Rachel Gupta : హృదయమున్న అందం
ABN, Publish Date - Oct 27 , 2024 | 05:24 AM
రాచెల్ గుప్తాకు అస్సలు నచ్చని విషయం... పదిమందిలో ఒకరుగా మిగిలిపోవడం. ‘‘ప్రతివారిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అదేమిటనేది అందరికన్నా వాళ్ళకే బాగా తెలుస్తుంది.
అందం, తెలివి, సామాజిక బాధ్యత... వీటన్నిటి కలబోత రాచెల్ గుప్తా.పద్ధెనిమిదేళ్ళకే వ్యాపార రంగంలో అడుగుపెట్టిన ఈ జలంధర్ బ్యూటీకి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక మిలియన్‌కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.తాజాగా ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్’గా నిలిచి, ఆ టైటిల్ పొందిన తొలి భారతీయురాలుగా ఘనత సాధించిన రాచెల్ దాతృత్వంలోనూ ముందుంటుంది.
రాచెల్ గుప్తాకు అస్సలు నచ్చని విషయం... పదిమందిలో ఒకరుగా మిగిలిపోవడం. ‘‘ప్రతివారిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అదేమిటనేది అందరికన్నా వాళ్ళకే బాగా తెలుస్తుంది. దాన్ని ఉపయోగించుకున్నవారే రాణిస్తారు’’ అంటుంది రాచెల్. ఈనెల 25న థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌లో జరిగిన ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్-2024’ పోటీల్లో టైటిల్ గెలిచిన ఆమె... ఆ ఘనత సాధించిన తొలి భారతీయురాలుగా, మూడవ ఆసియన్‌గా చరిత్రకెక్కింది. ఫిలిప్పీన్ సుందరికి, రాచెల్‌కు మధ్య హోరాహోరీ పోటీ నడిచింది. కానీ ప్రశ్నోత్తరాల రౌండ్‌లో రాచెల్‌దే పైచెయ్యి అయింది.
‘‘ప్రపంచంలో ఈ రోజు పరిష్కరించాల్సిన అత్యంత తీవ్రమైన సమస్య ఏదని మీరనుకుంటున్నారు? వాటికి మీరే పరిష్కారాలు సూచిస్తారు?’’... ఇది ప్రతి ఫైనలిస్ట్‌నూ న్యాయనిర్ణేతలు అడిగిన ప్రశ్న. దానికి రాచెల్ బదులిస్తూ ‘‘ఈ రోజు అత్యంత క్లిష్టమైన సమస్య పేదరికం. దీనికి అధిక జనాభా, వనరులు పరిమితంగా ఉండడం కారణం. అంతర్జాతీయంగా జనాభా నియంత్రణ పద్ధతులను ప్రోత్సహించడం ద్వారా ప్రతి ఒక్కరికీ తగినన్ని వనరులు అందేలా చూసే బాధ్యతను ప్రపంచ నేతలు తీసుకోవాలి. నేను భారతదేశం నుంచి వచ్చాను.
అక్కడ ప్రతి ఒక్కరికీ ఆహారం, నీరు, విద్య, మౌలిక సదుపాయాలు అందుబాటులో లేవు. ప్రపంచంలో చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉందనేది వాస్తవం. పరస్పరం పోరాడుకోవడం ఆపేసి, ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఈ భూమి మీద ప్రతి ఒక్కరికీ తగినన్ని వనరులు సమకూరేలా చూడాల్సిన సమయం ఇది’’ అని చెప్పిన మాటలు న్యాయనిర్ణేతలను ఆకట్టుకున్నాయి. ఆమెను విజేతగా నిలబెట్టాయి.
ఈ విజయం స్ఫూర్తితో...
