Safe Diwali : టపాసులతో టెన్షన్ లేకుండా...
ABN, Publish Date - Oct 29 , 2024 | 06:02 AM
ఎల్లుండే దీపావళి. టపాసుల షాపింగ్ ఇప్పటికే జోరుగా, హుషారుగా మొదలైపోయింది. అయితే పేల్చే టపాసులతో దుష్టశక్తులతో పాటు ఆరోగ్యం కూడా పరారైపోకుండా చూసుకోవాలి. అందుకోసం కళ్లూ, ఒళ్లూ గాయపడకుండా కాపాడుకోవాలి.
సేఫ్ దివాలీ
ఎల్లుండే దీపావళి. టపాసుల షాపింగ్ ఇప్పటికే జోరుగా, హుషారుగా మొదలైపోయింది. అయితే పేల్చే టపాసులతో దుష్టశక్తులతో పాటు ఆరోగ్యం కూడా పరారైపోకుండా చూసుకోవాలి. అందుకోసం కళ్లూ, ఒళ్లూ గాయపడకుండా కాపాడుకోవాలి.
కంటి పాపలు పదిలంగా...
టపాసులు పేలుతూనే నిప్పు రవ్వలను విరజిమ్ముతాయి. అవి చిన్నవైతే గాల్లోకి లేచి నేలను తాకేలోపే ఆరిపోతాయి. అవే పెద్దవైతే మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందే! పెద్ద శబ్దంతో పేలే టపాసుల రవ్వలు ఒంటితోపాటు, కళ్లలో కూడా ఎగిరొచ్చి పడతాయి. కనుగుడ్డుకు రవ్వలు తగిలి గాయాలవుతాయి కూడా! ఇలాంటప్పుడు కనుగుడ్డులోని కార్నియాకు నష్టం జరగొచ్చు. ఈ నష్టం వల్ల కంటిలో ‘ట్రామాటిక్ కాటరాక్ట్’ ఏర్పవచ్చు. గాయం తీవ్రతను బట్టి రెటీనా నరం దెబ్బతినొచ్చు. ఒకవేళ కాటరాక్ట్ ఏర్పడితే దాన్ని తొలగించి కుట్లు వేసి సరిచేయొచ్చు. దెబ్బ తీవ్రతను బట్టి రెటీనా డిటాచ్‌మెంట్ సర్జరీ చేసి, సరి చేయొచ్చు. కంట్లో దెబ్బ తగిలిన భాగాన్ని బట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది. అసలీ సమస్యలేవీ రాకుండా ఉండాలంటే టపాసులు కాల్చేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించాలి.
వీలైనంత దూరంగా ఉండి టపాసులు పేల్చాలి.
కళ్లకు కళ్లద్దాలు పెట్టుకుంటే నిప్పు రవ్వలు, టపాసుల్లో ఉండే రాళ్లు కనుగుడ్డుకు తగలకుండా ఉంటాయి.
టపాసులు వెలిగించటానికి పొడవాటి అగర్‌బత్తీ, పుల్లల్లాంటివి వాడాలి.
పేలే టపాసులకు కనీసం 5 మీటర్ల దూరంలో ఉండాలి.
కంట్లో నిప్పురవ్వ పడినా, రాళ్లు తగిలినా కన్ను కడిగేసి వదిలేయకుండా వెంటనే కంటి వైద్యుల్ని సంప్రదించాలి.
కంటికి తగిలే గాయాలకు ఎంత త్వరగా చికిత్స చేయగలిగితే కంటి చూపును అంత మెరుగ్గా కాపాడుకోవచ్చు.
కార్నియాకు తగిలిన దెబ్బలను నిర్లక్ష్యం చేస్తే ఏకంగా కంటి చూపు పోయే ప్రమాదం ఉంటుంది.
కంటికి దెబ్బ తగిలితే వేళ్లతో రుద్దడం, నీళ్లతో కడగటం, ఆయింట్‌మెంట్ పెట్టడం లాంటివి చేయకూడదు.
