Prisha Thapre : ఆకలి తీర్చడానికి చానెల్ ఈదింది!
ABN, Publish Date - Sep 16 , 2024 | 04:33 AM
పేద పిల్లల ఆకలి తీర్చాలి, తనలాంటి మరికొందరికి స్ఫూర్తిగా నిలవాలి.. ఇవీ ప్రిషా తప్రే కలలు. వాటిని ఒకేసారి నెరవేర్చుకుంది పదహారేళ్ళ ఈ బ్రిటిష్-ఇండియన్.గజ ఈతగాళ్ళకే సవాల్ విసిరే ఇంగ్లీష్ ఛానెల్‌ని ఈదిన ఈ ధీశాలి... తన సాహసయాత్రను ఇలా కొనసాగిస్తానంటోంది.
పేద పిల్లల ఆకలి తీర్చాలి, తనలాంటి మరికొందరికి స్ఫూర్తిగా నిలవాలి.. ఇవీ ప్రిషా తప్రే కలలు. వాటిని ఒకేసారి నెరవేర్చుకుంది పదహారేళ్ళ ఈ బ్రిటిష్-ఇండియన్.గజ ఈతగాళ్ళకే సవాల్ విసిరే ఇంగ్లీష్ ఛానెల్‌ని ఈదిన ఈ ధీశాలి... తన సాహసయాత్రను ఇలా కొనసాగిస్తానంటోంది.
‘‘కల్లోలంగా ఉన్న నీరు, చుట్టూ చీకటి... ‘గమ్యం వరకూ చేరగలనా?’ అనే సందేహం... కానీ ఎలాగైనా సాధించాలనే పట్టుదల... ఇంగ్లీష్ ఛానెల్‌ను ఈదుతున్నప్పుడు మొదటి రెండు గంటలు నేను ఎదుర్కొన్న పరిస్థితులివి. స్విమ్మింగ్‌లో ఇప్పటివరకూ నాకు అత్యంత దుర్భరమైన అనుభవం ఇది’’ అంటోది ప్రిషా తప్రే. ఈ నెల నాలుగో తేదీన... బ్రిటన్‌లోని డోవర్ నుంచి క్యాప్ గ్రిస్ నెజ్ వరకూ... ఇంగ్లీష్ ఛానెల్‌లో 34 కిలోమీటర్లు ఈత కొట్టిన ఆమె ఒడ్డుకు చేరగానే... అక్కడ ఉన్న జనసందోహం కేరింతలతో స్వాగతం పలికింది. ఆ హర్షాతిరేకాలు ఆమె సాహసానికి మాత్రమే కాదు, ఔదార్యానికి కూడా.
ప్రిషాది కొన్నేళ్ళ క్రితం బ్రిటన్‌లో స్థిరపడిన మహారాష్ట్రియన్ కుటుంబం. అక్కడే పుట్టిన ప్రిషా ప్రస్తుతం లండన్‌లోని బుషే మీడ్స్ స్కూల్‌లో చదువుతోంది. ఆమెకు చిన్న వయసులోనే స్విమ్మింగ్‌ను పరిచయం చేశారు తల్లితండ్రులు.‘‘ మా ఇంటికి దగ్గరలో ఒక చెరువు ఉంది. అక్కడ చాలామంది ఈత కొడుతూ ఉంటారు. సాయంత్రం కాసేపు స్విమ్మింగ్ ప్రాక్టీస్ చెయ్యడం నా దినచర్యలో భాగమైపోయింది’’ అని చెబుతోంది ప్రిషా. ఆమె ఆసక్తిని గమనించిన తల్లితండ్రులు స్థానికంగా ఉన్న వాట్‌ఫోర్డ్ స్విమ్మింగ్ క్లబ్‌లో చేర్పించారు. క్రమంగా ఆమె ప్రావీణ్యాన్ని సంపాదించుకుంది. కానీ.. గజ ఈతగాళ్ళకు సైతం సవాల్‌గా నిలుస్తూ, ఈదడానికి సంకోచించేలా చేసే ఇంగ్లీష్ ఛానెల్‌ను ఒంటరిగా దాటాలనే ఆలోచన ఆమెకు ఎలా కలిగింది?
అప్పుడే నిర్ణయించుకున్నా...
నాలుగేళ్ళ క్రితం మా కుటుంబ సభ్యులందరూ కూర్చొని మాట్లాడుతూ ఉండగా.... ఇంగ్లీష్ ఛానెల్ గురించి చర్చ వచ్చింది. ప్రతి సంవత్సరం వందలాదిమంది ఈతగాళ్ళు ఇంగ్లీష్ ఛానెల్ ఈదడానికి వస్తారనీ, వారిలో కొందరు ప్రాణాలు కోల్పోతూ ఉంటారనీ తెలిసింది. అది వినగానే... ఎప్పటికైనా దాన్ని ఈదాలని నిర్ణయించుకున్నాను. అయితే దానికి ప్రేరణ మాత్రం... నేను వివిధ మాధ్యమాల ద్వారా తెలుసుకున్న ఆవేదనాభరితమైన విషయాలు. ప్రపంచంలోని చాలా దేశాల్లో పేదరికం, ఆకలి కారణంగా ఎందరో పిల్లలు ప్రతిరోజూ మరణిస్తున్నారు. వారికి నేను ఏ విధంగా సాయపడగలనని ఆలోచించేదాన్ని. నావంతుగా నిధులు సేకరించాలనుకున్నాను. ఇంగ్లీష్ ఛానెల్‌ను ఈది... ఆ సందర్భాన్ని విరాళాల కోసం ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నాను’’ అని వివరించింది ప్రిషా. ఆగకుండా అంత దూరం ఈదాలంటే ఎంతో దారుఢ్యం, మనోనిబ్బరం ఉండాలి. రెండు, మూడు గంటలతో ప్రారంభించి... ఎనిమిది, తొమ్మిది... చివరిగా పన్నెండు, పదమూడు గంటలు ఈదడం సాధన చేసింది. దీనికి ఆమె కోచ్‌లు ఎంతో సహకరించారు. చివరకు ఆ రోజు రానేవచ్చింది.
