ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sarla Kumari : ఆ పేరు పెట్టడమే ఆయన గొప్పతనం

ABN, Publish Date - Sep 11 , 2024 | 03:49 AM

తెలుగు నేలమీద విరాజిల్లిన తొలి తరం సామ్యవాద, సంఘసంస్కరణ ఉద్యమాలకు ప్రత్యక్ష సాక్షి... పరిటాల సరళా కుమారి. సామాజిక, ఆర్థిక రంగ విశ్లేషకుడిగా తెలుగు పాఠకులకు గణాంకాల విలువలను తెలిపిన ప్రముఖ జర్నలిస్టు వి.హనుమంతరావు సతీమణి. ఆయన శతజయంతి సంవత్సరం సందర్భంగా తమ జీవిత విశేషాలను సరళా కుమారి ‘నవ్య’తో పంచుకున్నారు.

తెలుగు నేలమీద విరాజిల్లిన తొలి తరం సామ్యవాద, సంఘసంస్కరణ ఉద్యమాలకు ప్రత్యక్ష సాక్షి... పరిటాల సరళా కుమారి. సామాజిక, ఆర్థిక రంగ విశ్లేషకుడిగా తెలుగు పాఠకులకు గణాంకాల విలువలను తెలిపిన ప్రముఖ జర్నలిస్టు వి.హనుమంతరావు సతీమణి. ఆయన శతజయంతి సంవత్సరం సందర్భంగా తమ జీవిత విశేషాలను సరళా కుమారి ‘నవ్య’తో పంచుకున్నారు.

‘‘ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా 30 ఏళ్ళకు పైగా పని చేశాను. పిల్లల కోసం ఎన్నో గేయాలు రాశాను. నా విద్యార్థులు ఎంతోమంది డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా... ఇలా వివిధ రంగాల్లో రాణిస్తున్నారు. అయినా, ఒక టీచర్‌గా కన్నా ఒక నికార్సయిన జర్నలిస్టు భార్యగా మరింత గర్వపడతాను. నా భర్త వి.హనుమంతరావు మంచి పాత్రికేయుడు మాత్రమే కాదు, అంతకు మించి గొప్ప మానవతావాది. ఆయన ఔన్నత్యం గురించి చెప్పడానికి ముందుగా మా కుటుంబ నేపథ్యాన్ని ప్రస్తావించాలి. మా సొంతూరు కృష్ణాజిల్లా వెల్దిపాడు. నా చిన్నతనంలోనే మా నాన్న అనారోగ్యంతో మాకు దూరమయ్యాడు. పులి మీద పుట్రలా నాకన్నా పదేళ్ళు పెద్దయిన మా కృష్ణవేణి అక్క భర్తను పోగొట్టుకొని పుట్టింటికి చేరింది. దాంతో మా అమ్మ పరిటాల అనంతమ్మ మమ్మల్ని వెంటపెట్టుకొని నూజివీడు దగ్గర గొల్లపల్లిలోని తన తోబుట్టువు ఇంటికి చేరింది. అప్పటికే మా పెద్దమ్మ కొడుకు పొట్లూరి రాఘవయ్య భారత కమ్యూనిస్టు పార్టీ కార్యకర్త కావడంతో... మాకూ సామ్యవాదం పరిచయం అయింది. కమ్యూనిస్టు పార్టీ మీద నిషేధాజ్ఞలు కొనసాగుతున్న సమయంలో బాల కొరియర్‌గా అజ్ఞాతంలో ఉన్న కొండపల్లి సీతారామయ్య, చండ్ర రాజేశ్వరరావు తదితర నాయకులకు సమాచారాన్ని బట్వాడా చేయడం, కరపత్రాలు పంచడం లాంటి పనుల్లో చురుగ్గా పాల్గొన్నాను.


  • సాహిత్య పరిచయం...