టపాసుల పొగ వల్ల కళ్ల మంటలు సహజం. ఈ మంటల నుంచి ఉపశమాన్నిచ్చే లూబ్రికెంట్స్ ఉంటాయి. వీటి కోసం పండగ ముందే వైద్యులను కలవాలి.
కాంటాక్ట్ లెన్స్‌లు వేసుకునేవాళ్లు టపాసులు కాల్చేటప్పుడు సాధారణ కళ్లజోడు వాడటం అవసరం. కాంటాక్ట్ లెన్స్‌ల మీద వేడి ప్రభావం ఎక్కువ. కొన్ని సందర్భాల్లో కార్నియా కాలే ప్రమాదం కూడా ఉంటుంది.
చిచ్చుబుడ్లు, రాకెట్ల వల్లే కళ్లకు గాయాలయ్యే అవకాశాలు ఎక్కువ. మరీ ముఖ్యంగా కంటికయ్యే గాయాల్లో కళ్ల మంటలు మొదలుకుని కార్నియా లేచిపోవటం, పాక్షిక అంధత్వం, పూర్తి అంధత్వం వరకూ ఎన్నో రకాల సమస్యలు చోటు చేసుకుంటూ ఉంటాయి. టపాసులు పేలేటప్పుడు వెలువడే వేడి 1200 డిగ్రీల వరకూ ఉంటుంది. ఇది మరిగే నీళ్ల 1000 డిగ్రీల ఉష్ణోగ్రత కంటే ఎక్కువ. గాజును కరిగించేంతగా, థర్డ్ డిగ్రీ గాయాలు చేసేంత ప్రమాదకరంగా ఉంటుంది. కాబట్టి టపాసులు పేల్చేటప్పుడు నిర్లక్ష్యం వద్దే వద్దు!
కాలుష్యాన్ని పీల్చొద్దు!
టపాసుల పేలుడుతోపాటు వెలువడే పొగ వల్ల ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తుతాయి. మరీ ముఖ్యంగా ఆరోగ్యకరమైన వ్యక్తులతోపాటు అప్పటికే ఉబ్బసం, క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ మొదలైన శ్వాసకోశ వ్యాధులు ఉన్న వాళ్లకు టపాసుల పొగ వల్ల విపరీతమైన ఆరోగ్య నష్టం జరుగుతుంది. టపాసుల తయారీలో సల్ఫర్ (గంధకం), కార్బన్ వాడతారు. వీటి వల్లే టపాసులు పెద్ద పెద్ద వెలుగులను వెదజల్లుతాయి. వాటికితోడు ఆర్సినిక్, మాంగనీస్, సోడియం ఆక్సలేట్, అల్యూమినియం, ఐరన్ డస్ట్ పౌడర్, పొటాషియం, బేరియం నైట్రేట్ మొదలైన ఎన్నో రసాయనాలను వాడతారు. వీటి వల్ల టపాసులు కాల్చినప్పుడు దట్టమైన పొగలు అలుముకుంటాయి. ఈ పొగల్లో సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్...మొదలైన విష వాయువులు ఉంటాయి. వీటిని పీల్చడం వల్ల స్వల్పంగా దగ్గుతో పాటు ఊపిరితిత్తుల్లో కఫం పేరుకోవటం, ఊపిరి తీసుకోవటంలో ఇబ్బంది, ఆయాసం, అలర్జిక్ రైనైటిస్, రెస్పిరేటరీ ట్రాక్ ఇన్‌ఫెక్షన్లు మొదలైన సమస్యలు వేధిస్తాయి.
సురక్షిత పద్ధతులివే!
ముక్కుకీ, నోటికీ కాటన్ స్కార్ఫ్ చుట్టుకోవాలి.
రంగుల పొగలు వెదజల్లే టపాసులు మరింత ప్రమాదకరమైనవి. వాటిని కాల్చకపోవటమే మంచిది.
