ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Palak Muchal: ఆమె పాట... చిన్నారి గుండెలకు రక్ష

ABN, Publish Date - Nov 04 , 2024 | 05:10 AM

ముంబయిలోని తన ఇంట్లో ఒక గది పలక్‌ ముచ్చల్‌కు ఎంతో ప్రత్యేకం. మ్యూజిక్‌ కాన్సర్ట్‌ కోసం వేరే ఊళ్ళకు వెళ్తే తప్ప... ప్రతి రోజూ ఆ గదిలో కొంతసేపైనా ఆమె గడుపుతారు. ఇంతకీ ఆ గదిలో ఉండేవి... అలమరాల్లో పేర్చిన రకరకాల సైజుల్లోని బొమ్మలు మాత్రమే.

పలక్‌ ముచ్చల్‌ పాట సంగీతాభిమానుల వీనులకు విందే కాదు... చిన్నారి గుండెలకు రక్షా కవచం కూడా! ఏడేళ్ళ వయసులోనే పలక్‌లో చిగురించిన ఔదార్యం ఆమె గాన ప్రతిభతోపాటే ఎదిగింది. మూడువేల మందికి పైగా పిల్లలకు కొత్త జీవితాన్నిచ్చింది.

ముంబయిలోని తన ఇంట్లో ఒక గది పలక్‌ ముచ్చల్‌కు ఎంతో ప్రత్యేకం. మ్యూజిక్‌ కాన్సర్ట్‌ కోసం వేరే ఊళ్ళకు వెళ్తే తప్ప... ప్రతి రోజూ ఆ గదిలో కొంతసేపైనా ఆమె గడుపుతారు. ఇంతకీ ఆ గదిలో ఉండేవి... అలమరాల్లో పేర్చిన రకరకాల సైజుల్లోని బొమ్మలు మాత్రమే. ఇప్పటివరకూ మూడువేల మందికి పైగా నిరుపేద పిల్లలకు ఆమె గుండె ఆపరేషన్లు చేయించారు. అందుకు బదులుగా వారి నుంచి ఒక బొమ్మను మాత్రమే ఆమె తీసుకుంటారు. వాటన్నిటి కోసం ఒక గదిని ఆమె కేటాయించారు. ‘‘ఒక్కొక్క బొమ్మ వెనుకా ఒక్కొక్క గుండె ఉంది. గది నిండా ఎన్నో గుండెల జాలి కథలున్నాయి. అవి నాలో ఉద్వేగాన్ని కలిగించడమే కాదు... ప్రేరణ కలిగిస్తాయి. కర్తవ్యాన్ని బోధిస్తాయి’’ అంటారు పలక్‌. ఆమె సేవా ప్రయాణం ప్రారంభమై సరిగ్గా పాతికేళ్ళయింది.

కార్గిల్‌ అమరుల కుటుంబాల కోసం...

పలక్‌ స్వస్థలం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌. ఆమె తండ్రి రాజ్‌కుమార్‌ ముచ్చల్‌ ప్రైవేట్‌ ఉద్యోగి. తల్లి అమిత సంగీతాభిమాని. ఆ అభిరుచితోనే పలక్‌కు, ఆమె సోదరుడు పలాశ్‌కు సంగీతంలో శిక్షణ ఇప్పించారు. సుప్రసిద్ధ సంగీత దర్శకులు కళ్యాణ్‌జీ-ఆనంద్‌జీ బాల గాయకులను ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసిన ‘‘లిటిల్‌ స్టార్‌’ అనే బృందంలో నాలుగేళ్ళ వయసులో పలక్‌ చేరి, తన ప్రతిభకు మెరుగులు దిద్దుకున్నారు. వివిధ కార్యక్రమాల్లో తన గళాన్ని వినిపించేవారు. కార్గిల్‌ యుద్ధం జరిగినప్పుడు ఆమెకు ఏడేళ్ళు. సైనికుల మరణాల గురించి విని చలించిపోయిన ఆమె... మృత జవాన్ల కుటుంబాలకు సహాయం అందించడానికి... ఇండోర్‌లోని దుకాణాల ముందు నిలబడి... పాటలు పాడారు. దాదాపు పాతిక వేల రూపాయలకు పైగా పోగు చేసి... కేంద్ర ప్రభుత్వానికి పంపారు. అదే ఏడాది ఒడిశా తుపాను బాధితుల కోసం కూడా నిధులు సేకరించారు.


స్థానిక పాఠశాల ఉపాధ్యాయులు ఈ సంగతి తెలుసుకొని.... గుండెకు సంబంధించిన లోపంతో బాధపడుతున్న తమ విద్యార్థి ఆపరేషన్‌ కోసం ఒక ఛారిటీ షో నిర్వహించాల్సిందిగా పలక్‌ను, ఆమె తల్లితండ్రులను కోరారు. ‘‘ఆ విద్యార్థి తండ్రి చెప్పుల వ్యాపారి. ఆపరేషన్‌ చేయించే స్థోమత ఆ కుటుంబానికి లేదు. అందుకే మరో ఆలోచన లేకుండా అంగీకరించాం.నాలుగు రోడ్ల కూడలిలో... తోపుడు బండి మీద నిలబడి పాటలు పాడాను. విరాళాలుగా రూ.51 వేలు వచ్చాయి. ఇది చదివి... బెంగళూరుకు చెందిన కార్డియాలజిస్ట్‌ దేవీ ప్రసాద్‌ శెట్టి ఎలాంటి ఫీజు తీసుకోకుండా ఆపరేషన్‌ చెయ్యడానికి ముందుకు వచ్చారు. ఒక మనిషి ప్రాణాలను కాపాడితే కలిగే సంతృప్తి ఎలా ఉంటుందో అప్పుడే నాకు తెలిసింది’’ అని గుర్తు చేసుకున్నారు పలక్‌.