ఆనాటి కమ్యూనిస్టులు దోపిడీ వ్యతిరేక పోరాటానికే పరిమితం కాకుండా, సంఘ సంస్కరణ బాధ్యతనూ నెత్తికెత్తుకున్నారు. కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు లాంటి సంఘ సంస్కర్తల వారసత్వాన్ని కొనసాగించారు. ఇది 1945 నాటి సంగతి. వితంతువైన మా అక్కకు మళ్లీ పెళ్లి చెయ్యాలని అన్నయ్య పట్టుబట్టి, ఇంట్లో వాళ్ళను ఒప్పించి... తన ఉద్యమ సహచరుడు తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తితో అక్క కృష్ణవేణి పెళ్లి జరిపించాడు. కమ్యూనిస్టు పార్టీని బలోపేతం చేయడానికి మా బావ ఊరూరూ తిరుగుతుండటంతో అక్కకు తోడుగా వారి వెంట మేమూ నడిచాం. అప్పుడు మా అవస్థలు ఎన్నో. గ్రామాల్లో కమ్యూనిస్టులకు అంత త్వరగా ఇల్లు అద్దెకు ఇచ్చేవారు కాదు. మాతో మాట్లాడటానికి కూడా చాలామంది భయపడేవారు. నాకు చదువుకోవాలని కోరిక. కానీ నెలకొక ఊరు మారుతున్న పరిస్థితుల్లో, నన్ను కొండిపర్రు ఆశ్రమ పాఠశాలలో చేర్పించారు. ఆంక్షల కాలంలో ఎంతోమంది కమ్యూనిస్టులకు ఆశ్రయం కల్పించింది ఆ పాఠశాల. అక్కడే నేను హిందీ-విశారద కోర్సు పూర్తి చేశాను. సాహిత్య పఠనాన్ని పరిచయం చేశారు. అవన్నీ నన్ను తర్వాత కాలంలో హిందీ పండితురాలిగా, తెలుగు గేయ రచయిత్రిగా మలిచాయి.


  • పెళ్లయిన 20 రోజులకే...

కమ్యూనిస్టు పార్టీ సభ్యుడు అట్లూరి చలపతిరావుతో నాకు మొదట వివాహం అయింది. అది సాఫీగా సాగుతోన్న నా జీవితంలో పెద్ద కుదుపు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న ఆయనను ఒక రోజు పోలీసులు అరెస్టు చేశారు. మిగతా దళసభ్యుల జాడ చెప్పమని చిత్రహింసలు పెట్టారు. అయినా, ఆయన నోరు విప్పలేదు. దాంతో విసిగిపోయిన పోలీసులు చలపతిరావును తుపాకీతో కాల్చి చంపారు. అదే అతను కనుక ఆ రోజు నోరు విప్పితే... నలభైమందికిపైగా ఉద్యమకారుల ప్రాణాలు గాల్లో కలిసేవి. అదీ ఆనాటి ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ సభ్యుల నిబద్ధత, త్యాగం. అప్పటికి మాకు పెళ్లయ్యి 20 రోజులే. చలపతి రావు చనిపోయాక నేను మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకోలేదు. మా బావ మీద ఆంధ్రాలో పోలీసుల నిఘా పెరగడంతో కుటుంబమంతా మద్రాసు చేరాం. తిరిగి చదువు కొనసాగించాను. హిందీలో ప్రవీణ కోర్సుతో పాటు బీఈడీ పూర్తిచేశాను. నాలుగేళ్ళ తర్వాత మళ్లీ పెళ్లి చేసుకోవాలని ఇంట్లో వారంతా నాకు నచ్చజెప్పారు. అప్పుడు మద్రాసులో ‘విశాలాంధ్ర’ విలేకరిగా ఉన్న పరుచూరి హనుమంతరావు (ప్రగతి ప్రింటర్స్‌ అధినేత) గారు ‘‘ఢిల్లీలో రిపోర్టరుగా పనిచేస్తున్న వి. హనుమంతరావు అయితే సరళకు తగిన వ్యక్తి’’ అని మా బావకు చెప్పారు. అలా 1954లో అత్యంత నిరాడంబరంగా హేతువాది తాపీ ధర్మారావుగారి చేతుల మీదుగా దండల మార్పిడి పద్ధతిలో మా వివాహం జరిగింది. పైగా మాది కులాంతర, సంస్కరణవాద వివాహం. ఆయన పూర్తి సంప్రదాయ కుటుంబంలో పుట్టినా... చాదస్తాలకు అతీతంగా జీవించారు. సమాజం కోసం సర్వస్వాన్ని త్యాగం చేసిన అమరవీరులంటే ఎంతో ఆరాధనా భావం. ఆ గౌరవంతోనే నా మొదటి భర్త చలపతిరావు పేరును మా పెద్దబ్బాయికి పెట్టారు. ఇదొక్కటి చాలదా.. హనుమంతరావు గారి ఔన్నత్యం అర్థం కావడానికి.