చైనా తయారీ టపాసులు కార్బన్ మోనాక్సైడ్ లాంటి విషవాయువులను విడుదల చేస్తాయి. వాటికి బదులుగా దేశీయ టపాసులనే ఎంచుకోవాలి.
తక్కువ పొగ వెదజల్లే టపాసులకు పరిమితమవటం మేలు.
టపాసులు కాలేటప్పుడు వాటి మీదకు వంగి చూడకుండా, చేతిని దూరంగా చాపి ఉంచాలి.
మూసి ఉన్న ప్రదేశాల్లో కాకుండా వాకిట్లో లేదా మేడ పైన, ఆట స్థలాల్లో టపాసులు కాల్చటం ఉత్తమం.
ఇంట్లోకి పొగ వెళ్లకుండా తలుపులు మూసి ఉంచాలి.
టపాసులు కాల్చిన మరునాడు ఉదయాన్నే వాకింగ్ చేయటం మానుకోవాలి. ఆ సమయంలో వాతావరణంలో కాలుష్యాల పరిమాణం ఎక్కువగా ఉంటుంది.
ఎక్కువ పొగను వెదజల్లే చిచ్చుబుడ్లు, మతాబులు, భూచక్రాలు లాంటి టపాసులను కాల్చకూడదు.
మరీ ముఖ్యంగా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలున్నవాళ్లు టపాసులకు దూరంగా ఉండాలి.
అపార్ట్‌మెంట్లలో ఉండేవాళ్లు బాల్కనీల్లో కాకుండా కిందకి దిగి వచ్చి అపార్ట్‌మెంట్ ఆవరణలో టపాసులు పేల్చాలి.
టపాసులు కాల్చేటప్పుడు
ఒకరి తర్వాత ఒకరుగా ఒక్కొక టపాసు కాల్చాలి. ఇలా చేస్తే శబ్దంతోపాటు, పొగ కూడా తక్కువగా వెలువడుతుంది.
టపాసులు కాల్చటానికి పొడవాటి క్యాండిల్, అగర్‌బత్తీ ఉపయోగించాలి. చేతిని పూర్తిగా చాపి టపాసులను ముట్టించాలి.
బక్కెట్లలో నీళ్లు అందుబాటులో పెట్టుకుంటే మంటలు ఆర్పటానికి వీలుగా ఉంటుంది. పొరపాటున చేతులు కాలితే వెంటనే ఆ నీళ్లలో ముంచటానికి అనువుగా ఉంటుంది.
పసిపిల్లల చెవుల్లో దూది ఉండలు ఉంచాలి.
పేలని టపాసులను దగ్గరికెళ్లి పరీక్షించటం మానుకోవాలి.
టపాసులను వంట గదిలో, పూజ గదిలో ఉంచకూడదు.
గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్ ఆపేయాలి. నిండుగా ఉన్న సిలిండర్‌లను బాల్కనీల్లో, టపాసులు పేల్చే ప్రదేశాలకు దగ్గర్లో ఉంచకూడదు. దూసుకొచ్చే రాకెట్ల లాంటివి సిలిండర్లకు తగిలే ప్రమాదం ఉంటుంది.
టపాసులు కాల్చే సమయంలో కాటన్ దుస్తులే ధరించాలి.
ఒళ్లు జర భద్రం!
దీపావళి టపాసులు పేల్చినప్పుడు శబ్దంతోపాటు దట్టమైన పొగలూ అలముకుంటాయి. టపాసుల తయారీలో వాడే అత్యధిక మెగ్నీషియం, కార్డైట్‌లే ఇంత దట్టమైన పొగలకు కారణం. టపాసుల పొగ చర్మాన్ని తాకినప్పుడు ఈ రసాయనాలు చర్మం మీద అతుక్కుని దురద, మంట, కెమికల్ బర్న్, అలర్జీలను కలగజేస్తాయి. ఇక పొగతోపాటు టపాసుల తయారీలో ఉపయోగించే రాళ్లు కూడా చర్మానికి తగిలి గాయాలు చేస్తాయి. కొన్నిసార్లు బాంబులు, రాకెట్లు చాలా దగ్గర్నుంచి పేలినప్పుడు వాటి నిప్పు రవ్వలు చర్మం మీద పడి అంటుకుపోతాయి. కొన్ని బాంబులు చేతుల్లోనే పేలతాయి. ఇలా దీపావళి టపాసుల పేలుళ్లు, పొగల వల్ల చర్మానికి జరిగే నష్టం ఎక్కువే! కాబట్టి కొన్ని జాగ్రత్తలు తప్పక పాటించాలి.
