ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Treatment Relieves : ఉబ్బసం నుంచి ఉపశమనం

ABN, Publish Date - Oct 08 , 2024 | 05:10 AM

నాలుగడుగులు వేస్తే ఆయాసం. ఊపిరి సలపని దగ్గు. ఛాతీలో చెప్పలేనంత అసౌకర్యం... ఇలా ఉబ్బసం రోగుల బాధలకు అంతంటూ ఉండదు. మరీ ముఖ్యంగా చలి కాలం ప్రారంభంలో ఈ రుగ్మత తీవ్రత పెరుగుతూ ఉంటుంది

లంగ్‌ కేర్‌

నాలుగడుగులు వేస్తే ఆయాసం. ఊపిరి సలపని దగ్గు. ఛాతీలో చెప్పలేనంత అసౌకర్యం... ఇలా ఉబ్బసం రోగుల బాధలకు అంతంటూ ఉండదు. మరీ ముఖ్యంగా చలి కాలం ప్రారంభంలో ఈ రుగ్మత తీవ్రత పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పటినుంచే ఉబ్బసం నుంచి ఉపశమనాన్ని అందించే సమర్థమైన చికిత్సను అనుసరించడం మొదలుపెట్టాలి.

బ్బసం వ్యాధి, చికిత్స చుట్టూరా పరుచుకున్న అపోహల వల్ల వ్యాధి నియంత్రణ క్లిష్టంగా మారుతోంది. సమర్ధమైన చికిత్స అందుబాటులో ఉన్నా, వ్యాధిని అదుపులో ఉంచే ముందు జాగ్రత్త చర్యల మీద అవగాహన లేకపోవడం వల్ల ఉబ్బసం గురించి బెంబేలు పడిపోయే పరిస్థితి అంతటా నెలకొని ఉంది. దగ్గుని దగ్గుగానే చూడడం, తగ్గకపోతే యాంటీబయాటిక్స్‌ వాడేయడం, అంతిమంగా వైద్యుల్ని కలవడం, కలిసినా వాళ్లు సూచించే మందుల్ని సక్రమంగా వాడకపోవడం, ఉబ్బసాన్ని ప్రేరేపించే కారకాలను నిర్లక్ష్యం చేయడం... ఇలా ఈ వ్యాఽధిని స్వయానా పెంచుకుంటున్నాం! కానీ మధుమేహం లాంటి అన్ని దీర్ఘకాలిక వ్యాధుల్లాగే ఉబ్బసాన్ని కూడా నియంత్రణలో ఉంచుకోవచ్చు.


  • కారణాలు అనేకం!

ఉబ్బసం ఎవరికైనా, ఎప్పుడైనా రావొచ్చు! సాధారణ అలర్జీ కూడా దీర్ఘకాలంలో ఉబ్బసానికి దారి తీయొచ్చు. వంశపారంపర్యంగా కూడా సంక్రమించవచ్చు. కాలుష్యం, ఫుడ్‌ అలర్జీ, డస్ట్‌ అలర్జీలు కూడా ఉబ్బసంగా మారొచ్చు. కొందరు పుట్టుకతోనే వెంటబెట్టుకుని రావొచ్చు. మరి కొందరికి బాల్యంలో తలెత్తవచ్చు. మరికొందరికి టీనేజీలో మొదలవ్వొచ్చు. కాబట్టి ఎప్పుడు, ఏ కారణంగా వచ్చిందనే దాని ఆధారంగా తగిన చికిత్సతో వ్యాధిని మచ్చిక చేసుకోగలిగితే నాణ్యమైన జీవితాన్ని గడపవచ్చు.

  • ఉబ్బసం అంటే?

ఆయాసం, పిల్లి కూతలు, దగ్గు, తెమడ పడడం, పడకపోవడం, చిక్కని జిగురులాంటి కళెల, అది శ్వాసనాళాన్ని పోలిన ఆకారంలో ఉండడం... ఉబ్బసం ప్రధాన లక్షణాలు. ఉబ్బస కారక అలర్జెన్స్‌ ఊపిరి ద్వారా శ్వాసనాళాల్లోకి ప్రవేశించి అక్కడ అతుక్కుపోయి, వాపును కలగజేస్తాయి. దాంతో ఆ ప్రదేశం ఇరుకుగా మారి శ్వాస బలవంతంగా తీసుకోవలసివస్తుంది.


