గుండ్రంగా ఉంటూ ఆకుపచ్చని ముత్యాల్లా కనిపిస్తాయి. ఈ మొక్క సన్నని తీగలా పెరుగుతుంది. వేలాడే కుండీల్లో అందంగా కిందికి జాలువారుతూ చక్కని అనుభూతిని కలిగిస్తుంది. ఇంటి ముందు లేదంటే గేటుకి ఇరుపక్కలా కుండీలు అమర్చుకుంటే పరిసరాలు అహ్లాదకరంగా కనిపిస్తాయి.
బుర్రోస్ టైల్
ఈ మొక్క కాండం లావాటి తాడులా ఉంటుంది. ఈ కాండానికి మందమైన ఆకులు కప్పి ఉంటాయి. ఇది చూడడానికి ఆకుపచ్చని బెలూన్ల దండలా కనిపిస్తుంది. ఈ మొక్కకు కొద్దిగా ఎండ అవసరం. లివింగ్ రూమ్ లేదా స్టడీ రూమ్‌లో ఈ మొక్క కుండీని ఏర్పాటు చేసుకుంటే మనసు ఉత్సాహంగా ఉంటుంది.
Updated Date - Dec 26 , 2024 | 06:31 AM