ఒళ్లంతా కప్పి ఉంచే కాటన్ దుస్తులు ధరించాలి.
పేలే టపాసులకు దూరంగా ఉండాలి.
మీది సున్నిత చర్మమైతే టపాసులు పేల్చే సమయంలో ముఖానికి, చేతులకు కాటన్ స్కార్ఫ్ చుట్టుకోవాలి.
టపాసులు పేల్చడానికి ముందు, మాయిశ్చరైజర్ చర్మానికి పూసుకుంటే రక్షణ పొరగా పని చేస్తుంది.
టపాసులు కాల్చిన తర్వాత సబ్బు నీటితో చేతులు, ముఖం కడుక్కోవటం మర్చిపోకూడదు.
శుభ్రంగా కడిగిన తర్వాత తప్పనిసరిగా మాయిశ్చరైజర్ రాసుకోవాలి.
చర్మం కాలితే?
టపాసుల పేలుడు వల్ల చర్మం మీద గాయాలైనా, కాలినా ఈ క్రింది తక్షణ చికిత్స చేసుకోవాలి
ధారగా కారే నీళ్ల కింద ఉంచి, గాయాన్ని కడగాలి
ఐస్ క్యూబ్స్ రుద్దడం, నూనె పూయడం, టించర్, డెటాల్, టూత్‌పేస్ట్ పూసుకోవడం లాంటివి చేయకూడదు
గాయాన్ని శుభ్రంగా కడిగి యాంటీబయాటిక్ క్రీమ్ పూసుకుంటే సరిపోతుంది
గాయం తీవ్రంగా ఉంటే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి
ఆస్పత్రికి చేరేవరకూ గాయాలను శుభ్రమైన బట్టతో కప్పి ఉంచాలి.
బొబ్బ ఇబ్బంది పెడుతుంటే, స్టెరైల్ చేసిన సూదితో గుచ్చి, లోపలి నీళ్లను బయటకు రప్పించాలి. కానీ పైన ఏర్పడిన రక్షణ పొరను పీకకూడదు
లోతైన కాలిన గాయాలకు తప్పనిసరిగా డ్రెస్సింగ్ అవసరమవుతుంది. మాయిస్ట్ డ్రెస్సింగ్ కోసం, యాంటీబయాటిక్ క్రీమ్ అప్లై చేసి, మాయిశ్చరైజర్, యాంటీబయాటిక్ కాంబినేషన్ మెటీరియల్‌తో డ్రెస్సింగ్ చేయాలి.
లోతైన గాయాల మీద దూదితో కట్టు కడితే అది గాయానికి అతుక్కుపోయి, దాన్ని తొలగించిన ప్రతిసారీ కొత్తగా మానిపోతున్న గాయం మళ్లీ తిరగబెడుతూ ఉంటుంది. కాబట్టి దూది జోలికి వెళ్లకూడదు
టపాసులను తాకిన, కాల్చిన చేతులను నేరుగా ముఖం మీద, కళ్లలో పెట్టుకోకూడదు.
టపాసులు కాల్చిన తర్వాత దురదలు మొదలైతే వెంటనే వైద్యుల్ని కలవాలి
కాలిన ప్రదేశంలో ఏవైనా నగలు, చేతి గడియారాలు ఉంటే వాటిని తొలగించాలి.