  • పొంచి ఉండే ముప్పులు

ఉబ్బసం తిరగబెట్టడానికి కారణం కొన్ని ఆహార పదార్థాలే అనుకుంటూ ఉంటారు. దాంతో జామ పళ్లు, వంకాయ... ఇలాంటి కొన్నిటికి చాలా దూరంగా ఉంటూ ఉంటారు. కానీ ఇది అందరికీ వర్తించదు. కొందరికి కొన్ని పదార్థాలు తినటం వల్ల ఉబ్బసం లక్షణాలు పెరగడం నిజమే అయినా, అందరికీ అలాగే ఉండాలని లేదు. దానికి మించిన ఉబ్బసం ప్రేరకాలు ఇంట్లో బయటా ఎన్నో ఉంటాయి. అవేంటంటే...

  • డస్ట్‌ అలర్జీ: కంటికి కనిపించని డస్ట్‌ మైట్స్‌ మన ఇల్లంతా వ్యాపించి ఉంటాయి. దుప్పట్లు, దిండ్లు, రగ్గులు, మ్యాట్లు, సోఫాలు, కార్పెట్లు, పెంపుడు జంతువుల బొచ్చు... వీటన్నిట్లో ఉంటాయి. కాబట్టి వీటి నుంచి డస్ట్‌ మైట్స్‌ ఊపిరి ద్వారా శ్వాసనాళాల్లోకి చేరుకోకుండా చూసుకోవాలి. ఇందుకోసం...

  1. ఇల్లు ఊడ్వకుండా తడి బట్టతో తుడవడం అలవాటు చేసుకోవాలి.

  2. పెంపుడు జంతువులను పెంచకపోవడమే మేలు.

  3. దుప్పట్లు, దిండు కవర్లను ప్రతి రెండు రోజులకోసారి ఉతుకుతూ ఉండాలి.

  4. ఎక్కువ వాసన కలిగి ఉండే పర్‌ఫ్యూమ్స్‌, పౌడర్లు వాడకూడదు.

  5. కార్పెట్లు వాడకూడదు.

  6. బాత్రూమ్‌లో మౌల్డ్‌ లేకుండా చూసుకోవాలి.

  7. ఇంట్లో ఎక్కడా తేమ ఉండకూడదు.

  8. కాలుష్యం ముప్పు

  9. కాలుష్యం ఉబ్బసం వచ్చే వీలు లేని వారికీ వచ్చేలా చేస్తుంది. పదే పదే కాలుష్యానికి గురైనా కొందరికి ఉబ్బసం రావొచ్చు. వాతావరణంలో కలిసిన వాహనాల పొగ పీల్చుకోకూడదు. ఇందుకోసం..

  10. మందంగా ఉండే స్కార్ఫ్‌లు వాడాలి.

  11. సర్జికల్‌ మాస్క్‌లకు బదులుగా సూక్ష్మమైన ధూళిని వడగట్టే ఎన్‌95 మాస్క్‌లు వాడాలి. వీలైతే రెస్పిరేటర్స్‌ వాడాలి.


  • అలర్జీలను పసిగట్టాలి!

డస్ట్‌ అలర్జీతోపాటు కొందరికి కొన్ని రకాల ఫుడ్‌ అలర్జీలు ఉంటాయి. ఇంకొందరికి ఘాటైన వాసనలు పడవు. వీటి వల్ల మొదలయ్యే దగ్గు, జలుబు, ఆయాసం, పిల్లి కూతలు ఉబ్బసాన్నే పోలి ఉంటాయి. మందులతో తగ్గినా ఇదే స్థితి పదే పదే తిరగబెడుతూ ఉంటే క్రమేపీ ఉబ్బసంగా పరిణమిస్తుంది. కాబట్టి దేని వల్ల ఉబ్బసం తాలూకు లక్షణాలు మొదలవుతున్నాయో జాగ్రత్తగా గమనించి వాటికి దూరంగా ఉండాలి. ఇలా అలర్జీ కారణంగా తలెత్తే ఉబ్బసానికి యాంటీ ఐజిఈ అనే మందుతో చికిత్స చేయవచ్చు. అలర్జీ ఉన్నవాళ్లలో పెరిగిపోయే ఐజీఈ అనే యాంటీబాడీకి విరుగుడుగా ఈ మందు ఇవ్వడం ద్వారా అలర్జీ, దాని తాలూకు ఉబ్బసం రాకుండా ఉంటాయి.

  • ట్రిగ్గర్‌ కావచ్చు!