నిద్రపోతానేమో అనిపించింది...
ప్రిషా ప్రయత్నం గురించి తెలుసుకున్న క్రీడాభిమానులు, స్థానికులు డోవర్ దగ్గరకు వచ్చి శుభాకాంక్షలు చెబుతూండగా... ఆమె ఇంగ్లీష్ ఛానెల్‌లో దూకింది. కానీ పరిస్థితులతో సర్దుకోడానికి రెండుగంటలు పట్టింది. ‘‘ఈత కొట్టేటప్పుడు మొదటి రెండు గంటలూ ఎప్పుడూ కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే రాబోయే కొన్ని గంటలు అక్కడే ఉండాలనే నిజం మీ ఆలోచనల్ని నిలవనివ్వకుండా చేస్తుంది. నేను ఈత కొడుతున్న సమయంలో నిద్రవచ్చినట్టనిపించింది. నా కళ్ళు మూసుకొని, నిద్రలోకి జారిపోతానేమో అనిపించింది. ఎందుకంటే నేను చీకట్లో మొదలు పెట్టాను. కానీ కొద్ది సేపటికి ఆకాశంలోకి సూర్యుడు వచ్చాడు. నా నిద్ర ఎగిరిపోయింది. తొలి రెండు గంటల తరువాత... వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. గాలి తీవ్రత, నీటిలో కల్లోలం తగ్గిపోయాయి. నేను కోరుకున్నదీ అలాంటి వాతావరణాన్నే’’ అంటోందామె. 11 గంటల 48 నిమిషాలు ఈది... గమ్యానికి చేరుకున్న ప్రిషా... ఇంగ్లీష్ ఛానెల్‌ను ఈదిన అతి పిన్నవయస్కురాలైన బ్రిటి్‌ష-ఇండియన్‌గా గుర్తింపు పొందింది. తన సాహసంతో 3,700 పౌండ్లు (దాదాపు నాలుగు లక్షల రూపాయలకు పైగా) సేకరించింది. దాన్ని బ్రిటన్‌లో, ఇండియాలో పేద పిల్లల ఆకలి తీర్చడం కోసం ‘అక్షయపాత్ర ఫౌండేషన్’కు విరాళంగా ఇచ్చింది. నేను దీన్ని సీరియ్‌సగా తీసుకోవడానికి మరో ప్రధాన కారణం... ఇక్కడున్న ఆసియన్ కమ్యూనిటీని క్రీడల దిశగా ప్రోత్సహించడం. ఆసియన్ అమ్మాయిల్లాంటి జాతిపరమైన మైనారిటీలు స్విమ్మింగ్ లాంటి పోటీ క్రీడల్లో ఎక్కువగా నాకు కనిపించలేదు. వాళ్ళకు నా ప్రయత్నం ప్రేరణ కలిగించాలని కోరుకుంటున్నాను’’ అని చెబుతున్న ప్రిషా భవిష్యత్ ప్రణాళికలేమిటి? ‘‘వైద్యరంగంలోకి వెళ్ళాలనేది నా కోరిక. కానీ స్విమ్మింగ్‌ను కొనసాగిస్తాను. ఇరవై నాలుగు గంటల పాటు స్విమ్మింగ్ చెయ్యాలనేది నా తరువాతి లక్ష్యం. అది త్వరలోనే నెరవేరుతుందని ఆశిస్తున్నాను’’ అని అంటోంది ప్రిషా.
‘‘నేను ఇంగ్లీష్ ఛానెల్ ఈదానంటే ఇంకా నమ్మలేకపోతున్నా. చదువును, స్విమ్మింగ్ శిక్షణను జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవడం వల్లే ఇది సాధ్యమయింది. కొన్నిసార్లు ఆరు నుంచి పది గంటలు శిక్షణలోనే ఉండేదాన్ని. నాకు మా అమ్మ స్ఫూర్తి. నా వయసులో ఆమె మంచి అథ్లెట్. ఏదైనా అనుకుంటే సాధించే వరకూ విశ్రమించవద్దని ఎప్పుడూ చెబుతూ ఉంటుంది. నన్ను నేను నిరూపించుకోవడానికి ఏదైనా పెద్ద పని చెయ్యాలనుకున్నాను. ఏదైనా భిన్నంగా చెయ్యాలనుకున్నాను. నన్ను నేను సవాల్ చేసుకోవాలనుకున్నాను. జీవితంలో ఈ రోజు కోసం చాలా కష్టపడ్డాను. ఇప్పుడు అందరూ అభినందిస్తూ ఉంటే... సంతోషంగా అనిపిస్తోంది. నా జర్నీలో ఇది ఆరంభం మాత్రమే.’’
Updated Date - Sep 16 , 2024 | 04:33 AM