డాక్టర్ స్వప్న ప్రియ
కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, కాస్మోస్యూర్ క్లినిక్,
హైటెక్ సిటీ, హైదరాబాద్
ఢామ్... ఢామ్ శబ్దాలతో జాగ్రత్త!
టపాసుల శబ్దాల వల్ల కలిగే నష్టం నుంచి మనల్ని మనమే కాపాడుకోవటం అవసరం. టపాసుల శబ్దాల వల్ల కలిగే నష్టం రెండు అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ శబ్దాలకు మనం ఎంత దూరంలో ఉన్నాం? శబ్దం ఎంత తీవ్రంగా ఉంది? అనే రెండు అంశాల మీదే మనకు కలిగే వినికిడి నష్టం ఆధారపడి ఉంటుంది. టపాసులు చేసే పెద్ద శబ్దాల వల్ల హైపర్‌టెన్షన్, ఒత్తిడి, వినికిడిలోపం మొదలైన సమస్యలు తలెత్తుతాయి. విపరీతమైన శబ్దాల వల్ల కొన్నిసార్లు వినికిడి శక్తి పూర్తిగా కోల్పోయే ప్రమాదం కూడా లేకపోలేదు. అత్యధిక శబ్దాల కారణంగా....
టిన్నిటస్: చెవుల్లో శబ్దం (గంట మోగినట్టు, సముద్రపు హోరు) మొదలవుతుంది. ఇది వినికిడి లోపానికి దారి తీయొచ్చు.
టెంపరరీ థ్రెషోల్డ్ షిఫ్ట్: వినికిడి శక్తిలో స్వల్ప తగ్గుదల. ఇది సాధారణంగా ఒక రోజంతా ఉంటుంది.
పర్మనెంట్ హియరింగ్ లాస్: కర్ణభేరి దెబ్బతినటం వల్ల శాశ్వత వినికిడి లోపం ఏర్పడవచ్చు.
వినికిడి నిక్షేపంగా!
టపాసుల శబ్దం కారణంగా వినికిడి శక్తి దెబ్బతినకుండా ఉండాలంటే సాధ్యమైనంత తక్కువ శబ్దం వచ్చే టపాసులనే పేల్చాలి. ఈ ముందు జాగ్రత్తలతోపాటు...
చెవులకు ఇయర్ ప్లగ్స్ పెట్టుకోవటం వల్ల శబ్దం నేరుగా కర్ణభేరికి చేరకుండా ఉంటుంది.
ఫోమ్ ప్లగ్స్ లేదా హెడ్ ఫోన్స్ వాడినా ఫలితం ఉంటుంది.
ఏ మాత్రం శబ్దం తాకిడికీ గురవకూడదనుకుంటే ఇయర్ ప్లగ్స్‌తోపాటు, హెడ్ ఫోన్స్ కూడా వాడాలి.
టపాసుల పేలుడు వల్ల వినికిడిలో మార్పు అనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలి. వినికిడికి సంబంధించిన సమస్యలకు కారణాన్నీ, దెబ్బ తిన్న చెవి భాగాన్నీ గుర్తించి ఎంత త్వరగా గుర్తించి అంత త్వరగా చికిత్స అందిస్తే మేలు. అప్పుడు అంత త్వరగా వినికిడి తిరిగొస్తుంది.
శబ్దాలకు ఎంత దూరంలో ఉంటే నష్టం అంత తక్కువగా ఉంటుంది. కాబట్టి పెద్ద శబ్దంతో పేలే టపాసులకు సాధ్యమైనంత ఎక్కువ దూరం పాటించాలి.
పెద్దలైతే 20 మీటర్లు, పిల్లలైతే 50 మీటర్ల దూరం పాటించాలి.
డాక్టర్ సుధీర్ రెడ్డి
ఈన్‌టి సర్జన్, త్రీ సెన్సెస్,
హబ్సిగూడ, హైదరాబాద్.
Updated Date - Oct 29 , 2024 | 06:02 AM