కొందరికి ఐదు నిమిషాల ముందు వరకూ లేని ఆయాసం హఠాత్తుగా మొదలవుతుంది. భయపడినా, విపరీతమైన ఒత్తిడి, శారీరక శ్రమకు లోనైనా క్షణాల్లో ఉబ్బసం లక్షణాలు కనిపించి ఊపిరి ఆడనివ్వకుండా చేసేస్తాయి. ఇలాంటివాళ్లు ఇన్‌హెలర్స్‌ ఎప్పుడూ దగ్గర పెట్టుకోవాలి. క్రీడాకారులైతే ఆటకు ముందు వీటిని వాడితే, ఉబ్బసం వేధించకుండా ఉంటుంది.


  • అప్రమత్తత ముఖ్యం!

ఉబ్బసం అని నిర్ధారణ జరిగేదాకా ఆగకుండా లక్షణాలు మొదటిసారి కనిపించిన వెంటనే వైద్యులను కలిస్తే వ్యాధి ముదరకుండా నియంత్రించే వీలుంటుంది. ఇందుకోసం దగ్గు, జలుబు మూడు వారాలకు మించి వేధిస్తుంటే తప్పనిసరిగా పల్మనాలజిస్టు చేత పరీక్షలు చేయించుకోవాలి. సాధారణ దగ్గు, జలుబు అయినా సొంత వైద్యం చేసుకోకూడదు. అది వైరస్‌ కారణంగా వచ్చిందా? లేక అలర్జెన్స్‌ కారణంగా వచ్చిందా? అనేది నిర్ధారించుకోవాలి.

ఇందుకోసం వైద్యులను సంప్రదించాలి. ఉబ్బస లక్షణాలను పెంచే అలర్జెన్స్‌ను గుర్తించి వాటికి దూరంగా ఉండాలి. అవసరమైతే ఇన్‌హెలర్స్‌ వాడడానికి సంకోచించకూడదు. శ్వాసనాళాల వాపును తగ్గించే స్టిరాయిడ్స్‌నూ అవసరమైతే వాడక తప్పదు. అన్నిటికంటే ముఖ్యంగా ఉబ్బసాన్ని తీవ్రమైన వ్యాధిలా కాకుండా ఓ అసౌకర్యంగా భావించి, సమయానికి చికిత్స తీసుకోగలిగితే నాణ్యమైన జీవితాన్ని గడపవచ్చు.


  • ఇన్‌హేలర్స్‌ సురక్షితం

ఉబ్బసానికి ఉత్తమమైన చికిత్స నెబ్యులైజర్స్‌, ఇన్‌హెలర్స్‌, స్టిరాయిడ్స్‌. చాలామంది వీటిని వాడడానికి ఇష్టపడరు. వైద్యులు ఇన్‌హెలర్స్‌ సూచించినప్పుడు ‘మాకంత ఉబ్బసం లేదండీ!’ అంటూ వేరే మందులను సూచించమని వైద్యులను ఒత్తిడి చేస్తారు. కానీ ఉబ్బసానికి ఇన్‌హెలర్స్‌ సురక్షితమైన చికిత్స. తీవ్రతను బట్టి కొందరికి స్టిరాయిడ్స్‌ కూడా అవసరం పడొచ్చు. ఈ రెండూ ఇతరత్రా దుష్ప్రభావాలు కలిగించకుండా నేరుగా ఊపిరితిత్తుల మీదే పనిచేస్తాయి.

  • సిగరెట్లతో ‘సీవోపిడి’

క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజ్‌.... ఇది ధూమపానం చేసేవారికి వస్తుంది. ఇదీ ఉబ్బసమే! అవే లక్షణాలు ఉంటాయి. అయితే ఉబ్బసంలాగా దీన్ని సరిదిద్దలేం! ఒకసారి సీవోపీడి అని నిర్ధారణ అయితే చికిత్సతో లక్షణాలను అదుపు చేయవచ్చుగానీ, వ్యాధిని అదుపు చేయలేం! ఆస్తమాలో ఈసినోఫిల్స్‌ వల్ల శ్వాసనాళాల్లో వాపు మొదలైతే, ఈ వ్యాధిలో న్యూట్రోఫిల్స్‌ వల్ల సమస్య మొదలవుతుంది. ఇది తీవ్ర రూపం దాలిస్తే, ఊపిరితిత్తులు బెలూన్‌లా ఉబ్బిపోతాయి. శ్వాసనాళాలు శాశ్వతంగా గట్టిపడిపోయి సాగే గుణం కోల్పోతాయి.

Updated Date - Oct 08 , 2024 | 05:10 AM