పంజాబ్‌లోని జలంధర్‌లో రాచెల్ పుట్టి పెరిగింది. ఆమె తండ్రి రాజేశ్ గుప్తా వ్యాపారవేత్త. కళలంటే ఆమె తల్లితండ్రులకు ఎంతో ఇష్టం. రాచెల్‌ను, ఆమె సోదరి నిర్ఝర్‌ను ఆ దిశగా ప్రోత్సహించారు. స్కూల్లో చదువుతున్నప్పుడే సాంస్కృతిక కార్యక్రమాల్లో రాచెల్ చురుగ్గా పాల్గొనేది. మరోవైపు వ్యాపార దక్షత కూడా ఆమెకు కుటుంబ వారసత్వంగా వచ్చింది. 2022లో... పద్ధెనిమిదేళ్ళకే- సౌందర్య సేవలను అందించే ‘ది గ్లామ్ బార్’ పేరిట సెల్ఫ్‌కేర్ సెలూన్ ప్రారంభించింది. ఫిలాసఫీలో డిగ్రీ చేస్తూనే... మోడల్‌గా ప్రయత్నాలు మొదలుపెట్టింది. 2022లో పారిస్‌లో జరిగిన ‘మిస్ సూపర్ టాలెంట్ ఆఫ్ ది వరల్డ్’ కాంపిటిషన్‌లో టైటిల్ గెలుచుకోవడంతో అంతర్జాతీయ ఫ్యాషన్ రంగంలో ఆమె పేరు మారుమోగింది.
ఈ ఏడాది ఆగస్టులో జైపూర్‌లో జరిగిన ‘మిస్ గ్రాండ్ ఇండియా-2024’లో విన్నర్‌గా నిలిచి, ప్రతిష్టాత్మకమైన ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్-2024’లో భారత్ తరఫున పాల్గొనేందుకు అర్హత సాధించింది. ఈ పోటీలో 68 దేశాల ప్రతినిధులను ఎదుర్కొన్న రాచెల్... భారత్‌కు తొలిసారిగా ఈ టైటిల్ అందించింది. ‘‘సంతోషంతో నాకు నోట మాట రావడం లేదు. ఈ విజయం స్ఫూర్తిగా... మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ తరఫున ప్రపంచ శాంతికి, సుస్థిరతకు నిబద్ధతతో పని చేస్తాను’’ అంటూ రాచెల్ స్పందించింది.
ఇష్టమే ప్రేరణగా....
సోషల్ మీడియాలో రాచెల్ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు పదిలక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇంగ్లీష్, హిందీ, పంజాబీ ధారాళంగా మాట్లాడే రాచెల్... పోటీల కోసం థాయిలాండ్ వెళ్ళినా తన సామాజిక బాధ్యతను మరచిపోలేదు. బ్యాంకాక్‌లోని ‘ఫౌండేషన్ ఫర్ స్లమ్ చిల్డ్రన్ కేర్’ను సందర్శించి, పదివేల థాయి భాట్స్ విలువైన సామగ్రిని అందజేసింది. ఆమె సేవా, దాతృత్వ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనడమే కాదు... ఇతరులను కూడా ఆ దిశగా ప్రోత్సహిస్తుంది. ఇంతకీ మోడలింగ్, బిజినెస్, సోషల్ సర్వీస్... రాచెల్ వీటిలో దేన్ని ఎక్కువగా ఇష్టపడుతుంది? ‘‘నేను మోడలింగ్ చెయ్యాలను కుంటున్నానని చెప్పినప్పుడు... నా తల్లితండ్రులు దిగ్ర్భాంతి చెందారు.
నా నిర్ణయాన్ని మార్చుకొనేలా ఒప్పించడానికి ప్రయత్నించారు. కానీ నా భవిష్యత్తు విషయంలో నాకు స్పష్టమైన ప్రణాళిక ఉంది. నేను రాణించేది వ్యాపార రంగంలోనేనని నాకు తెలుసు. అందులోనే స్థిరపడతాను కూడా. కానీ ఫ్యాషన్ రంగం, మోడలింగ్ నాకు చాలా ఇష్టం. కాబట్టే ఇటువైపు వచ్చాను. ఆ ఇష్టమే ఫ్యాషన్ షోలలో, అందాల పోటీల్లో పాల్గొనడానికి ప్రేరణనిచ్చింది. ప్రస్తుతానికి అదే నా ప్రధానమైన కెరీర్. ఇక ‘సామాజిక సేవ అందరి బాధ్యత’ అనే భావన కూడా మా కుటుంబం చేసే సేవా కార్యక్రమాల ద్వారానే నాలో బలపడింది. అది ఎప్పటికీ కొనసాగుతుంది అంటోంది రాచెల్.
Updated Date - Oct 27 , 2024 | 05:24 AM