  • పార్లమెంట్‌లో తొలి తెలుగు విలేకరి

మొట్టమొదటి పార్లమెంటు సమావేశాలను రిపోర్టు చేసిన తొలి తెలుగు వ్యక్తి హనుమంతరావు గారే.! తద్వారా నెహ్రూ, శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ, ఆచార్య కృపలానీ, రాంమనోహర్‌లోహియా, ఏకే గోపాలన్‌, భూపేష్‌ గుప్తా లాంటి తొలితరం నేతల ప్రసంగాలను తెలుగువారికి అందించారు. తర్వాత విమాన వాహకనౌక ‘విక్రాంత్‌’లో ప్రయాణించి... బంగ్లాదేశ్‌ యుద్ధ వార్తలు రిపోర్టు చేశారు. ‘డేటా న్యూస్‌ ఫీచర్స్‌’ సంస్థ నెలకొల్పి, సామాజిక, ఆర్థిక రంగాలకు సంబంధించిన అంశాలపై కొన్ని వందల వ్యాసాలు రాశారు. కొన్ని సంవత్సరాలకు సంబంధించిన కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌ కేటాయింపులు, గణాంకాలు ఆయన నోటిలో ఎల్లప్పుడూ ఆడుతుండేవి. ఒక్కోసారి వారి జ్ఞాపకశక్తి చూసి నాకే ఆశ్చర్యం వేసేది. ‘చివరి వరకు రాస్తూ ఉండాలి’ అనుకొన్నారు. అలానే 2016, డిసెంబరు 13న చనిపోవడానికి ముందు రోజు కూడా ఒక వ్యాసం రాశారు. విలువైన సమాచారంతో ‘డేటా ఆంధ్రప్రదేశ్‌’, ‘ఏపీ ఎట్‌ 50’ లాంటి పుస్తకాలు తీసుకొచ్చారు. ‘వీక్షణం’ వ్యవస్థాపక సంపాదకుడిగా, ‘ఎకనమిక్‌ టైమ్స్‌’లో వ్యాసకర్తగా... ఒకటా, రెండా... ఆయన నిర్వర్తించిన బాధ్యతలెన్నో. హనుమంతరావు గారి విద్వత్తును చూసి చాలామంది ఆయన్ను ‘ప్రొఫెసర్‌’ అని సంబోధించిన సందర్భాలున్నాయి. కానీ ఆయన చదువుకున్నది ఎస్సెస్సెల్సీ మాత్రమే. నిరంతర అధ్యయనమే హనుమంతరావును ఉత్తమ జర్నలిస్టుల్లో ఒకరిగా నిలిపింది అనడంలో సందేహంలేదు.


  • అదే నా కోరిక...