ఆ తరువాత.. గుండె ఆపరేషన్లు అవసరమైన పేద పిల్లల విరాళాల సేకరణ కోసం పలక్‌ ఎప్పుడైనా పాడడానికి సిద్ధమంటూ పత్రికల్లో ఆమె తల్లితండ్రులు ఒక ప్రకటన ఇచ్చారు. వారం రోజుల్లోనే 33 మంది పిల్లల సర్జరీల కోసం విజ్ఞాపనలు వచ్చాయి. పలక్‌ వరుసగా ప్రోగ్రామ్‌లు చేయడం ప్రారంభించారు. దీనికి పలు ఆసుపత్రులతో పాటు వైద్యులు కూడా ఛార్జీల తగ్గింపుతో, ఫీజుల మినహాయింపుతో తమ వంతు సాయం అందించారు.


  • అది గొప్ప అదృష్టంగా భావిస్తా...

ఒక వైపు ఛారిటీ షోల్లో పాల్గొంటూనే మరో వైపు చదువును, సంగీత సాధనను పలక్‌ కొనసాగించారు. 2001లో... ‘ఛైల్డ్‌ ఫర్‌ ఛిల్డ్రన్‌’ పేరిట తొలి మ్యూజిక్‌ ఆల్బమ్‌ విడుదల చేశారు. ‘‘ఆ తరువాత పదేళ్ళలో మరో అయిదు ఆల్బమ్స్‌ చేశాను. సినీ పరిశ్రమలో గాయనిగా పేరు తెచ్చుకోవాలనేది నా కల. దానికోసం ఇండోర్‌ నుంచి ముంబయికి మా కుటుంబం వచ్చేసింది. 2011లో... హిమేష్‌ రేష్మియా సంగీత దర్శకత్వంలో ‘డమాడమ్‌’ సినిమా టైటిల్‌ సాంగ్‌ పాడే అవకాశం వచ్చింది. ఆ తరువాత ‘ఆషికీ 2’, ‘ఏక్తా టైగర్‌’, ‘ప్రేమ్‌ రతన్‌ ధన్‌పాయో’, ‘కిక్‌’ తదితర చిత్రాల్లో వరుసగా అవకాశాలు వచ్చాయి. ముఖ్యంగా ఎంఎస్‌ ధోనీ: ది అన్‌టోల్డ్‌ స్టోరీ’లో ‘కౌన్‌ తుఝే’ పాట నాకు ప్రేక్షకుల నుంచి, సినీ రంగం నుంచి గొప్ప ప్రశంసల్ని తెచ్చిపెట్టింది’’ అంటున్న పలక్‌ హిందీతోపాటు తెలుగు, బెంగాలీ, భోజ్‌పురి, ఉర్దూ, గుజరాతీ, పంజాబీ, మరాఠీ, తమిళ్‌, కన్నడ తదితర భాషల్లో తన గళాన్ని వినిపించి మెప్పించారు. అలాగే మ్యూజిక్‌ కాన్సర్ట్స్‌లో పాల్గొని... వాటి ద్వారా వచ్చే డబ్బును... ‘పలక్‌ ముచ్చల్‌ ఫౌండేషన్‌’ తరఫున ‘సేవింగ్‌ లిటిల్‌ హార్ట్స్‌ ప్రాజెక్ట్‌ ద్వారా... పేద పిల్లల గుండె ఆపరేషన్లకు ఖర్చు చేస్తున్నారు.

‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’, ‘లిమ్కా బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్ట్స్‌’ లో చోటు సంపాదించుకున్న ఆమె కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రీయ బాల పురస్కార్‌, ఆమెరికన్‌ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌తో సహా సినీ, సామాజిక రంగాల్లో చేసిన సేవలకు ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. ఆమె కథను మహారాష్ట్ర ప్రభుత్వం ఏడో తరగతి మోరల్‌ సైన్స్‌లో పాఠంగా చేర్చింది. అది గొప్ప అదృష్టంగా భావిస్తానంటారు పలక్‌. ‘‘ఇప్పటికి మూడు వేలకు పైగా సర్జరీలు పూర్తయ్యాయి. అదృష్టవశాత్తూ నా పాటలకు ప్రాచుర్యం ఉంది.


నా సంగీత కార్యక్రమాలకు ఆదరణ కూడా బాగానే ఉంది. వాటి ద్వారా వచ్చే ప్రతి పైసా దానికోసమే ఖర్చు చేస్తున్నాను. ఇప్పుడు ఒక కాన్సర్ట్‌ చేస్తే వచ్చే డబ్బుతో 13-14 సర్జరీలకు సాయం చేయగలుగుతున్నాను. రెండేళ్ళ క్రితం సంగీత దర్శకుడు మిధున్‌తో నాకు వివాహమయింది. ఆయన కూడా నన్ను ఎంతో సపోర్ట్‌ చేస్తున్నారు. నా ద్వారా సాయం పొందిన కుటుంబాలన్నీ నావిగానే భావిస్తాను. వారి నుంచి నేను తీసుకొనేది... వారి జ్ఞాపకంగా ఒక్క బొమ్మ మాత్రమే. సర్జరీల కోసం నా సాయం కోరిన వారి జాబితాలో మరో 400 మందికి పైగా ఉన్నారు. ఇప్పుడు వారందరి బాధ్యత నా మీద ఉంది. ఇలాగే... జీవితాంతం ఈ కార్యక్రమాన్ని కొనసాగించే శక్తి నాకు ఇవ్వాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను’’ అంటున్నారు పలక్‌.

Updated Date - Nov 04 , 2024 | 05:12 AM