Punjabi singer Dilveer : 5 గంటల్లోనే ‘భైరవ ఏంథమ్’ పూర్తైపోయింది
ABN, Publish Date - Jun 23 , 2024 | 01:21 AM
‘కల్కి’- ప్రస్తుతం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా. దీని నుంచి తాజాగా విడుదలయిన - ‘‘భైరవ ఏంథమ్’’ దేశవ్యాప్తంగా దుమ్మురేపుతోంది. ప్రముఖ పంజాబీ గాయకుడు దిల్‌వీర్,
‘కల్కి’- ప్రస్తుతం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా. దీని నుంచి తాజాగా విడుదలయిన - ‘‘భైరవ ఏంథమ్’’ దేశవ్యాప్తంగా దుమ్మురేపుతోంది. ప్రముఖ పంజాబీ గాయకుడు దిల్‌వీర్, హీరో ప్రభాస్ నటించిన ఈ గీతానికి పోని ప్రకాష్‌రాజ్ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించారు. పంజాబీ గెటప్‌లో ప్రభాస్ కనిపించిన ఈ గీతపు కొరియోగ్రఫీ విశేషాలను పోనీ - ‘నవ్య’తో పంచుకున్నారు.
‘‘ఈ పాట చేసినందుకు చాలా సంతృప్తిగా ఉంది. దాదాపు ఎనిమిదేళ్ల నుంచి నేను ఎక్కువగా ప్రాజెక్టులు చేయటం లేదు. అలాంటి నాకు‘కల్కి’లో ఈ పాటకు కొరియోగ్రఫీ చేసే అవకాశం రావటం ఒక అదృష్టమనే చెప్పాలి. ప్రస్తుతం ఈ పాట దేశవ్యాప్తంగా విశేష ఆదరణ లభిస్తోంది. ప్రతి కొరియోగ్రాఫర్ ఇలాంటి పాట కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ‘కల్కి’ కోసం ఒక చిన్న సాయం చేసిపెట్టమని నిర్మాత స్వప్న అడిగింది. సెట్స్‌కు వెళ్లాను. అదంతా వేరే ప్రపంచంలా అనిపించింది. ‘‘ఇలాంటి చిన్న పనుల కోసం నన్ను పిలవకు.. పెద్ద పని కోసం పిలువు’’ అని స్వప్నతో సరదాగా అన్నాను. అంతకుముందు ఆమెతో ‘అన్నీ మంచి శకునములే...’ కూడా పనిచేశాను. ఒక రోజు స్వప్న హఠాత్తుగా ఫోన్ చేసి ‘‘ప్రభాస్‌తో ఒక సాంగ్ ఉంది.. చేస్తావా?’’ అని అడిగింది. నాకు ఒక క్షణం ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. నేను హైదరాబాద్‌లో స్థిరపడిన పంజాబీని. పంజాబీ నృత్యం స్వాభావికంగా నాలో ఉంటుంది. ఇక ప్రభాస్- మన దేశంలోనే అతి పెద్ద స్టార్. ఈ రెండింటినీ ఒక చోట కలిపే అవకాశం రావటం చాలా అరుదైన విషయం. ముందు నేను నమ్మలేదు. చాలా హడావిడిగా అన్నీ జరిగిపోయాయి.
కళ్ల ముందు ప్రభాస్!
నేను మొదటిసారి ఆ పాట విన్నప్పుడు- ప్రభాస్ నాకు పూర్తి స్థాయి పంజాబీ డ్రెస్‌లో కళ్ల ముందు కనిపించాడు. ‘ఇంత అందంగా ఉన్నాడేంటి?’ అనుకున్నా. నేను ఈ విషయం అందరికీ చెప్పినప్పుడు అందరు నమ్మలేని నిజాన్ని చూసినట్లు అనిపించారు. దిల్‌జిత్ ఉత్తరాది రాష్ట్రాలకు, పంజాబీ సంస్కృతికి ప్రతీక. ఇక ప్రభాస్ దక్షిణ భారతదేశానికి ప్రతీక. వీరిద్దరూ కలిస్తే- ఆ ఆలోచనే అందరితోను ఉత్సుకత రేకెత్తించింది. నేను ఈ విషయం ప్రభాస్‌కు చెప్పినప్పుడు ముందు అంత ఆసక్తి చూపించలేదు. ‘‘నన్ను నమ్మండి. ఒక్క ఛాన్స్ ఇవ్వండి. రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు’’ అని ప్రభాస్‌తో చెప్పా. ‘‘ఆర్ యూ ష్యూర్’?’ అన్నారు. అనుకున్నట్లే- ప్రభాస్ సెట్ మీదకు పూర్తి పంజాబీ దుస్తులతో వచ్చినప్పుడు- సెట్‌లో ఉన్నవారందరూ చప్పట్లు కొట్టి, గట్టిగా అరవటం మొదలుపెట్టారు. వారి రెస్పాన్స్‌ను చూసి నాకే మతిపోయింది. దిల్‌జిత్, ప్రభాస్‌లకు నేను కొరియోగ్రాఫర్‌గా ‘వన్, టూ, త్రీ’ అంటూ కౌంటింగ్ ఇవ్వాలి. కానీ వారిద్దరిని చూస్తూ నేను కౌంటింగ్ ఇవ్వటం కూడా మరచిపోయాను. సెట్‌లో విపరీతమైన ఎనర్జీ వచ్చేసింది. నేను ‘డర్టీ పిక్చర్‌లో... విద్యాబాలన్‌తో ‘ఊలాల.. ఊలాల...’ పాటకు కొరియోగ్రఫీ చేస్తున్నప్పుడు ఇలాంటి ఉత్సుకత వచ్చింది. ఇంతకాలం తర్వాత మళ్లీ ఈ పాటకు వచ్చింది.
స్టెప్స్ తక్కువే!
దిల్‌జిత్‌కు, ప్రభాస్‌కు ఈ పాటలో కష్టమైన స్టెప్స్ పెట్టలేదు. దిల్‌జిత్ పెర్‌ఫార్మర్. డ్యాన్సర్ కాదు. అదే విధంగా ప్రభాస్‌కు ఉన్న ఇమేజ్ వేరు. తను డ్యాన్స్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం నడిస్తే చాలు. వారిద్దరి మధ్య ఒక కెమిస్ట్రీ వచ్చేలా కొన్ని మూమెంట్స్‌ను డిజైన్ చేశాను. వారిద్దరూ మన దేశంలోని రెండు భిన్నమైన సంస్కృతులకు చెందిన పురుషులకు ప్రతీకలు. అంతేకాకుండా ఈ పాట మరో లుంగీ డ్యాన్స్ కావటం నాకు ఇష్టం లేదు. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. నా జీవితంలో ఇంతత్వరగా ఏ పాటను కొరియోగ్రఫీ చేయలేదు. మొత్తం పాటను కేవలం ఐదు గంటల్లో పూర్తి చేశాం. స్వప్న, ప్రియాంక, కెమేరామేన్ అల్పేష్, ప్రొడక్షన్ టీమ్ చాలా కష్టపడి పనిచేశారు. ఒక రోజు రిహార్సల్స్ చేశాం అంతే! ఈ పాట పూర్తయిపోయి, బయటకు వెళ్లి... సంచలనాలు క్రియేట్ చేస్తోందంటే నమ్మలేకపోతున్నా.
సీవీఎల్‌ఎన్ ప్రసాద్
Updated Date - Jun 23 , 2024 | 01:21 AM