ఇప్పుడు నా వయసు 89 ఏళ్ళు. ప్రస్తుతం మా రెండవ అబ్బాయి సతీ్‌షబాబు దగ్గర ఉంటున్నాను. బీపీ, షుగర్‌ లాంటి ఆరోగ్య సమస్యలంటూ ఏమీ లేవు. నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను. ఉద్యోగ విరమణ పొందికూడా 30 ఏళ్ళు దాటింది. పిల్లల కోసం మన స్వాతంత్య్ర సమరయోధుల జీవిత గాథలు, పర్యాటక ప్రదేశాలు ఇతివృత్తంగా తెలుగులో గేయాలు రాశాను. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా రాసిన ‘ఆంధ్రుల చరిత్ర’ గేయ కథనం, ప్రకృతి పరిరక్షణలో భాగంగా ‘ప్రాణిప్రపంచం’ తదితర రచనలు పుస్తకాలుగా వచ్చాయి. నా భర్త వి. హనుమంతరావుకు దామోదరం సంజీవయ్య, వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి లాంటి ముఖ్యమంత్రులతో పరిచయాలున్నా... వ్యక్తిగత అవసరానికి వాటిని ఎన్నడూ ఉపయోగించలేదు. ఇది ఆయన శతజయంతి సంవత్సరం. ఈ సందర్భంగా నిరంతరం అణగారిన వర్గాల సంక్షేమం కోసం పరితపించిన హనుమంతరావు పాత్రికేయ వృత్తి, వ్యక్తిగత జీవితం మీద సమాజంలో చర్చ జరగాలన్నది నా అభిలాష.


  • స్థలం కూడా తీసుకోలేదు

మా అమ్మ ఊర్లో తనకున్న కొద్దిపాటి భూమి అమ్మేసి, ఆ డబ్బుతో అమీర్‌పేట నాగార్జుననగర్‌లో మాకు స్థలం కొని ఇచ్చింది. నా ఉద్యోగం మీద రుణంతో ఇల్లు కట్టుకున్నాం. జర్నలిస్టులకు ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయిస్తూ, హనుమంతరావుకు కూడా జర్నలిస్టు కాలనీలో స్థలం మంజూరు చేసింది. ‘‘నాకు సొంతిల్లు ఉంది. కనుక స్థలం అవసరం లేదు’’ అని అది తీసుకోలేదు. ఇదీ హనుమంతరావు నిజాయితీ. ఆయన ప్రేరణతో నా ఉద్యోగ విరమణ సమయంలో వచ్చిన సొమ్ములో నుంచి రూ.50 వేలు ‘మహిళా జర్నలిస్టుల ఫౌండేషన్‌’కు విరాళంగా ఇచ్చాం.


  • సుందరయ్యతో అనుబంధం

హనుమంతరావుకు టైపింగ్‌, షార్ట్‌హాండ్‌ మీద పట్టుంది. రెండో ప్రపంచ యుద్ధసమయంలో మిలటరీ నేవీలో స్టెనోగ్రాఫర్‌గా ఉద్యోగంలో చేరారు. ఆయన సొంతూరు తూర్పుగోదావరి జిల్లా మండపేట. సమాజం పట్ల ఆనాటి కమ్యూనిస్టులకున్న ఆర్తిని చూసి హనుమంతరావు ప్రభావితమయ్యారు. పుచ్చలపల్లి సుందరయ్యగారికి టైపింగ్‌, షార్ట్‌హాండ్‌ వచ్చిన వారి అవసరం ఉందని తెలిసి, నెలకు రూ.100 జీతం వచ్చే ప్రభుత్వ కొలువును వదిలేసి, ‘విశాలాంధ్ర’ విలేకరిగా కలం పట్టారు. సుందరయ్యగారు రాసిన ‘విశాలాంధ్రలో ప్రజారాజ్యం’ పుస్తక రచన పది రోజుల్లో పూర్తికావడానికి ఎంతో తోడ్పడ్డారు.

-సాంత్వన్‌/ ఫొటో: రాజ్‌కుమార్‌

Updated Date - Sep 11 , 2024 | 03:49 AM

Advertising
Advertising